కాలుష్యం వెదజల్లుతున్న ఎస్పీఎం

Published: Mon, 17 Jan 2022 22:46:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కాలుష్యం వెదజల్లుతున్న ఎస్పీఎం

-మిల్లు వ్యర్థాలతో కలుషితమవుతున్న పెద్దవాగు జలాలు

-నాలుగు మండలాల ప్రజలపై ప్రభావం

-పల్ప్‌ శుద్ధి కోసం 200కుపైగా రసాయనాల వాడకం 

-వ్యర్థ జలాలతోనే పలుచోట్ల పంటలు పండిస్తున్న రైతులు 

-ఇప్పటికీ దృష్టిసారించని అధికార యంత్రాంగం 

ఆసిఫాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కార్మికవర్గానికి వరప్రదాయినిగా పేరున్న సిర్పూరు పేపరు మిల్లు(ఎస్పీఎం) ఈ ప్రాంత ప్రజానికానికి పరోక్షంగా అనారోగ్యాన్ని ప్రసాదిస్తోంది. కాగితం తయారీలో యాజమాన్యం చూపుతున్న శ్రద్ధ ఫ్యాక్టరీ విడుదల చేసే వ్యర్థ జలాలపై చూపించడం లేదు. ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే నీరు శుద్ది అవుతోందా? లేదా అనే విషయాన్ని యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు జలాల్లో కలిసి నురగలు కక్కుతూ పంట పొలాలను దాటుకుంటూ నాలుగు మండలాల రైతాంగానికి దిక్కుగా ఉన్న పెద్దవాగు జలాలను కలుషితం చేస్తున్నాయి. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన సిర్పూరు పేపర్‌ మిల్ల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇప్పటికే మూడు యాజమాన్యాల చేతులు మారింది. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా 600 మందిపైగా పరోక్షంగా పదివేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. బిర్లా కుటుంబం చేతిలో నష్టాల పాలై సెప్టెంబరు 27, 2014లో మూసివేశారు. తర్వాత కార్మికుల ఆందోళనతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జేకే సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపింది. ప్రత్యేక రాయితీలు ప్రకటించి ఆగస్టు 2, 2018లో వారితో పునరుద్ధరింపజేసింది. ఈ క్రమంలో పాత యంత్రాల స్థానంలో కొన్ని యంత్రాలను మార్చినప్పటికీ పూర్తిస్థాయిలో ఆధునీకరించలేదు. కాగితం తయారీలో కీలకమైన గుజ్జు శుద్ధి చేసే క్రమంలో 200 రకాలకుపైగా రసాయానాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో చాలా మట్టుకు హానికరమైనవే. అయితే పల్ప్‌ శుద్ధి చేసిన తర్వాత వదులుతున్న వ్యర్థ జలాల్లో ఇంకా రసాయనిక ఆవశేషాలు మిగిలి ఉండడం వల్ల ఆ నీరు ప్రవహించే ప్రదేశం అంతా కాలుష్య కాసారంగా మారుతోంది. నురగులు కక్కుతూ ప్రవహించే నీటిని కాగజ్‌నగర్‌ పరిసరాల్లో చాలామంది రైతులు వరి సాగుకు వినియోగించుకుంటున్న పరిస్థితి కొనసాగుతోంది. రసాయనిక వ్యర్థాలతో కూడిన ఈ నీటిని వాడి పంటలు పండించటం వల్ల ఆ ఉత్పత్తులను వినియోగించిన వారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు దీని ప్రభావం ఎంత? ఈ జలాల్లో మిగిలిపోయిన కెమికల్‌ ఏజెంట్ల శాతం ఎంత? అన్నది ఇప్పటి వరకు తేల్చలేదు. జిల్లాలో కాలుష్య ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ఎలాంటి వ్యవస్థ ఇప్పటి వరకు లేదు. ఫిర్యాదులు అందితే తప్ప నిజామాబాద్‌ నుంచి అధికారులు వచ్చే పరిస్థితి లేదని కార్మికులు చెబుతున్నారు.

అందరికీ తిప్పలే..

