కుర్రాళ్లూ.. కుమ్మేయండి

ABN , First Publish Date - 2022-02-04T05:30:00+05:30 IST

అండర్‌-19 ప్రపంచకప్‌ చివరి అంకానికి చేరింది. అంచనాలకు తగ్గట్టుగానే భారత యువ జట్టు ప్రదర్శన సాగడంతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ..

కుర్రాళ్లూ.. కుమ్మేయండి

ఐదో టైటిల్‌పై యువ భారత్‌ గురి

నేడే ఇంగ్లండ్‌తో ఫైనల్‌

అండర్‌-19 వరల్డ్‌కప్‌


నార్త్‌ సౌండ్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ చివరి అంకానికి చేరింది. అంచనాలకు తగ్గట్టుగానే భారత యువ జట్టు ప్రదర్శన సాగడంతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఈ ప్రయాణంలో యశ్‌ ధుల్‌ సేన ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకపోవడం విశేషం. ఇక శనివారం ఇంగ్లండ్‌తో జరిగే ఫైనల్‌ పోరులోనూ తమ జోరును కొనసాగించాలనుకుంటోంది. అదే జరిగితే భారత్‌ ఖాతాలో ఐదో టైటిల్‌ చేరుతుంది. కుర్రాళ్లతో గురువారం వీడియో కాల్‌లో మాట్లాడిన విరాట్‌ కోహ్లీ వారిలో స్ఫూర్తి నింపాడు. ఇప్పటిదాకా జరిగిన 14 టోర్నమెంట్లలో యువ భారత్‌ ఎనిమిది సార్లు ఫైనల్‌కు చేరగా.. నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలవడం జట్టు ఆధిపత్యాన్ని సూచిస్తోంది. మహ్మద్‌ కైఫ్‌, విరాట్‌ కోహ్లీ, ఉన్ముక్త్‌ చంద్‌, పృథ్వీ షా సారథ్యంలో యువ భారత్‌ టైటిళ్లు సాధించింది. అలాగే ఈ నెలలోనే ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం ఉండడంతో ఈ కీలక మ్యాచ్‌లో చెలరేగిన కుర్రాళ్లకు భారీధర పలికే అవకాశం కూడా ఉంటుంది. అటు జోరు మీదున్న ఇంగ్లండ్‌ 1998లో టైటిల్‌ గెలిచాక రెండోసారి ఫైనల్‌కు వచ్చింది.


నిలకడగా..

యువ ఆటగాళ్లే అయినప్పటికీ నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. కొవిడ్‌ కారణంగా కెప్టెన్‌ యశ్‌ ధుల్‌, వైస్‌కెప్టెన్‌ రషీద్‌ మూడు లీగ్‌ మ్యాచ్‌లో ఒక్కటి మాత్రమే ఆడారు. అయినా ఎలాంటి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోయినా నాకౌట్‌ పోరులో దుమ్మురేపారు. ఆసీ్‌సతో జరిగిన సెమీస్‌లో అయితే ఆరంభంలోనే రెండు వికెట్లు పడినా ఈ జోడీ ఆడిన తీరు జట్టును నిలబెట్టింది. సందర్భానికి తగ్గ ఆటతీరుతో వీరు సహచరులకు ఆదర్శంగా నిలిచారు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌లో  జట్టు సమష్టిగా రాణించకపోయినా.. బౌలర్లు మాత్రం ప్రత్యర్థిని మూకుమ్మడిగా దెబ్బతీయగలుగుతున్నారు. ముఖ్యంగా లెఫ్టామ్‌ పేసర్‌ రవి కుమార్‌ స్వింగ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు టాపార్డర్‌ బ్యాటర్స్‌ వణికిపోతున్నారు. నిలకడగా వికెట్లు తీస్తున్న రవి బెంగాల్‌ రంజీ టీమ్‌లోనూ చోటు దక్కించుకోవడం విశేషం. ఇక రాజ్యవర్ధన్‌ నుంచి అదనపు పేస్‌ కూడా జట్టుకు లాభపడేదే. మధ్య ఓవర్లలో విక్కీ ఓస్వాల్‌ స్పిన్‌తో చుట్టేస్తున్నాడు. ఇప్పటికే భారత్‌ తరపున 12 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.


 గట్టి ప్రత్యర్థే..

భారత్‌ తరహాలోనే ఇంగ్లండ్‌ కూడా తాజా టోర్నీలో ఒక్క మ్యాచూ ఓడిపోలేదు. అఫ్ఘాన్‌తో ఉత్కంఠగా ముగిసిన సెమీస్‌లో ఈ జట్టు అదరగొట్టింది. జార్జి థామస్‌, జార్జి బెల్‌, హోర్టన్‌ ముగ్గురూ అర్ధసెంచరీలు సాధించారు. కెప్టెన్‌ టామ్‌ ప్రెస్ట్‌ మొత్తం 292 పరుగులతో ఫామ్‌లో ఉండగా.. లెఫ్టామ్‌ పేసర్‌ జోషువా బాయ్‌డెన్‌ 13 వికెట్లతో ఊపు మీదున్నాడు. అలాగే మధ్య ఓవర్లలో వికెట్‌ తీసే అలవాటున్న లెగ్‌ స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ను భారత్‌ జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. అందుకే 24ఏళ్ల తర్వాత మరో టైటిల్‌ కోసం చూస్తున్న ఇంగ్లండ్‌ను మన కుర్రాళ్లు తక్కువ అంచనా వేయొద్దు. 


జట్లు (అంచనా)

భారత్‌: రఘువంశీ, హర్నూర్‌ సింగ్‌, షేక్‌ రషీద్‌, యశ్‌ ధుల్‌ (కెప్టెన్‌),  నిశాంత్‌ సింధు, రాజ్‌ బవా, కౌశల్‌ తాంబే, దినేశ్‌ బనా, రాజ్యవర్ధన్‌ హంగర్‌గేకర్‌, విక్కీ ఓస్వాల్‌, రవి కుమార్‌.

ఇంగ్లండ్‌: జార్జి థామస్‌, జాకబ్‌ బెథెల్‌, టామ్‌ ప్రెస్ట్‌ (కెప్టెన్‌), జేమ్స్‌ రూ, విలియమ్‌ లక్స్‌టన్‌, జార్జి బెల్‌, రెహాన్‌ అహ్మద్‌, అలెక్స్‌ హోర్టన్‌, జేమ్స్‌ సేల్స్‌, థామస్‌ అస్పిన్‌వాల్‌, జోషువా బాయ్‌డెన్‌.

Updated Date - 2022-02-04T05:30:00+05:30 IST