ఆట‘విడుపు’

ABN , First Publish Date - 2021-07-26T04:29:30+05:30 IST

దివాసీ క్రీడాకారుల్లో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ... ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేక మసకబారుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని నేపథ్యం వల్ల చదువు, క్రీడలు మధ్యలోనే మానేసి క్రీడాకారులు కూలీ పనులు చేస్తున్నారు..

ఆట‘విడుపు’
పతకాలతో సోడె సాయి.. ప్రాక్టీస్‌ చేస్తున్న దృశ్యం, సాధించిన పతకాలతో సునీల్‌కుమార్‌

మరుగున పడుతున్న మన్యం క్రీడాకారుల ప్రతిభ

సర్కారు ప్రోత్సాహకాలు అందక కూలిపనులకు

ములకలపల్లి, జూలై 25: ఆదివాసీ క్రీడాకారుల్లో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ... ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేక మసకబారుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని నేపథ్యం వల్ల చదువు, క్రీడలు మధ్యలోనే మానేసి క్రీడాకారులు కూలీ పనులు చేస్తున్నారు.. పరుగు పందేల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక్కో క్రీడాకారుడు 22 రజత, 14 బంగారు పతకాలు, మరో క్రీడాకారుడు 20 బంగారు, 10రజత పతకాలు సాధించారు. అయినప్పటికీ వారికి ప్రభుత్వ ప్రోత్సాహం కరువై ఒకరు క్రీడలను వదిలేసి చదువు కొనసాగిస్తుండగా, మరొకరు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

పనులకు వెళ్తున్న పరుగువీరుడు

ములకలపల్లి మండలంలోని తాళ్లాపాయికు చెందిన సోడె బొజ్జి - బూదెమ్మ దంపతులకు నలుగురు సంతానం. చిన్న కూమారుడు సాయి. వీరిది నిరుపేద ఆదివాసీ కుటుంబం.. సాయి చిన్నతనం నుంచే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతూ క్రీడల్లో, చదువులో రాణించాడు. ఖమ్మంలో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసి, అదే కాలేజీలో డిగ్రీ చేరి ఆర్థిక స్థోమత లేక డిగ్రీ మూడో సంవత్సరంలోనే మానేసి ఇంట్లో కూలీ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు.

సాధించిన పతకాలివి..

2012లో జార్ఖండ్‌లో జరిగిన జాతీయస్థాయి అండర్‌-14 విభాగంలో 100మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణపతకం సాధించాడు. 2015లో గచ్చిబౌలిలో జరిగిన అండర్‌ 17విభాగం సౌత్‌జోన్‌ స్థాయి 100 మీటర్లు, 200 మీటర్లు పరుగుపందెంలో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణపతకం సాధించాడు. ఇలా జాతీయ, రాష్ట్ర, యూనివర్శిటీ స్థాయి 100, 200 మీటర్లు పరుగు పందెంలో చాలాసార్లు పాల్గొన్నాడు..  గోల్డ్‌ మెడల్స్‌  22, కాంస్య 14 పతకాలు సాధించాడు..

ప్రోత్సాహం అందిస్తే.. ఒలంపిక్స్‌ పాల్గొనాలని ఉంది.. (సోడె సాయి)

ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఒలంపిక్స్‌లో పాల్గొనాలని ఉంది.. కుటుంబ ఆర్థిక స్తోమత లేక డిగ్రీ మానేసి అమ్మానాన్నతో కలిసి కూలీ పని చేస్తున్నా.. నాకు పరుగు పందెం అంటే చాలా ఇష్టం. పరుగు పందెం మీద మక్కువతో ఇంట్లో ఉండే ప్రాక్టీస్‌ చేస్తున్నా.. 

క్రీడలను వదిలేసి.. చదువుపై శ్రద్ధ చూపిస్తూ.. 

ములకలపల్లి మండలంలోని తాళ్లాపాయి గ్రామానికి చెందిన కొర్సా అనంతరావు, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సునీల్‌.. చిన్నతనం నుంచే అపారమైన ప్రతిభ కల్గి, పరుగుపందెం, లాంగ్‌జంప్‌, క్రికెట్‌ జాతీయ స్థాయిలో రాణించి 20 స్వర్ణ పతకాలు, 10 రజతత పతకాలు సాధించాడు.. ప్రభుత్వ ప్రొత్సాహం కరవై క్రీడలను పూర్తిగా వదిలేసి చదువుపై శ్రద్ధ చూపిస్తూ హైద్రాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నాడు.. ఈ క్రీడాకారుని పతకాలిలా..

2012లో జాతీయ స్థాయిలో మెదక్‌లో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణపతకం, 200 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. అదే ఏడాది చిత్తూరులో జరిగిన దక్షిణాది రాష్ర్టాల స్థాయి 100 మీటర్లు పరుగులో స్వర్ణ పతకం, 200 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించాడు.. 2013 సంలో రిజనల్‌ స్థాయి (దక్షిణాది రాష్ర్టాలు) వరంగల్‌లో జరిగిన జావెలిన్‌త్రోలో పాల్గొన్ని ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు.. కేరళ రాష్ట్రంలో త్రిసూర్‌లో జరిగిన రీజనల్‌ స్థాయి అండర్‌ 14 విభాగంలో ఆడి ప్రశంసా పత్రంతో పాటు జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. హైదరాబాద్‌ బృందం నుంచి పాల్గొని మహారాష్ట్రలో, అమ రావతిలో క్రికెట్‌ ఆడి ప్రశంసాపత్రాలు పొందాడు. జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌లో జరిగిన 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని మూడో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు.. సునీల్‌ను ‘ఆంధ్రజ్యో తి’ పలకరించగా ప్రభుత్వం ప్రొత్సహిస్తే క్రీడల్లో రాణించాలని ఉంది అని మనోగతాన్ని వ్యక్తం చేశాడు.

Updated Date - 2021-07-26T04:29:30+05:30 IST