90 నిమిషాలు.. 6 అంశాలు.. ట్రంప్, బైడెన్.. ఎవరేం చెప్పారు..?

ABN , First Publish Date - 2020-10-23T19:52:32+05:30 IST

అమెరికా అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన అధ్యక్ష అభ్యర్థులైన ట్రంప్, బైడెన్ మధ్య ఫైనల్ డిబేట్ ముగిసింది. గురువారం రాత్రి జరిగిన ఈ డిబేట్‌లో మొత్తం ఆరు అంశాలు చర్చలోకి వచ్చాయి. ముందుగానే నిర్ణయించిన ఈ ఆరు అంశాలపై అభ్యర్థులిద్దరూ ప్రసంగించడమే కాకుండా.. ప్రత్యర్థిని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలూ సంధించారు..

90 నిమిషాలు.. 6 అంశాలు.. ట్రంప్, బైడెన్.. ఎవరేం చెప్పారు..?

వాషింగ్టన్: అమెరికా అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన అధ్యక్ష అభ్యర్థులైన ట్రంప్, బైడెన్ మధ్య ఫైనల్ డిబేట్ ముగిసింది. గురువారం రాత్రి జరిగిన ఈ డిబేట్‌లో మొత్తం ఆరు అంశాలు చర్చలోకి వచ్చాయి. ముందుగానే నిర్ణయించిన ఈ ఆరు అంశాలపై అభ్యర్థులిద్దరూ ప్రసంగించడమే కాకుండా.. ప్రత్యర్థిని ఇరుకున పెట్టే విధంగా ప్రశ్నలూ సంధించారు. కరోనాపై పోరు, అమెరికన్ కుటుంబాల సంరక్షణ(హెల్త్ కేర్), జాత్యాహంకారం, పర్యావరణ మార్పులు, దేశ రక్షణ, నాయకత్వం... ఈ ఆరు అంశాలపై ట్రంప్, జో బైడెన్ ముఖాముఖి తలపడ్డారు.. ఈ డిబేట్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన మ్యూట్ బటన్ వల్ల అభ్యర్థుల మధ్య గతంతో పోల్చితే వాదోపవాదాలు కాస్త తగ్గాయి. ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుతగలడం వంటివి ఈ డిబేట్‌లో కనిపించలేదు.. ఈ డిబేట్‌ను ఓ అవకాశంగా మలచుకుని నవంబర్ 3న జరగబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని ట్రంప్ ప్రయత్నించారు. ఆ దిశగానే తన ప్రసంగం ఉండేట్టు చూసుకున్నారు. గడచిన నాలుగేళ్లలో ఏం చేశారన్నది చెబుతూనే.. రాబోయే రోజుల్లో ఏం చేస్తానన్నది కూడా వివరించారు. ఇక జో బైడెన్ కూడా ఈ ఆరు అంశాలపై తన ప్రణాళికలను వివరించారు. ఈ నాలుగేళ్ల కాలంలో ట్రంప్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ.. తానేం చేస్తానన్నది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొత్తానికి మొదటి డిబేట్‌లో ఇద్దరి మధ్య జరిగిన చర్చ కాస్తా రచ్చగా మారి.. ఎవరికీ లాభం లేకుండా పోగా.. ఈ ఫైనల్ డిబేట్ మాత్రం ఇద్దరికీ కాస్త ఫలితానిచ్చేదిగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 


