గామీణ, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు

ABN , First Publish Date - 2022-05-22T05:53:31+05:30 IST

ప్రతి గ్రామం, పట్టణంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

గామీణ, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు

- ప్రతి గ్రామం, పట్టణ వార్డులో ఏర్పాటు

- ఎకరం స్థలంలో నిర్మాణం

- ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ ఆటలకు ప్రాధాన్యం

- స్థలాల గుర్తింపులో నిమగ్నమైన అధికారులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రతి గ్రామం, పట్టణంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుని క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో క్రీడా ప్రాంగణానికి కనీసం ఎకరం స్థలాన్ని గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, తదితర అంశాల గురించి చర్చించిన విషయం తెలిసిందే. వచ్చే 3వ తేదీ నుంచి నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ శాఖల అధికారులు స్థలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కో క్రీడా ప్రాంగణానికి కనీసం ఎకరం స్థలమైనా ఉండాలని సూచించారు. .

- 166 గ్రామాల్లో స్థలాల గుర్తింపు..

జిల్లాలోని 266 గ్రామ పంచాయతీల పరిధిలో 353 గ్రామాలు ఉండగా, ఇప్పటి వరకు 166 గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. క్రీడా ప్రాంగణాలకు గుర్తించిన స్థలాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో ముళ్ల కంపలు, చెత్తా చెదారాన్ని తొలగించి చదును చేయాలని, నేల గట్టిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంగణం చుట్టూ నీడనిచ్చే మొక్కలను నాటాలన్నారు. ఆతర్వాత ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్‌ ఆటలు అడుకునేందుకు కోర్టులను సిద్ధం చేయాలని, లాంగ్‌ జంప్‌, హైజంప్‌ కోసం పిట్‌ను సిద్ధం చేయాలని, శారీరక కసరత్తుల కోసం ఎక్సర్‌సైజ్‌ బార్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆటలు ఆడుకునేందుకు వీలుగా క్రీడా సామగ్రిని క్రీడల శాఖ ద్వారా ప్రభుత్వం సరఫరా చేయనున్నది. ఈ క్రీడా ప్రాంగణాల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం చేసి ఆటలు ఆడుకునేందుకు వీలుగా అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ప్రాంగణాలు ఎంతగానో దోహద పడనున్నాయని ప్రభుత్వం భావిస్తున్నది. 

- పట్టణాల్లో మున్సిపల్‌ నిధులతో.. 

పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ నిధులతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వార్డు, డివిజన్‌కు ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు, పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు, సుల్తానాబాద్‌లో 15 వార్డులు, మంథనిలో 13 వార్డులు ఉన్నాయి. వీటిలోనూ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వీటిలో ఇంకా స్థలాల గుర్తింపు మొదలు కాలేదు. కొంతకాలంగా పట్టణ ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీపీలు, షుగర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. దీంతో వారంతా ప్రతి రోజు వాకింగ్‌ చేయడంతో పాటు కసరత్తులు చేస్తున్నారు. అలాగే విద్యార్థులు కూడా వ్యాయామం చేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా విద్యార్థులు ఇప్పటి నుంచే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఇందుకు గానూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటున్నది. ఈ క్రీడాప్రాంగణాలతో క్రీడల్లో ఆణిముత్యాలు వెలికి రానున్నారు. 


Updated Date - 2022-05-22T05:53:31+05:30 IST