‘కాగ్నానది’లో కన్నడిగుల ఇసుక దోపిడీ

ABN , First Publish Date - 2021-01-22T06:02:34+05:30 IST

‘కాగ్నానది’లో కన్నడిగుల ఇసుక దోపిడీ

‘కాగ్నానది’లో కన్నడిగుల ఇసుక దోపిడీ

బషీరాబాద్‌: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కాగ్నానదిలో అక్రమార్కుల ఇసుక దోపిడీ మళ్లీ జోరందుకుంది. తెలంగాణ పరిధిలోని కాగ్నానదిలోకి కన్నడిగులు చొచ్చుకొని వచ్చి కూలీలు, ఎస్‌కావేటర్లతో రాత్రిళ్లు ట్రాక్టర్లలో ఇసుకను నింపి భారీ ఎత్తున తరలించుకుపోతున్నారు. బుధవారం రాత్రి స్థానిక రైతులు కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్రమ ఇసుక రవాణా తరలింపు వెలుగులోకి వచ్చింది. వికారాబాద్‌ జిల్లా తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బషీరాబాద్‌ మండలం క్యాద్గీరా, పోతుగంటి మధ్యన కాగ్నానదిలో ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేసుకుని కన్నడిగులు రాత్రుల్లో ఇసుక దోడిడీకి పాల్పడుతున్నారు. తెలంగాణ నది పరిధిలోకి చొచ్చుకొచ్చి ఎస్‌కావేటర్లతో ఇసుకను తోడి భారీగా ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు స్థానిక రైతులు గత కొంతకాలంగా  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంపై బషీరాబాద్‌ పోలీసులకు బుధవారం రాత్రి స్థానిక రైతులు సమాచారం అందించారు. ఈ నది ప్రాంతాన్ని ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి, సిబ్బందితో వెళ్లి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్రమార్కులు ఖాళీ ట్రాక్టర్లను నదిలో వదిలిపెట్టి పారిపోవడంతో నాలుగు ట్రాక్టర్లను పోలీ్‌సస్టేషన్‌కు తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.

Updated Date - 2021-01-22T06:02:34+05:30 IST