గురువారం రాత్రి 9గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) ‘కరోనా మహమ్మారిపై పోరు’ అంశంతో ఈ 90 నిమిషాల చర్చ ప్రారంభమయింది. ముందుగా మాట్లాడిన ట్రంప్.. తాను అధ్యక్షుడిగా ఉండటం వల్లే కరోనా తీవ్రత అమెరికాలో చాలా తక్కువగా ఉందని.. తానే లేకుంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ‘కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కాబోతోంది.. నేను కరోనా నుంచి కోలుకున్నా.. నాలాగే అందరూ కరోనా నుంచి బయటపడతారు. అందరికీ రోగ నిరోధక శక్తి వస్తుంది. అప్పుడు కరోనా మనల్ని ఏమీ చేయలేదు. మనం ఈ కరోనాను దేశం నుంచి బయటకు వెళ్లగొట్టబోతున్నాం.. మరి కొన్ని వారాల్లో కరోనాకు వ్యాక్సిన్ వస్తుంది..’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలకు చర్చను నిర్వహించే సమన్వయకర్త అడ్డుతగిలారు. కరోనా వ్యాక్సిన్ కొద్దివారాల్లో అందుబాటులోకి వస్తుందన్నదానికి రుజువును చూపించాల్సిందిగా కోరారు. దీనికి స్పందించిన ట్రంప్.. ‘కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి నేను చెప్పింది అమెరికన్లకు నేను ఇస్తున్న హామీ కాదు.. ఓ ఆశ.. ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్ అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. అదే మాటను నేను చెబుతున్నా.. కరోనాతో కలిసి బతకడం తప్పనిసరి.. అన్ని వ్యవస్థలను కరోనాకు పూర్వం ఉన్న స్థితికి తేవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆర్థికంగా అమెరికా మరింత నష్టపోతుంది. ఈ కరోనా విపత్తుకు నన్ను బాధ్యత వహించమని కొందరు అంటున్నారు. సరే.. నేనే భాద్యత వహిస్తా.. అయితే తప్పు నాదా..? ఇప్పుడు అందరూ మాస్కులు వేసుకుని తిరగాల్సి వస్తోందంటే దానికి ప్రధాన కారణం చైనాయే.. ఈ విపత్తుకు నేనో, జో బైడెనో కారణం కాదు.. అమెరికాలోని ఏ ఒక్క పౌరుడు కారణం కాదు.. అసలు దోషి చైనాయే..’ అని ట్రంప్ తేల్చిచెప్పారు.. 


ఆ తర్వాత మాట్లాడిన జో బైడెన్.. ‘కరోనాతో కలిసి జీవించాలని చెబుతున్నారు.. ఇక్కడ ప్రజలు చనిపోతున్నారు మిస్టర్ అధ్యక్షా.. నేను అధికారంలోకి వస్తే అమెరికాను కాదు.. వైరస్‌ను షట్‌డౌన్ చేస్తా.. ఈ కరోనా మహమ్మారి ఇంతలా విజృంభించడానికి, రెండు లక్షల మందికి పైగా అమెరికన్ల మరణాలకు కారణమైన ట్రంప్.. అధ్యక్ష పదవిలో  ఉండటానికి అర్హుడు కాదు.. శీతాకాలం రాబోతోంది.. కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం ఉంది.. మనం మరిన్ని చీకటి రోజులను ఎదుర్కోబోతున్నాం.. కరోనాను కంట్రోల్ చేయడానికి, వ్యాక్సిన్ పంపిణీకి ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు.. ప్రజలను గాలికి వదిలేశారు. చైనా నుంచి రాకపోకలను ఎప్పుడో ఆపేయాల్సింది.. ట్రంప్ నిర్లక్ష్యం వల్ల వైరస్ అమెరికా నలుమూలలా వ్యాపించింది. కరోనా వైరస్ ప్రమాదకారి అని, దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని ట్రంప్ ఇప్పటికీ చెప్పడం లేదు.. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పాల్సిన మాటలేనా.. ఇవి..?’ అని జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కరోనా తర్వాత.. అమెరికన్ల భద్రత(హెల్త్ కేర్ పాలసీ)పై చర్చ జరిగింది.. ‘నేను అధ్యక్ష బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత ఒబామా కేర్‌ను రద్దు చేశా.. దానికంటే మెరుగైన పాలసీని అమెరికన్లకు అందించాను. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఆరోగ్య విధానాలను రూపొందిస్తాం. మేమే అధికారంలోకి వస్తాం.. హెల్త్ కేర్ విషయంలో మా ప్రాధాన్యాలు ఏంటో మీరే చూస్తారు..’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి జో బైడెన్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ‘అమెరికన్లు మేలు చేసే ఒబామా కేర్‌ను ట్రంప్ రద్దు చేశారు. ఆ తర్వాత దానికంటే మెరుగైన విధానాన్ని రూపొందిస్తానన్నారు.. కానీ ఆ మేరకు చర్యలు చేపట్టలేదు.. అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న అమెరికన్లకు చికిత్స విషయంలో ఎలాంటి ప్రణాళికలు ట్రంప్ వద్ద లేవు. మేము అధికారంలోకి వస్తే ప్రజల ఆరోగ్యమే మా ప్రధమ ప్రాధాన్యం.. ఒబామా కేర్ పాలసీని అందుబాటులోకి తెస్తాం.. దాంతో పాటు బైడెన్ కేర్‌ను కూడా రూపొందిస్తాం.. ఏది ఎంచుకోవాలన్నది ప్రజల ఇష్టానికే వదలేస్తాం. హెల్త్ కేర్ అనేది ప్రతి ఒక్క అమెరికన్ హక్కు..’ అని బైడెన్ తేల్చిచెప్పారు. 