ఎస్పీఎం ద్వారా విడుదలవుతున్న వ్యర్థాల కారణంగా పెద్దవాగులో జలాలు కలుషితం అవుతుండడంతో పాటు ఈ వ్యర్థాలు ప్రవహించే పరివాహక ప్రాంతంలోని కాలనీలు, గ్రామాల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు వాసన భరించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోవడం లేదు. పల్ప్‌ శుద్ధి తర్వాత విడుదల చేసే వ్యర్థ జలాలతో ఎలాంటి హాని కారక రసాయాలు లేవని ఫ్యాక్టరీ ప్రతినిధులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ నీరు ప్రవహించిన పంట భూములన్నీ తెల్లబారి పోయి భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉందని నిపుణులంటున్నారు. ఈ నీటి వినియోగంతో సాగు చేస్తే దిగుబడులు కూడా బాగా తగ్గుతున్నట్టు చెబుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే ఈ వ్యర్థ జలాలు మసాల వాగు(మురికివాగు)లో కలిసి అక్కడి నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న పెద్దవాగులో కలుస్తున్నాయి. పెద్దవాగు పరివాహక ప్రాంతంలో ఉన్న కాగజ్‌నగర్‌, దహెగాం, పెంచికల్‌పేట, భీమిని మండలాల్లోని చాలా గ్రామాలకు చెందిన ప్రజలు ప్రభావితం అవుతున్నట్టు చెబుతున్నారు. కొంత కాలంగా ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే జలాలతో పెద్దవాగు నీరు కూడా దుర్వాసన వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ వాగు పరివాహక ప్రాంతంలోనే అరుదైన జంతువులు, పక్షులు మనుగడ సాగిస్తున్నాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలు పెద్దవాగులో కలువడం వల్ల వాగు పరివాహక ప్రాంతంలోని వన్యప్రాణులు, పక్షులు, అరుదైన జలచరాలపై ఖచ్చితంగా ప్రభావం ఉందని దీనిపై అఽధ్యయనం చేస్తున్నామని వన్యప్రాణి సంరక్షణ అధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు.  కాగితం తయారీలో వాడే రసాయానాల వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, గుండె, ఊపిరితిత్తులు, కంటి సంబంధిత వ్యాధులు, శ్వాసనాళ సంబంధిత వ్యాధులు, దగ్గు, దమ్ము వంటి అనారోగ్యకరమైన దుష్పప్రభావాలు తలెత్తుతుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో లెడ్‌, క్లోరిన్‌, లెడ్‌, పాస్పరస్‌, క్లోరిన్‌డయాక్సైడ్‌, టాల్కం పౌడర్‌ తదితర రసాయానాలు వాడటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అందులో పనిచేసే కార్మికులకు కూడా ముప్పు పొంచి ఉన్నట్లేనని అంటున్నారు. అయితే ప్రతినెల వ్యర్థజలాల శాంపిల్స్‌ను సేకరించి పరిక్షించాల్సిన కాలుష్యనియంత్రణ మండలి అధికారులు పత్తా లేకుండా పోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. 

వ్యర్థాలు కలిసిన నీటితోనే పంటలు పండించాను

-లక్ష్మి, కాగజ్‌నగర్‌

ఎస్పీఎం నుంచి వెలువడే వ్యర్థాలు కలిసి నీటితో ఎకరన్నరం పొలంలో వరి పంట పండించాను. పంట దిగుబడి ఆశించిన మేర రాలేదు. పండించిన పంటను తింటున్నాం. పరిసర ప్రాంతాల్లోని ఇతర రైతులు కూడా ఇదే తరహాలో పంటను పండిస్తున్నారు. పంట పొలం అంతా తెల్లగా మారింది. వాసన వస్తున్నప్పటికీ కూడా పండిస్తున్నాం. 

సమస్యలు మాకు..ఉద్యోగాలు స్థానికేతరులకు

-అంబాల ఓదెలు, కాగజ్‌నగర్‌ 

ఎస్పీఎంలో ఉద్యోగాలుగా స్థానికేతరులే ఎక్కువ మంది ఉన్నారు. మిల్లు నుంచి వెలువడే కాలుష్యం మాత్రం ఈ ప్రాంత ప్రజలు భరించచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మసాలా ఒర్రె వద్ద భరించలేని వాసన వస్తోంది. కార్మికులకు మేలు జరుగుతుందని తమ ప్రాణాలను ఫణంగా పెట్టి జీవిస్తున్నారు. అయినా యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తోంది. కాలుష్యంపై ఎప్పటికప్పుడు నివారణ చర్యలు, నివేదికలు బహిర్గతం చేయాలి. 

కాలుష్య నియంత్రణ అధికారులకు సూచించాం

- శాంతారాం, జిల్లా అటవీశాఖాధికారి 

ఎస్పీఎం నుంచి వెలువడే వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని జరుగుతుందా? లేదా అనే విషయంలో సత్వర విచారణ జరిపి తగిన నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ అధికారులకు సూచించాం. పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో అటవీ ప్రాంతం ఉన్నందున ఈ పరివాహక ప్రాంతాన్ని తమ సిబ్బందితో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.