క్రీడల్లోనూ మనమే ఫస్ట్‌

ABN , First Publish Date - 2022-06-29T13:58:08+05:30 IST

రాష్ట్రంలో క్రీడాశాఖ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. మంగళవారం నగరంలో జరిగిన ‘సౌత్‌ స్పోర్ట్స్‌ మీట్‌’లో

క్రీడల్లోనూ మనమే ఫస్ట్‌

                                  - Cm Stalin


అడయార్‌(చెన్నై), జూన్‌ 28: రాష్ట్రంలో క్రీడాశాఖ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. మంగళవారం నగరంలో జరిగిన ‘సౌత్‌ స్పోర్ట్స్‌ మీట్‌’లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత అనేక శాఖలు ప్రగతిపథంలో దూసుకెళుతున్నాయని, దీనికి కారణం ద్రావిడ పాలనే కారణమన్నారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి - అన్నిశాఖల పురోభివృద్ధి అనే నినాదంలో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఇలా ప్రగతిపథంలో పయనిస్తున్న శాఖల్లో క్రీడాశాఖ కూడా ఒకటన్నారు. ఈ శాఖాభివృద్ధికి సహాయ సహకారాలందిస్తున్నామన్నారు. ముఖ్యంగా త్వరలో జరుగనున్న చెస్‌ ఒలింపియాడ్‌ పోటీల నిర్వహణ మనకు లభించిన అరుదైన గౌరవమన్నారు. 200 దేశాలకు చెందిన చెస్‌ క్రీడాకారులు ఈ పోటీల కోసం నగరానికి వస్తున్నారన్నారు. ఈ తరహా పోటీలు చెన్నైలో తొలిసారి నిర్వహిస్తున్నామన్నారు. 2022లో రష్యాలో జరగాల్సిన పోటీలను ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రద్దు చేసారన్నారు. ఆ తర్వాత ఈ పోటీలు నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీపడ్డాయని, వాటిలో భారత్‌ కూడా ఉందన్నారు. భారత చెస్‌ సమాఖ్యతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సంప్రదించి ఈ పోటీలను చెన్నైలో జరిగేలా ఒప్పించారని గుర్తుచేశారు. ఈ తరహా పోటీలు భారత్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి అయినప్పటికీ.. ఆ పోటీలకు చెన్నైనగరం ఆతిథ్యం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు, వారి కోచ్‌లు ఇలా దాదాపు 2500 మంది నగరానికి వస్తారన్నారు. దీంతో రాష్ట్రం పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతుందన్నారు. తనకు క్రికెట్‌ వంటి క్రీడలపై ఎక్కువ ఆసక్తి ఉందన్నారు. ఈ పోటీలను క్రమం తప్పకుండా ఆడేవాడినని, పాఠశాల స్థాయి నుంచి క్రికెట్‌ ఆడినట్టు తెలిపారు. నగర మేయర్‌గా ఉన్నపుడు కూడా క్రికెట్‌ పోటీల్లో పాల్గొన్న విషయం ఆయన గుర్తుచేశారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి దివంగత కలైంజర్‌ క్రికెట్‌ పోటీలకు తప్పకుండా చూసేవారని చెప్పారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఒక కీలక ప్రకటన చేశామన్నారు. ఒలింపిక్‌ క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకునే క్రీడాకారునికి రూ.3 కోట్లు, సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంటే రూ.2 కోట్లు, కాంస్యం గెలుచుకుంటూ రూ. కోటి బహుమతి ఇస్తామని ప్రకటించామన్నారు. పారాలింపిక్స్‌లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.55 లక్షలు అందజేసినట్టు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T13:58:08+05:30 IST