ఓటముల పంచ్‌

ABN , First Publish Date - 2022-04-14T09:26:05+05:30 IST

దో మ్యాచ్‌లోనైనా గెలుపు బోణీ కొట్టాలన్న ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్‌ ఆశలు నెరవేరలేదు. బుధవారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో...

ఓటముల పంచ్‌

ముంబైకి వరుసగా ఐదో పరాజయం

ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే విజయం


పుణె: ఐదో మ్యాచ్‌లోనైనా గెలుపు బోణీ కొట్టాలన్న ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్‌ ఆశలు నెరవేరలేదు. బుధవారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 12 పరుగులతో ముంబైకి షాకిచ్చింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 198/5 స్కోరు చేసింది. ధవన్‌ (50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) మయాంక్‌ అగర్వాల్‌ (32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) హాఫ్‌ సెంచరీలు చేశారు. చివర్లో జితేశ్‌ శర్మ (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్‌) ధాటిగా ఆడాడు. థంపీ రెండు వికెట్లు తీశాడు. ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 186/9 స్కోరుకే పరిమితమైంది. బ్రేవిస్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 49), తిలక్‌వర్మ (20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించగా.. సూర్యకుమార్‌ (30 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 43) ఫామ్‌ చాటాడు. ఓడియన్‌ స్మిత్‌ 4, రబాడ 2 వికెట్లు తీశారు. మయాంక్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 


బ్రేవిస్‌, తిలక్‌ ధూం..ధాం..: తొలి రెండు ఓవర్లలో రోహిత్‌ 4,6, 4,4 కొట్టడంతో భారీ ఛేదనను ముంబై ఆశావహంగానే ప్రారంభించింది. రబాడా వేసిన నాలుగో ఓవర్లో రోహిత్‌ మరో అద్భుత సిక్సర్‌ కొట్టడంతో అతడి బ్యాటింగ్‌ గాడిలో పడినట్టే అనిపించింది. కానీ తదుపరి బంతిని కూడా సిక్స్‌కు తరలించబోయిన రోహిత్‌ (28).. వైభవ్‌ అరోరాకు దొరికిపోయాడు. తదుపరి ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ (3)ని వైభవ్‌ అవుట్‌ చేయడంతో 32/2తో ముంబై ఇక్కట్లలో పడింది. ఈ దశలో యువ ఆటగాళ్లు బ్రేవిస్‌, తిలక్‌ వర్మ ముంబై ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. ముఖ్యంగా..బ్రేవిస్‌ సూపర్‌ షాట్లతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో 4,4తో బ్యాట్‌ ఝళిపించిన బ్రేవిస్‌, ఓడియన్‌ స్మిత్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ దంచగా..లివింగ్‌స్టోన్‌ ఓవర్లో తిలక్‌ 4,4తో దుమ్ము రేపాడు.


ఇక రాహుల్‌ చాహర్‌ వేసిన 9వ ఓవర్లో విరుచుకుపడిన బ్రేవిస్‌ 4,6,6,6,6తో ఏకంగా 29 పరుగులు చేశాడు. 10వ ఓవర్లో తిలక్‌ 4,6 బాదడంతో ముంబై స్కోరు సెంచరీ దాటింది. స్మిత్‌ వేసిన 11వ ఓవర్లో వైభవ్‌ క్యాచ్‌ వదిలేయడంతో బ్రేవి్‌సకు లైఫ్‌ లభించినా, మరుసటి బంతికే భారీషాట్‌ కొట్టబోయి అతడు పెవిలియన్‌ చేరాడు. దాంతో 84 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామం విడిపోవడంతో పంజాబ్‌ ఊపిరిపీల్చుకుంది. ఆపై తిలక్‌, పొలార్డ్‌  (10) సమన్వయలోపాలతో రనౌట్‌కాగా..ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ క్రీజులో ఉండడంతో తొలి విజయంపై ముంబై ధీమాగానే కన్పించింది. అందుకు తగ్గట్టుగా సూర్య భారీషాట్లతో ఆశలురేపినా 19వ ఓవర్లో అతడిని అవుట్‌ చేసిన రబాడ ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఇక చివరి ఓవర్లో 22 రన్స్‌ చేయాల్సిన వేళ..ఉనాద్కట్‌ తొలి బంతిని సిక్సర్‌గా కొట్టడంతో ముంబై బోణీ చేసేలా అన్పించింది. కానీ ఉనాద్కట్‌ (12), బుమ్రా (0), మిల్స్‌ (0)ను స్మిత్‌ అవుట్‌ చేయడంతో ముంబైకి నిరాశ తప్పలేదు. 


