Chennai : లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు తిరుమీయచ్చూర్‌...

ABN , First Publish Date - 2021-08-23T16:52:19+05:30 IST

తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తిరుమీయచ్చూర్‌‌లోని లలితాంబికాదేవి దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను...

Chennai : లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు తిరుమీయచ్చూర్‌...

తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తిరుమీయచ్చూర్‌‌లోని లలితాంబికాదేవి దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శివుని మందిరం ఆయుష్‌ హోమాలతో, అరవై, ఎనభై సంవత్సరాల వృద్ధుల జన్మదిన ప్రత్యేక పూజలతో, అభిషేకాలతో, అర్చనలతో అలరారుతుంటుంది. ఈ దేవాలయ దర్శనం సర్వపాప ప్రక్షాళన గావిస్తుందంటారు. అంతేకాదు, ఇక్కడి స్వామిని ప్రార్థిస్తే పెళ్లికాని యువతులకు వెంటనే కళ్యాణప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనీశ్వరుడు, గరుడుడు, సూర్యరథసారధి అయిన అరణుడు, యముడు, వాలి, సుగ్రీవులు ఇక్కడ జన్మించారని భక్తుల నమ్మకం. - వేళచ్చేరి


సకల భువనేశ్వరుడు, మేఘనాథుడు మొదలైన నామాలతో ఇక్కడ విరాజిల్లుతున్న పరమేశ్వరుడికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక సందర్భాలలో విశేష పూజలు జరుగుతుంటాయి.ఎంతోమంది తమ షష్ఠిపూర్తి ఉత్సవాలను, సహస్ర పూర్ణ చంద్రదర్శన పండుగ సమయాలు, ఆయుష్‌ హోమాలు, మృత్యుంజయ హోమాలు తిరుమీయచ్చూరులోని పరమేశ్వరుని సన్నిధిలో నిర్వహించి ఆ దేవదేవుని ఆశీస్సులనందుకుంటారు. ఈ దేవాలయం కావేరీ దక్షిణ తీరంలోని 56వ శివాలయంగా ఎంచబడింది. భక్తగ్రేసరుడైన జ్ఞానసంబందర్‌ తన ‘తేవరమ్‌’ స్తోత్రాలతో ఇక్కడి పరమేశ్వరుని స్తుతించారు. తిరుమీయచ్చూర్‌ దేవాలయంలో శివ పూజలు, అభిషేకాలు, లలితాంబికకు అర్చనలు జరగడంతో పాటు ప్రత్యేకంగా ‘రథసప్తమి’ పండుగ గొప్పగా నిర్వహించబడుతుంది. తమిళ మాసమైన చితిరాయ్‌ (ఏప్రిల్‌-మే)లో సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రసరించి స్వామి చరణాలను తాకుతాయి.


ఈ దేవాలయంలో ఎన్నో ఉపాలయాలను చూడొచ్చు. ఇక్కడి కాళికాదేవి మందిరం కూడా దర్శించదగింది. ఎనిమిది చేతులతో మహిషాసురమర్ధినిగా ఉన్న ఆమెను దుర్గాదేవిగా శుకమహర్షి స్తోత్రం గావించాడు. వేదవ్యాసుని కుమారుడైన శుకమహర్షి చిలుక ముక్కు కలిగిన వాడు. భక్తుల కోరికలను కాళికాదేవి చిలుక ద్వారా లలితాంబికకు తెలియజేస్తుందని, అందుకే ప్రతి నిత్యం ఒక చిలుక సాయం సమయాలలో లలితాండిక గుడిపైన ఎగురుతుందని 


అక్కడ ప్రచారంలో ఉన్న కథ..

తిరుమీయచ్చూరు మరో ప్రత్యేకత ఏమంటే, ఈ దేవాలయంలో రెండు శివమూర్తులు, రెండు పార్వతీమూర్తులు పూజలందుకోవడం. ఈ విశేషం తమిళనాట తిరుమీయచ్చూరు. తిరువారూరు, తిరుప్పగతూరు దేవాలయాల్లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రదేశంలోనే సూర్యుడికి శాప విమోచనం కలిగిందని పెద్దలు చెబుతారు. సూర్య రథసారధి అయిన అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయడంతో బాటు అతని శివపూజను అడ్డుకోవడంతో శివుడు కోపించి సూర్యుని శపించాడు. శాపవిమోచన ఓసం సూర్యుడు అర్థించగా, 7 నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్ఠింపజేసి మేఘాలపై నుంచి, అర్చనగావించాలని అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని శివుడు పలుకగా, అదేవిధంగా చేసిన  సూర్యుడు శాపం నుంచివిముక్తి పొందాడని అంటారు. దాని గుర్తుగా గజవృష్ట వాహనంపై అధిష్ఠించినట్టు చెక్కబడిన శివపార్వతుల విగ్రహాలను ఇక్కడ దర్శించవచ్చు.