హెల్త్ కేర్‌పై చర్చ ముగిసిన తర్వాత.. జాత్యాహంకారంపై ట్రంప్, బైడెన్ మధ్య వాగ్వాదం జరిగింది. ‘ఈ గదిలో.. ఇక్కడ ఉన్నవారిలో అత్యంత తక్కువ జాత్యాహంకారం ఉన్న వ్యక్తిని నేనే.. నల్ల జాతీయులకు నేనే చేసినంత సేవ ఇంతవరకు ఏ అధ్యక్షుడూ చేయలేదు.. అప్పట్లో అబ్రహాం లింకన్ నల్లజాతీయుల ఉన్నతికి దోహదం చేశారు.. ఆయన తర్వాత వారి అభ్యున్నతికి నేనే ఎక్కువ కృషి చేశా..’.. అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఓ నల్లజాతీయురాలైన మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అక్రమంగా వలస వచ్చి.. అమెరికాలో ఉంటున్న నల్లజాతీయులను దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ దేశంలోనే పుట్టిన వారి పిల్లలను వారి నుంచి సరిహద్దుల వద్ద బలవంతంగా వేరు చేస్తున్నారు. ఇది మరింత బాధాకరం.. అనుభవించిన వారికే ఆ గుండెకోత అర్థం అవుతుంది..’ అని ఆమె వాపోయారు. అయితే ఈ క్రమంలో ట్రంప్ దాటవేత దోరణిని అవలంబించారు. చర్చను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. ఒబామా హయాంలో ఏర్పాటు చేసిన అక్రమ వలసదారుల పునరావాస కేంద్రాల గురించి చర్చను లేవనెత్తారు. వాటిని పంజరాలుగా అభివర్ణించారు. వలసదారులను ఒబామా సర్కారు.. అప్పటి ఉపాధ్యక్షుడైన జో బైడెన్ ఎంత చిత్రహింసలకు గురిచేశారో చెప్పుకొచ్చారు. 


ట్రంప్ కామెంట్స్‌పై జో బైడెన్ వెరైటీగా స్పందించారు. తనను తాను దివంగత మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌తో ట్రంప్ పోల్చుకోవడంపై వ్యంగాస్త్రాలు సంధించారు. ‘అత్యంత ప్రమాదకర జాత్యాహంకారిగా అబ్రహాం లింకన్‌ను ఆధునిక అమెరికా సమాజం చూస్తోంది.. ప్రతి అమెరికన్ పౌరుడిలో జాత్యాహంకార భావాలను ఆయన రెచ్చగొట్టారు..’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు ట్రంప్ వెంటనే రియాక్టయ్యారు.. ‘అబ్రహాం లింకన్ జాత్యాహంకారి అనడానికి మీ వద్ద సాక్ష్యాలున్నాయా..? ఏ ఆధారాలను బట్టి మీరు ఈ విపరీత కామెంట్స్ చేశారు. దీనికి మీరు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది..’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బైడెన్ చాలా కూల్‌గా ‘నేను ఆధునిక అబ్రహం లింకన్‌ను అని నువ్వే కదా చెప్పుకున్నావు..’ అంటూ ట్రంప్‌పై వ్యంగాస్త్రం సంధించారు. దీనికి ట్రంప్ కాస్త తడబడుతూ.. ‘నో.. నో... నేను అబ్రహం లింకన్‌ను అని అనలేదు.. అబ్రహం లింకన్ తర్వాత.. నల్లజాతీయులైన అమెరికన్లకు నేను చేసినంత సేవ.. గత అమెరికన్ అధ్యక్షులెవరూ చేయలేదు.. అని మాత్రమే అన్నాను..’ అని వివరణ ఇచ్చుకున్నారు. ఇదే సమయంలో జో బైడెన్ ట్రంప్‌పై నిప్పులు చెరిగారు.. ‘2016 ఎన్నికల సమయంలో మెక్సికన్లను రేపిస్టులుగా ట్రంప్ అభివర్ణించారు. ఆయన పాలనలో అమెరికాలో ఎన్ని జాత్యాహంకార దాడులు జరిగాయో లెక్కలేదు. అమెరికన్లలో జాత్యాహంకార విషబీజాలను ట్రంప్ నాటుతున్నారు. ఇది దేశానికే తీవ్ర నష్టం.. మేము అధికారంలోకి వస్తే ఇలాంటి సంఘటనలు జరగడానికి తావివ్వం.. వలసదారుల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తాం..’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. కోటి మందికి పైగా అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తామని జో బైడెన్ ఇప్పటికే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. 


