SpiceJet Troubles: బండి నడవడం కోసం నిధుల వేట

ABN , First Publish Date - 2022-08-03T18:12:03+05:30 IST

బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ (SpiceJet) ఆర్థిక ఒడుదొడుకుల్లో

SpiceJet Troubles: బండి నడవడం కోసం నిధుల వేట

న్యూఢిల్లీ : బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ (SpiceJet) ఆర్థిక ఒడుదొడుకుల్లో చిక్కుకుంది. ఈ కష్టాల నుంచి గట్టెక్కడం కోసం, రోజువారీ కార్యకలాపాలు కొనసాగడం కోసం కొంత వాటాను అమ్మేసి, నిధులను సేకరించాలని ప్రయత్నిస్తోంది. స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ (Ajay Singh) ఓ మిడిల్ఈస్టర్న్ క్యారియర్, ఓ పెద్ద ఇండియన్ కంపెనీ సహా అనేక సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. 


స్పైస్‌జెట్ యాజమాన్యం తన పరిస్థితిని సంబంధిత ప్రభుత్వ అధికారులకు వివరించింది. తన ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పింది. కొంత వాటాను అమ్మేందుకు చర్చలు జరుపుతున్నట్లు ధ్రువీకరించింది. 


స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, తమ కంపెనీ స్థిరమైన ఆర్థిక మద్దతును ఇవ్వగలిగే వివిధ పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వర్తించే నిబంధనలకు అనుగుణంగా తగిన విషయాలను వెల్లడిస్తామని చెప్పారు. 


స్పైస్‌జెట్‌లో అజయ్ సింగ్‌కు దాదాపు 60 శాతం వాటా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 24 శాతం వాటాను కొనేందుకు ఓ మిడిల్ ఈస్టర్న్ క్యారియర్ (Middle Eastern Carrier) ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తమకు స్పైస్‌జెట్ బోర్డులో ఓ పదవిని ఇవ్వాలని ఈ సంస్థ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ పెద్ద భారతీయ కంపెనీ (Indian Conglomerate) కూడా స్పైస్‌జెట్‌లో వాటా కోసం ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. 


వేసవి కాలంలో స్పైస్‌జెట్ విమానాల ఫ్లయింగ్ షెడ్యూల్లో సగానికి మాత్రమే డీజీసీఏ (Directorate General of Civil Aviation)  అనుమతి లభించింది. తగినన్ని నిధులు, తగినంత మానవ వనరులు ఉన్నట్లు డీజీసీఏకి రుజువు చేస్తేనే పూర్తి స్థాయిలో విమానాలను నడిపేందుకు ఈ సంస్థకు అనుమతి లభిస్తుంది. అంటే తగినన్ని పెట్టుబడులు ఈ సంస్థలోకి రావడం తప్పనిసరి. 


అజయ్ సింగ్ 2004-05లో ఎన్ఆర్ఐ భూలో కన్సగ్రా (NRI Bhulo Kansagra)తో కలిసి ఈ ఎయిర్‌లైన్‌ను ప్రారంభించారు. వీరు 1993-1996 మధ్య కాలంలో తిరిగిన మోడీలుఫ్ట్‌ను కొన్నారు. పారిశ్రామికవేత్త ఎస్‌కే మోడీ నుంచి దీనిని 1999-2000లో కొన్నారు. మోడీలుఫ్ట్ లైసెన్స్‌తోనే స్పైస్‌జెట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇది చాలా చేతులు మారింది. కళానిధి మారన్ (Kalanidhi Maran) నుంచి 2015లో అజయ్ సింగ్ మళ్ళీ దీనిని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మొదటి కొన్ని సంవత్సరాల్లో స్పైస్‌జెట్ రికవరీ బాటలో నడిచింది. అయితే కోవిడ్-19 మహమ్మారి అన్ని విమానయాన సంస్థలను దెబ్బతీసింది. టాటా గ్రూప్  (Tata Group) వంటి భారీ సంస్థల మద్దతుగల ఎయిర్‌లైన్స్ మాత్రమే తట్టుకోగలిగాయి. 


ఒమిక్రాన్ ప్రభంజనం తర్వాత నెమ్మదిగా ఎయిర్ ట్రాఫిక్ పుంజుకుంటోందని అనుకుంటున్న దశలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పడింది. ఇంధనం ధరలు పెరిగిపోతుండటం పరిస్థితిని మరింత కఠినతరం చేసింది. స్పైస్‌జెట్ తన ఉద్యోగులకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇంకా ఫారం-16 ఇవ్వలేదు.  మిగతా వైమానిక సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలను కోవిడ్ మునుపటి స్థాయికి తీసుకొస్తున్నప్పటికీ, స్పైస్‌జెట్ ఇంకా తక్కువ జీతాలనే చెల్లిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. 2022 నవంబరు 1 నుంచి పైలట్లకు కోవిడ్ మునుపటి స్థాయిలో జీతాలను చెల్లించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. 


Updated Date - 2022-08-03T18:12:03+05:30 IST