Fakhar Zaman: ఈ చిన్న పనితో కోట్లాదిమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న పాక్ బ్యాటర్

ABN , First Publish Date - 2022-08-30T00:15:36+05:30 IST

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి

Fakhar Zaman: ఈ చిన్న పనితో కోట్లాదిమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న పాక్ బ్యాటర్

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ (fakhan zaman) ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి క్రికెట్ లోకం జేజేలు పడుతోంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటనను ఊహించలేమంటూ ఫకర్‌పై ప్రశంసలు కురిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?..


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ (pakistan) మూడో ఓవర్ నాలుగో బంతికే కెప్టెన్ బాబర్ ఆజం (babar azam) వికెట్‌ను కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన షార్ట్ బాల్‌ను ఆడడంలో ఇబ్బంది పడిన బాబర్.. అర్షదీప్‌ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫకర్ జమాన్ రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్నట్టు కనిపించాడు. ఈ క్రమంలో అవేశ్ ఖాన్ (avesh khan) వేసిన ఆరో ఓవర్ ఐదో బంతికి ఫకర్ అవుటయ్యాడు. నిజానికి అతడు అవుటైనట్టు ఎవరూ గ్రహించలేదు. బౌలర్ కానీ, కీపర్ కానీ అప్పీలు చేయలేదు. అంపైర్ చేయెత్తలేదు. అయినా ఫకర్ నిదానంగా నడుచుకుంటూ మైదానాన్ని వీడాడు. అది చూసి అంపైర్ అప్పుడు చెయ్యెత్తాడు. దీంతో భారత జట్టు సంబరాలు చేసుకుంది. 


అంతకుముందు ఏమైందంటే.. అవేశ్ ఖాన్ సంధించిన బంతి ఫకర్ బ్యాట్ ఎడ్జ్‌కు తాకి కీపర్ దినేశ్ కార్తీక్ చేతిలో పడింది. అయితే, అటు కీపర్ కానీ, ఇటు అవేశ్ ఖాన్ కానీ గమనించలేదు. చివరి బంతి వేసేందుకు అవేశ్ బంతి అందుకున్నాడు. అయితే, బంతి తన బ్యాట్‌కు తాకి కార్తీక్ చేతిలోకి వెళ్లడంతో అవుటైనట్టు భావించిన ఫకర్.. ఎవరూ అప్పీలు చేయకుండానే మైదానాన్ని వీడి క్రీడాస్ఫూర్తిని చాటాడు. ఫకర్ ప్రవర్తించిన క్రీడాస్ఫూర్తికి మైదానంలోని ప్రేక్షకులే కాదు, మ్యాచ్‌ను టీవీలో వీక్షిస్తున్న లక్షలాదిమంది ఆశ్చర్యపోయారు. ఆపై ప్రశంసలు కురిపించారు.


నెటిజన్లు అయితే పాక్ బ్యాటర్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. చాలామంది క్రికెటర్లు తాము అవుటైన విషయం తెలిసి కూడా క్రీజును వదలకుండా అంటిపెట్టుకుని ఉంటారని, మరికొందరు అంపైర్ చేయి ఎత్తే వరకు ఎదురుచూస్తూ ఉంటారని కామెంట్ చేస్తున్నారు. ఫకర్ మాత్రం నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి తమ మనసులు గెలుచుకున్నాడని కొనియాడుతున్నారు. భారత్-పాకిస్థాన్ తలపడే హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఇలాంటి ఘటనను ఊహించలేమని మరికొందరు కామెంట్ చేశారు. 

Updated Date - 2022-08-30T00:15:36+05:30 IST