జాత్యాహంకార దాడుల అంశం తర్వాత... పర్యావరణంపై అభ్యర్థులిద్దరి మధ్య చర్చ జరిగింది. ‘పునరుత్పాదక శక్తిని పెంపొందించేలా మరిన్ని చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది.. ఇదే తరుణంలో పవన విద్యుత్ వల్ల కేన్సర్ వస్తుందని ట్రంప్ గతంలో అన్నారు. వీటిపై కూడా చర్చించాలి..’ అని జో బైడెన్ ఎద్దేవా చేశారు. దీనిపై ట్రంప్ వెంటనే రియాక్టయ్యారు. ‘పవన విద్యుత్ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. అది పక్షులను చంపేస్తుంది.. చాలా ఖరీదైనది కూడా.. దీనికంటే సోలార్ విద్యుత్ చాలా మంచిది. కానీ భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఇంకా పరిస్థితులు అనుకూలంగా లేవు..’ అని ట్రంప్ అన్నారు. ‘ఇక్కడ పర్యావరణానికి ఏదో జరిగిపోతోందని బాధపడిపోతున్నారు. మనకంటే దారుణంగా భారత్‌లో మురికి గాలి ఉంది.. చైనా, ఇటలీల్లో అంతే దారుణ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. పారిస్ పర్యావరణ ఒప్పందానికి లోబడి నేను అమెరికాలో లక్షల ఉద్యోగాలను, వేలాది కంపెనీలను త్యాగం చేయదలచుకోలేదు. అందుకే ఆ ఒప్పందం నుంచి బయటికొచ్చా..’ అని ట్రంప్ తేల్చిచెప్పారు. దీనిపై స్పందించిన బైడెన్.. ‘వాతావరణ మార్పు అనేది మానవాళి అస్తిత్వానికి ముప్పు. దీనిని ఎదుర్కునే నైతిక బాధ్యత మాకు ఉంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పారిస్ ఒప్పందంలోకి మేం చేరతాం" అని సమాధానమిచ్చారు. 


ఇక ఆ తర్వాతి చర్చ దేశ రక్షణపై జరిగింది. ప్రపంచంపై పెద్దన్న పాత్రను కాపాడుకుంటూనే.. అమెరికా రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముందుగా జో బైడెన్ మాట్లాడుతూ ‘ఎవరైనా సరే... ఏ దేశమైనా సరే... అమెరికా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని నేను స్పష్టంగా పేర్కొంటున్నాను’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే తరుణంలో ట్రంప్ విదేశాంగ విధానాలపై బైడెన్ విమర్శలు గుప్పించారు. ఎలాంటి ముందస్తు హామీలు లేకుండా ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌ను ట్రంప్ కలవడాన్ని ఎత్తి చూపారు. రెండు మూడు సార్లు కిమ్ జాంగ్‌తో సమావేశాలు జరిపినా.. ఎలాంటి ఫలితం వచ్చిందో చెప్పాలని ట్రంప్‌ను నిలదీశారు. గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచేందుకు రష్యా తోడ్పాటునందించిందని రుజువులు కూడా ఉన్నాయన్నారు. ‘నేనేంటో.. నా విధానాలు ఏంటో రష్యాకు తెలుసు.. అందుకే ట్రంప్‌ను మళ్లీ అధ్యక్షుడిగా చేసేందుకు ప్రయత్నిస్తోంది. నేను గెలిస్తే వాళ్ల ఆటలు సాగవు..’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.  ట్రంప్ నాలుగేళ్ల పాలనలో విదేశాలతో సంబంధాలను పూర్తిగా కోల్పోయామనీ.. ఆ సంబంధాలను పునరుద్ధరించేందుకు వేగవంతమైన చర్యలను తీసుకుంటామన్నారు. దీనికి స్పందించిన ట్రంప్... బైడెన్‌పై ఎదురుదాడి చేశారు. ఈ ఎన్నికల్లో బైడెన్‌కు రష్యా ఆర్థిక సాయం చేస్తోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో రష్యా నుంచి ఒక్క డాలర్ కూడా తాను తీసుకోలేదని ట్రంప్ తేల్చిచెప్పారు.. ఇదే సమయంలో బైడెన్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. ‘ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా బైడెన్ ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు బైడెన్ ఇస్తున్న ఈ హామీలను అప్పుడే ఎందుకు అమలు చేయలేదు.. ఇన్నేళ్లు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు..’ అని ట్రంప్ నిలదీశారు. ఏదో చేస్తామని కల్లబొల్లి హామీలు ఇస్తే నమ్మడానికి అమెరికన్లు అమాయకులు కాదని ట్రంప్ ఎద్దేవా చేశారు. 


