క్రిప్టో పరిశ్రమ లక్ష్యంగా స్టేట్ స్పాన్సర్డ్ గ్రూపులు...

ABN , First Publish Date - 2021-11-30T03:16:44+05:30 IST

క్రిప్టో పరిశ్రమను స్టేట్ స్పాన్సర్డ్ గ్రూపులు లక్ష్యంగా చేసుకుంటాయని, ఇక... బ్యాక్ డోర్స్‌తో కూడిన రోగ్ వ్యాలెట్ ద్వారా సైబర్ క్రిమినల్స్ అడ్వాంటేజ్ పొందుతారని భావిస్తున్నారు.

క్రిప్టో పరిశ్రమ లక్ష్యంగా స్టేట్ స్పాన్సర్డ్ గ్రూపులు...

ముంబై : క్రిప్టో పరిశ్రమను స్టేట్ స్పాన్సర్డ్ గ్రూపులు లక్ష్యంగా చేసుకుంటాయని, ఇక... బ్యాక్ డోర్స్‌తో కూడిన రోగ్ వ్యాలెట్ ద్వారా సైబర్ క్రిమినల్స్ అడ్వాంటేజ్ పొందుతారని భావిస్తున్నారు. ఈ పేమెంట్ వ్యవస్థపై దాడులు, మరింత అడ్వాన్స్డ్ మొబైల్ బెదిరింపులు, హెచ్చరికలు...  వచ్చే ఏడాది పెరుగుతాయని సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పేర్స్కీ పేర్కొంది. కాగా... ‘2021 సవాలు, కొత్తదనంతో కూడిన ఏడాది’ అని, ఈ మార్పును వేగంగా తమకనుకూలంగా మార్చుకుని, నిర్వహించేవారు సైబర్ నేరస్తులు అని, ఈ నేపధ్యంలో వచ్చే ఏడాదికి క్రిప్టో కరెన్సీల పై వీరి దాడులు పెరుగుతాయని పేర్కొంటోంది. బిట్‌కాయిన్ సహా ఇతర క్రిప్టోలను సైబర్ నేరగాళ్ళు ఇప్పటికే లక్ష్యంగా చేసుకున్న నేపధ్యంలో ఈ నివేదిక వచ్చింది.


దేశానికో తీరులో... 

క్రిప్టో కరెన్సీని కొన్ని దేశాలు నిషేధించిన విషయం తెలిసిందే. కొన్ని దేశాల్లో చట్టబద్ధత.  క్రిప్టో లావాదేవీల చట్టబద్ధత కోసం టెక్నాలజీ సాయమందించాలని ఎల్‌సాల్వెడార్ ఇప్పటికే చేసిన విజ్ఞప్తిని ప్రపంచ బ్యాంకు నిరాకరించింది. బిట్‌కాయిన్‌కు చట్టపర హోదాకు సంబంధించి దక్షిణాఫ్రికా సహా మరికొన్ని  ఆఫ్రికన్ దేశాలు  చర్చిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం క్రిప్టో బిల్లును తీసుకురానున్నట్లుగా వినవస్తోన్న నేపధ్యంలో... డిజిటల్ కరెన్సీపై జోరుగా చర్చ నడుస్తోంది. క్రిప్టోపై దేశాలు కలిసి పని చేయాలని, అసాంఘక శక్తుల చేతుల్లోకి వెళ్ళకుండా చూడాలని, దీనిపై అంతర్జాతీయ చట్టం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ది సిడ్నీ డైలాగ్ సదస్సులో పేర్కొన్న విషయం తెలిసిందే.


ఇదిలా ఉంటే... క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎలాంటి రెగ్యులేటరీ, లేదా అంతర్జాతీయ చట్టాలు లేదా నిబంధనలు కానీ లేవు. దీంతో క్రిప్టో లావాదేవీలు ప్రత్యేక సర్వర్లలో ఉంటున్నప్పటికీ, వాటి భద్రతకు సంబంధించి ఎటువంటి హామీ ఉండదని చెబుతున్నారు. పూర్తి డిజిటల్ కరెన్సీ అయినందున సమస్యలు వస్తే ఇన్వెస్టర్లు నష్టపోవచ్చన్న ఆందోళన కూడా ఉంది. క్రిప్టోలో పెట్టుబడి పెట్టి, నష్టపోయి తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. క్రిప్టో ధరలో హెచ్చుతగ్గులు ఎప్పుడెలా చెప్పే పరిస్థితి ఉండదు. టెస్లా కార్లకు చెల్లింపులకు బిట్‌కాయిన్‌ను తీసుకోలేమని ఎలాన్ మస్క్ కుండబద్ధలు కొట్టడంతో ఈ డిజిటల్ కరెన్సీ విలువ భారీగా పడిపోయింది. కొంతమంది హ్యాకర్లు గతంలో బ్లాక్‌చైన్ సైట్‌లోని లోపాలను కనిపెట్టి ఎథేర్ వంటి కొన్ని వేల డిజిటల్ నాణేలను దొంగిలించారు. వీటి విలువ వేల కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు. 


మోసాలు జరిగాయి.. జరుగుతున్నాయి... 

బిట్‌కాయిన్‌‍ను సృష్టించేందుకు భారీగా విద్యుత్తు అవసరం. ఈ క్రమంలోనే... కొద్ది రోజుల క్రితం చైనాలోని షిన్‌జియాంగ్‌లో విద్యుత్తు  కొరత ఏర్పడింది. అప్పుడు కూడా బిట్ కాయిన్ విలువ పడిపోయింది.


నియంత్రణ... పర్యావరణం... 

అయితే క్రిప్టో నియంత్రణ అంత తేలిక కాదని ఆర్ధికరంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాల వద్ద ఇలాటి వ్యవస్థలూ లేనందున, ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నది వారి భావన. క్రిప్టోను మనీ లాండరింగ్, స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారన్న  ఆందోళనలు కూడా ఉన్నాయి. క్రిప్టో కరెన్సీలో అధిక మార్కెట్ వాటా కలిగిన బిట్‌కాయిన్, ఎథేరియం మైనింగ్ ప్రక్రియతో నడిచేవి. ఒక వ్యక్తి మరో వ్యక్తికి బిట్‌కాయిన్‌ను బదిలీ చేస్తే... ఆ బిట్‌కాయిన్ ద్వారా కొన్ని బ్లాక్‌లు ఏర్పడతాయి. 


ఈ బ్లాక్‌లను కొన్ని మ్యాథమెటికల్ హాషెస్ ద్వారా మైనర్లు కూడా పరిష్కరించగలుగుతారు. అప్పుడు కొత్త బిట్‌కాయిన్ జనరేట్ అవుతుంది. అయితే... ఇందుకుగాను కంప్యూటర్లు, అధిక సామర్థ్యంతో కూడిన ప్రాసెసర్లు, సర్వర్లు అవసరమవుతాయి. ఈ కంప్యూటర్ల సగటు జీవిత కాలం 1.3 సంవత్సరాలు.అంటే ‘ఈ’’వేస్ట్ జనరేట్ అవుతుంది. పర్యావరణానికి ఇది అననుకూలం. ఇక విషయానికొస్తే... క్రిప్టో పరిశ్రమ లక్ష్యంగా స్టేట్ స్పాన్సర్డ్ గ్రూపులు ఏర్పాటు కానున్నట్లు వినవస్తోన్న వార్తలు... సంబంధిత వర్గాల్లో కలవరానికి కారణమవుతున్నాయి. 

Updated Date - 2021-11-30T03:16:44+05:30 IST