మయాంక్‌, ధవన్‌ దూకుడు: పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో తొలుత అగర్వాల్‌ దూకుడు ప్రదర్శించగా..ఆపై ధవన్‌ దంచాడు. చివర్లో జితేశ్‌, షారుక్‌ఖాన్‌ మెరుపులు మెరిపించారు. థంపి మొదటి ఓవర్లో మయాంక్‌ రెండు ఫోర్లు, ఉనాద్కట్‌ వేసిన రెండో ఓవర్లో ధవన్‌ సిక్స్‌ కొట్టడంతో పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ధాటిగా మొదలైంది. ఐదో ఓవర్లో స్పిన్నర్‌ మురుగన్‌ అశ్విన్‌కు మయాంక్‌ 4,4,6తో స్వాగతం పలికాడు. ఇక మిల్స్‌ ఓవర్లో ధవన్‌, మయాంక్‌ చెరో ఫోర్‌ సాధించడంతో పవర్‌ప్లేలో వికెట్‌ నష్టపోకుండా పంజాబ్‌ 65 పరుగులు చేసింది. మరింత రెచ్చిపోయిన అగర్వాల్‌..మిల్స్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌ కొట్టబోయిన మయాంక్‌ లాంగా ఫ్‌లో సూర్యకుమార్‌కు  దొరికిపోయాడు. దాంతో 97 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.


13వ ఓవర్లో మిల్స్‌ బౌలింగ్‌లో కీపర్‌ ఇషాన్‌ క్యాచ్‌ వదిలేయడంతో లైఫ్‌ పొందిన ధవన్‌..ఉనాద్కట్‌ బౌలింగ్‌లో చక్కటి ఫోర్‌ సంధించి ఆపై మరో సింగిల్‌తో 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ చేరాడు. ఇదే ఓవర్లో స్లో డెలివరీతో బెయిర్‌స్టో (12)ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన ఉనాద్కట్‌ ముంబైకి ఊరటనిచ్చాడు. వెంటనే.. లివింగ్‌స్టోన్‌ (2)ను బుమ్రా అవుట్‌ చేసి ముంబైకి డబుల్‌ బ్రేక్‌ ఇచ్చాడు. 17వ ఓవర్లో తన బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టిన ధవన్‌ను థంపీ క్యాచవుట్‌  చేశాడు. మరోవైపు జితేశ్‌ వస్తూనే ఉనాద్కట్‌ బౌలింగ్‌లో 6,4,6,4తో దుమ్ము రేపి 18వ ఓవర్లో 23 రన్స్‌ రాబట్టాడు. థంపి వేసిన ఆఖరి ఓవర్లో షారుక్‌ (15) 6,6 కొట్టినా అతడి యార్కర్‌కే క్లీన్‌బౌల్డయ్యాడు. 


స్కోరుబోర్డు

పంజాబ్‌ కింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అశ్విన్‌ 52, శిఖర్‌ ధవన్‌ (సి) పొలార్డ్‌ (బి) థంపీ 70, బెయిర్‌స్టో (బి) ఉనాద్కట్‌ 12, లివింగ్‌స్టోన్‌ (బి) బుమ్రా 2, జితేష్‌ శర్మ (నాటౌట్‌) 30, షారుక్‌ ఖాన్‌ (బి) థంపీ 15, ఓడియన్‌ స్మిత్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 20 ఓవర్లలో 198/5; వికెట్ల పతనం: 1-97, 2-127, 3-130, 4-151, 5-197; బౌలింగ్‌: బాసిల్‌ థంపీ 4-0-47-2, జైదేవ్‌ ఉనాద్కట్‌ 4-0-44-1, బుమ్రా 4-0-28-1, మురుగన్‌ అశ్విన్‌ 4-0-34-1, టైమల్‌ మిల్స్‌ 4-0-37-0.

ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ (సి) అరోరా (బి) రబాడ 28, ఇషాన్‌ కిషన్‌ (సి)రోహిత్‌ (బి) అరోరా 3, డెవాల్డ్‌ బ్రెవిస్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) స్మిత్‌ 49, తిలక్‌ వర్మ (రనౌట్‌) 36, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) స్మిత్‌ (బి) రబాడ 43, పొలార్డ్‌ (రనౌట్‌) 10, ఉనాద్కట్‌ (సి) అగర్వాల్‌ (బి) స్మిత్‌ 12, మురుగన్‌ అశ్విన్‌ (నాటౌట్‌) 0, బుమ్రా (సి) ధవన్‌ (బి) స్మిత్‌ 0, టైమల్‌ మిల్స్‌ (సి) అగర్వాల్‌ (బి) స్మిత్‌ 0, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 186/9; వికెట్ల పతనం: 1-31, 2-32, 3-116, 4-131, 5-152, 6-177, 7-185, 8-186, 9-186; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4-0-43-1, రబాడ 4-0-29-2, అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-29-0, ఓడియన్‌ స్మిత్‌ 3-0-30-4, లివింగ్‌స్టోన్‌ 1-0-11-0, రాహుల్‌ చాహర్‌ 4-0-44-0.

Updated Date - 2022-04-14T09:26:05+05:30 IST