తిరుమీయచ్చూరు ఎక్కడ ఉంది?

తిరువారూర్‌ జిల్లాలో మైలాడుదురైకి 12 కి.మీ దూరంలో తిరుమీయచ్చూరు ఉంది. మైలాడుదురై నుంచి బస్సు సౌకర్యం ఉంది. పేరాలం నుంచి 2. కి.మీ, తిరువారూరు నుండి 25 కి.మీ, కుంభకోణం నుంచి 33 కి.మీ దూరంలో ఉన్న తిరుమీయచ్చూర్‌కి బస్సు లేదా టాక్సీలలో చేరుకోవచ్చు.


దర్శన వేళలు ఇవీ..

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు దేవాలయాన్ని దర్శించుకోవచ్చు.


దేవాలయ విశేషాలు

తిరుమీయచ్చూర్‌ శ్రీ మేఘనాథస్వామి ఆలయంలోని ఈశ్వరుడు స్వయంభూనాధుడు. లలితాంబిక పేరుతో అమ్మవారు శ్రీ చక్రరాజ సింహాసనంపై అధిష్ఠించి భక్తులకు అభయమిస్తూ అభయముద్రలో ఠీవిగా మహారాణిలా ఆశీనురాలై, చిరునవ్వులు చిందిస్తూ కళకళలాడే మోముతో మనకు దర్శనమిస్తుంది. ఆమె ప్రాం గణంలో లలితా సహస్రనామాలు, లలితా నవరత్నమాలా పారాయణ చేసే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయాలని భక్తులు కోరుకుంటారు.


ఆలయ ప్రాశస్త్యం

తిరుమీయచూర్‌ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైనదని చరిత్రకారుల భావన. రాక్షసుడు రుషులను, దేవతలను బాధిస్తుండగా వారంతా జగన్మాతకు విన్నవించుకున్నారు. వారి కోరికను మన్నించి ఆమె పండాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. రాక్షస వధానంతరం కూడా ఆమె కోపం తగ్గకపోవడంతో ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించగా ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా కరుణామయిగా మారింది. ఆమే ఈ లలితాబింక అని పురాణకథనం. హయగ్రీవుడు లలితాదేవి భక్తుడు. లలితా సహస్రనామ మహత్యాన్ని అగస్త్య మహర్షికి తెలియజేశాడు హయగ్రీవుడు. అప్పుడు లలితా సహస్రనామ పారాయణకు అనువైన స్థలం తెలియజేయమని ఆగస్త్యుడు హయగ్రీవుని కోరాడు. హయగ్రీవుడు భూలోకంలో మనోన్మణి రూపంలో సౌందర్యనాయకి విరాజిల్లుతున్నదని అగస్త్యునికి తెలియజేస్తాడు. అనంతరం అగస్త్యుడు తన పత్ని లోపాముద్రతో కలసి తిరుమీయచ్చూర్‌ ఏతెంచి అక్కడ లలితాంబిక సన్నిధిలో లలితా సహస్రనామం, తను విరచించిన లలితా నవరత్నమాల పారాయణ గావించాడని ప్రాంతీయ కథనం. 


12 నాగమూర్తులు...

ఈ దేవాలయంలో నవగ్రహాలు లేకపోయినా, 12 రాశులకు చిహ్నంగా, 12 నాగమూర్తులు ఇక్కడ పూజలందుకుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు సల్పితే అన్ని గ్రహదోషాల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో పుష్కరిణి ‘సూర్య తీర్థం’ పేరుతో విలసిల్లుతున్నది. తిరుమీయచ్చూర్‌ దేవాలయంలో శిల్పకళ ఉట్టిపడుతుంది. ప్రాంగణంలోని ‘శివశక్తి’ శిల్పం సందర్శకులనెంతో ఆకట్టుకొంటుంది. శివుడు కోపంతో ఉన్న పార్వతిని అనునయిస్తున్నట్టు చెక్కబడిన ఈ శిల్పం, ఆమె మోములో ఒక వైపు క్రోధం, మరోవైపు చిరునవ్వు కనువిందు కలిగిస్తూ శిల్పాచార్యుల నైపుణ్యానికి దర్పణంగా నిలిచింది. తిరుమీయచ్చూరు లలితాంబిక విగ్రహమూర్తి అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతుంటుంది. భక్తుల పాలిట పెన్నిధిగా, శివపార్వతుల సన్నిధికి ఆలవాలమై, తిరుమీయచ్చూరు లలితా సహస్రనామాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతిగాంచింది.

Updated Date - 2021-08-23T16:52:19+05:30 IST