ఇక చివరగా తమ నాయకత్వంపై అమెరికన్లకు నమ్మకం కలిగేలా ఇరువురూ మాట్లాడారు.. ‘అమెరికా ఆర్థిక వ్యవస్థను కరోనా ముందటి రోజుల్లో ఎలా ఉందో.. అలా తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి రాకముందు నా ప్రభుత్వం వల్ల మీ జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో ప్రతి ఒక్క పౌరుడు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. విజయం మనల్ని మళ్లీ కలిసేలా చేస్తుంది. మనం గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నాం..’ అని ట్రంప్ ముగింపు ప్రసంగం చేశారు. ‘కరోనాయే కాదు ఎలాంటి విపత్తు ఎదురైనా నేను మీకు అండగా ఉంటాను. సమస్యను త్వరితగితిన పరిష్కరిస్తాను. నాకు ఓటేశారా లేదా.. అన్నది చూడను.. అమెరికన్లందరికీ నేను ప్రాతినిధ్యం వహిస్తాను. విపత్తులను అవకాశాలుగా మార్చుకుందాం.. కాల్పనికతపై సైన్స్‌కు, భయంపై ఆశలకు అవకాశం కల్పించండి..’ అని బైడెన్ ముగింపు ప్రసంగం చేశారు.. 


మొత్తానికి ఈ ఫైనల్ డిబేట్‌లో ట్రంప్, బైడెన్ మధ్య పెద్దగా వాదోపవాదాలు లేకుండానే ఆయా అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగింది.. కొత్తగా ప్రవేశ పెట్టిన ‘మ్యూట్ బటన్’ కూడా ఇందుకు దోహదం చేసింది. అమెరికన్లకు తనపై నమ్మకం కలిగించేందుకు ఇదే తనకు చివరి అవకాశం అని ట్రంప్ భావించడం కూడా.. ఈ చర్చ సజావుగా సాగడానికి ఓ ప్రధాన కారణం.. అమెరికన్లకు తానేం చేశానో.. గెలిస్తే ఏం చేస్తానో చెప్పేందుకు ట్రంప్ ఈ వేదికను ఉపయోగించుకున్నారు. అదే తరుణంలో తన సహజ దోరణిలో బైడెన్‌పై అప్పుడప్పుడు ఆరోపణలతో విరుచుకుపడ్డారు కూడా.. ఇక బైడెన్ కూడా తనకు అవకాశం కల్పించాలని కోరతూ అమెరికన్లకు విన్నవించుకున్నారు. ట్రంప్ ఈ నాలుగేళ్లలో ఏఏ అంశాలపై విఫలం అయ్యారో చెబుతూనే.. ఆయా అంశాలపై తన విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరి ఇరువురి వాదనలు విన్న అమెరికన్లు.. ఎవరి వైపు మొగ్గుచూపుతారో.. ఎవరిని తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారో తెలియాలంటే.. నవంబర్ 3వ తేదీ వరకు ఆగాల్సిందే...

Updated Date - 2020-10-23T19:52:32+05:30 IST