హంతకుడిని పట్టించిన స్పెల్లింగ్ మిస్టేక్స్

ABN , First Publish Date - 2020-11-08T20:22:07+05:30 IST

నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులకు రకరకాల ఆధారాలు

హంతకుడిని పట్టించిన స్పెల్లింగ్ మిస్టేక్స్

ఆగ్రా : నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులకు రకరకాల ఆధారాలు సహాయపడతాయి. ఎనిమిదేళ్ళ బాలుడి హంతకుడిని పట్టుకోవడానికి ఉత్తర ప్రదేశ్ పోలీసులకు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆధారంగా నిలిచాయి. స్థానిక భాషకు అనుగుణంగా ఆంగ్ల పదాల స్పెల్లింగ్స్ రాయడంతో నిందితుడిని పోలీసులు కచ్చితంగా గుర్తించగలిగారు. హర్దోయీకి చెందిన ఎనిమిదేళ్ల బాలుడిని అపహరించిన వ్యక్తి రామ్ ప్రతాప్ సింగ్ (22) అని పోలీసులు గుర్తించారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామ్ ప్రతాప్ సింగ్ తన అమ్మమ్మగారి ఇంటిలోని ఎనిమిదేళ్ళ బాలుడిని అక్టోబరు 26న కిడ్నాప్ చేశాడు. అదే రోజు దొంగిలించిన ఫోన్ నుంచి బాధిత బాలుడి తండ్రికి ఓ మెసేజ్ పంపించాడు. బాలుడిని విడుదల చేయాలంటే రూ.2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. రూ. 2 లక్షలు తీసుకుని సీతాపూర్ రావాలని, పోలీసులకు ఈ విషయం చెప్పవద్దని, పోలీసులకు చెబితే బాలుడిని చంపుతామని హెచ్చరించాడు. ఈ మెసేజ్‌లోని సీతాపూర్, పోలీసు అనే పదాలను హిందీ భాష ఉచ్చారణ పద్ధతిలో ఇంగ్లిష్ అక్షరాలను ఉపయోగించి రాశాడు. 


హర్దోయీ పోలీసు సూపరింటెండెంట్ అనురాగ్ వాట్స్ తెలిపిన వివరాల ప్రకారం, బాలుని కుటుంబ సభ్యులు నవంబరు 4న బేణీగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి, ఆ మెసేజ్ వచ్చిన ఫోన్‌ నెంబరుకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ స్విచాఫ్ అయి ఉంది. ఆ ఫోన్ సబ్‌స్క్రయిబర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి నిరక్షరాస్యుడు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర సమాచారం ఆధారంగా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి చేత ‘‘మై పోలీస్ మేఁ భర్తీ హోనా చాహతా హూఁ, మై హర్దోయీ సే సీతాపూర్ దౌడ్ కర్ జా సక్తా హూఁ’’ అని రాయించారు. నిందితుడు సింగ్ అంతకుముందు తాను బెదిరింపు సందేశంలో రాసినట్లుగానే సీతాపూర్, పోలీస్ పదాలకు స్పెల్లింగ్స్ రాశాడు. దీంతో సింగ్‌ను వెంటనే అరెస్టు చేశారు. 



Updated Date - 2020-11-08T20:22:07+05:30 IST