మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

ABN , First Publish Date - 2022-05-29T07:33:42+05:30 IST

జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు.

మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌
సమావేశంలో ప్రసంగిస్తున్న పరమేశ్వరరెడ్డి

ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడి


తిరుపతి(నేరవిభాగం), మే 28: జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఎస్పీ పరమేశ్వరరెడ్డి వెల్లడించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా విస్తృతస్థాయి నేరసమీక్షను శనివారం ఎస్వీయూ సెనెట్‌ హాల్లో నిర్వహించారు. ఆయన మాటల్లోనే.. ‘టాస్క్‌ఫోర్స్‌ ఎక్కడైనా గంజాయి, సారాయి తదితరాలను పట్టుకుంటే.. ఆయా పోలీసు స్టేషన్ల అధికారులు వైఫల్యం చెందినట్టే. దీనికి సంబంధిత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసు శాఖలో అవినీతి అనేదే కనిపించకూడదు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదు అందింతే ఉపేక్షించేది లేదు. ప్రతి ఫిర్యాదునూ ప్రధానమైనదిగానే పరిగణించాలి. డీఎస్పీ స్థాయి అధికారులు ఫిర్యాదులను పరిశీలించి, కిందిస్థాయి అధికారులకు తగిన సూచనలు చేయాలి. సీఐ స్థాయి అధికారులు రోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తమ స్టేషన్ల పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి. దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు పగలు, రాత్రి బీట్‌లు ఏర్పాటు చేయాలి. ఏదేని కేసులో శిక్ష అనుభవించి విడుదలైన నేరస్తులపై తప్పనిసరిగా నిఘా ఉంచాలి. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో స్పీడ్‌ బ్రేకర్లు, జీబ్రా లైన్లు, రేడియం స్టిక్కర్లు, బారికేడ్లు పెట్టాలి. ప్రమాదాలు, నేరాలను అరికట్టి నిత్యం వేలాదిగా వచ్చిపోయే శ్రీవారి భక్తులకు తిరుపతిని సురక్షిత జిల్లాగా ఉంచడానికి అందరూ కృషి చేయాలి. మహిళల భద్రతకు సుదర్శన చక్రం వంటి దిశ యాప్‌పై అవగాహన కల్పించాలి. ప్రతి మహిళ ఫోన్లో ఈ యాప్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలి. దొంగతనాలను అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలి. ఎల్‌హెచ్‌ఎంఎ్‌సపై ప్రజలకు అవగాహన కల్పించాలి’ అని ఎస్పీ వివరించారు. ఏఎస్పీలు సుప్రజ, కులశేఖర్‌, విమలకుమారి, ఆర్టీవో, ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T07:33:42+05:30 IST