నూతనోత్తేజం.. విభేదాలమయం.. TRS ఆవిర్భావ వేడుకల్లో వింత పరిస్థితి.. వార్‌ కొనసాగుతోంది..!

ABN , First Publish Date - 2022-04-29T14:25:13+05:30 IST

ఆవిర్భావ వేడుకలు టీఆర్‌ఎస్‌ పార్టీలో నూతనోత్తేజాన్ని నింపాయి. పండుగలా నిర్వహించాలన్న ..

నూతనోత్తేజం.. విభేదాలమయం.. TRS ఆవిర్భావ వేడుకల్లో వింత పరిస్థితి.. వార్‌ కొనసాగుతోంది..!

  • కొన్ని చోట్ల ఘనంగా కార్యక్రమాలు
  • మరికొన్ని చోట్ల భగ్గుమన్న విభేదాలు 
  • ఎమ్మెల్యేలు వర్సెస్‌ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు
  • అధికార పార్టీలో కొనసాగుతున్న వార్‌


ఆవిర్భావ వేడుకలు టీఆర్‌ఎస్‌ పార్టీలో నూతనోత్తేజాన్ని నింపాయి. పండుగలా నిర్వహించాలన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపు మేరకు పోటీపడి మరీ నేతలు కార్యక్రమాలు నిర్వహించారు. పదవిలో ఉన్న వారు పట్టు నిలుపుకునే దిశగా.. అవకాశం కోసం ఎదురుచూస్తోన్న వారు తగిన గుర్తింపు కోసం శ్రమించారు. గతంతో పోలిస్తే కొత్త నాయకులు కొందరు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో చురుకుగా పాల్గొన్నారు. కార్యకర్తలను సమీకరించి ఘనంగా వేడుకలు నిర్వహించి బల ప్రదర్శన వేదికగా మార్చుకున్నారు.


హైదరాబాద్‌ సిటీ : యేడాదిన్నరలో అసెంబ్లీ కాలవ్యవధి ముగియనున్న నేపథ్యంలో అధికార పార్టీలో నయా జోష్‌ కనిపించింది. డివిజన్ల కమిటీలు వేయడమూ ఆవిర్భావ వేడుకల నిర్వహణ భారీగా జరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు.  పలు నియోజకవర్గాల్లో పోటాపోటీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇవి పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్యుద్ధాలను బహిర్గతం చేశాయి. అందరూ కలిసి ముందుకు సాగాలన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారు. అంబర్‌పేట నియోజకవర్గంలో తనను చంపుతాననే వారిని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నాడని గోల్నాక కార్పొరేటర్‌ భర్త పోస్టు చేయడం కలకలం రేపింది.


- ఉప్పల్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లోనూ అదే పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మేయర్‌, మరో నాయకుడు పోటాపోటీగా ప్లీనరీ స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ప్రజల దృష్టిలో పడేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. కొన్ని డివిజన్లలో పార్టీ అధ్యక్షులూ కార్పొరేటర్ల స్థాయిలో భారీ ర్యాలీలు నిర్వహించారు. 


- ముషీరాబాద్‌లో మూడు ముక్కలాట మొదలైంది. ఎమ్మెల్యేతోపాటు.. మరో ఇద్దరు నాయకులు ఎవరికి వారన్నట్టు వ్యవహరిస్తున్నారు. మాజీ హోంమంత్రి సొంత నియోజకవర్గంలో తమకు తగిన ప్రాధాన్యం లేదని ఆయన వర్గీయులు వాపోతున్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరిన మరో నాయకుడూ.. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆవిర్భావ వేడుకల్లోనూ మూడు వర్గాల పోరు కనిపించింది. 


- కంటోన్మెంట్‌ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే సాయన్న, అదే నియోజకవర్గంలో నివసించే పలు కార్పొరేషన్ల చైర్మన్లు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఇతర సందర్భాల్లోనూ పలు కార్యక్రమాలు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. 


- ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య పోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన సుధీర్‌రెడ్డి తీరుపై అంతకుముందు టీఆర్‌ఎస్‌ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొత్తపేటలో సీఎం కేసీఆర్‌ హాజరైన ఆస్పత్రి భవనం శంకుస్థాపన స్థలం వద్ద ఉన్న మాజీ కార్పొరేటర్లు కొందరిని పోలీసులు అక్కడి నుంచి పంపించారు. అదేంటని అడిగితే.. ఎమ్మెల్యే సూచన అంటూ వారు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కార్యక్రమం కోసం వచ్చిన పాసులనూ ఎమ్మెల్యే మాజీలకు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి. 


- కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గంలో కార్పొరేటర్లు భారీగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేను కొందరు ఆహ్వానించ లేదు. శాసనసభ్యుడి తీరుపై అసంతృప్తిగా ఉన్న పలువురు కార్పొరేటర్లు ఆయనతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్లీనరీకి వారు వేరుగా వెళ్లడం గమనార్హం.


అంబర్‌పేటలో కలకలం..

అంబర్‌పేటలో ఆవిర్భావ వేడుకల నిర్వహణ అగ్గి రాజేసింది. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, గోల్నాక కార్పొరేటర్‌ దూసరి లావణ్య శ్రీనివా్‌సగౌడ్‌ల మధ్య భేదాభిప్రాయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. శాసనసభ్యుడి తీరుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని మాజీ కార్పొరేటర్లు ఏకమయ్యారు. వారు నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశానికి ప్రస్తుత కార్పొరేటర్‌ లావణ్య హాజరయ్యారు. దీనిపై ఎమ్మెల్యే అనుచరులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. తన సతీమణి టికెట్‌ను దానం చేస్తే గెలిచిన లావణ్య ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించడం సమంజసం కాదని ఓ నాయకుడు వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు.


                        అసమ్మతి నేతల మీటింగ్‌కు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీనిపై కార్పొరేటర్‌ భర్త శ్రీనివా‌స్‌గౌడ్‌ తీవ్రంగా స్పందించారు. తనకు ఎవరూ టికెట్‌ దానం చేయలేదని, ఆయనకు ఎమ్మెల్యేగా ఎలా అవకాశం వచ్చిందో.. తాము కేటీఆర్‌, హరీ‌ష్‌రావుల ఆశీస్సులతో పోటీ చేసి గోల్నాక ప్రజల ఆదరణతో విజయం సాధించామని పేర్కొన్నారు. డివిజన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తమకు ప్రొటోకాల్‌ ప్రకారం సమాచారం ఇవ్వడం లేదని, మహిళ అని చూడకుండా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపుతానని బెదిరిస్తోన్న వారిని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని శ్రీనివాస్‌ తన సందేశంలో పేర్కొనడం కలకలం రేపింది. తనకు జరుగుతోన్న అవమానాలు, తనతో ఉంటోన్న వారిని బెదిరిస్తోన్న తీరును కేటీఆర్‌, హరీ్‌షరావుల దృష్టికి తీసుకెళ్తానని కార్పొరేటర్‌ భర్త పేర్కొన్నారు.




ఇవి కూడా చదవండిLatest News in Telugu

Updated Date - 2022-04-29T14:25:13+05:30 IST