గ్రామ, వార్డుల్లో.. స్పోర్ట్స్‌ క్లబ్‌లు

ABN , First Publish Date - 2022-09-24T06:01:23+05:30 IST

గ్రామ, వార్డు స్థాయిల్లో స్పోర్ట్స్‌ క్లబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు శారీరకంగా, ఆరోగ్యపరంగా ధృఢంగా ఉండేలా చేయడంతో పాటు క్రీడలు, ఫిటనెస్‌, వినోద కార్యక్రమాల్లో వారిని భాగాస్వామ్యం చేయడం ఈ క్లబ్‌ల ముఖ్య ఉద్దేశంగా చెబుతోన్నది

గ్రామ, వార్డుల్లో.. స్పోర్ట్స్‌ క్లబ్‌లు

విధి విధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం

క్రీడలు, ఫిట్‌నెస్‌, వినోద కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం

గుంటూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు స్థాయిల్లో స్పోర్ట్స్‌ క్లబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు శారీరకంగా, ఆరోగ్యపరంగా ధృఢంగా ఉండేలా చేయడంతో పాటు క్రీడలు, ఫిటనెస్‌, వినోద కార్యక్రమాల్లో వారిని భాగాస్వామ్యం చేయడం ఈ క్లబ్‌ల ముఖ్య ఉద్దేశంగా చెబుతోన్నది. ఈ క్లబ్‌ల నిర్వహణ కోసం గ్రామాల స్థాయిలో పంచాయతీ స్పోర్ట్స్‌ అథారిటీలు, మండల స్థాయిలో మండల స్పోర్ట్స్‌ అథారిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలానే వాటికి జాబ్‌ఛార్టులను కూడా పంపించింది. ఈ స్పోర్ట్స్‌ క్లబ్‌లు వివిధ క్రీడలకు సంబంధించి నెలవారీగా టోర్నమెంట్‌లు నిర్వహించి గ్రామ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి. మండల/నియోజకవర్గ/జిల్లా స్థాయిలో ప్రతి నెల అంతర్‌ క్లబ్‌ టోర్నమెంట్‌లు కూడా ఈ స్పోర్ట్స్‌ క్లబ్‌లు నిర్వహిస్తాయి. పంచాయతీ సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యేలను భాగాస్వాములను చేసి స్పాన్సర్‌షిప్‌ల సాధించి మౌలిక సదుపాయాల కల్పిస్తారు. గ్రామ పంచాయతీల నుంచి కూడా స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కోసం నిధులు సమీకరిస్తారు. ఆయా క్లబ్‌లలోని సభ్యులంతా కలిసి అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రెటరీ, జాయింట్‌ సెక్రెటరీ, కోశాధికారి, ఈసీ సభ్యులను ఎన్నుకొంటారు. ఉగాది, సంక్రాంతి, మహిళా దినోత్సవం, రిపబ్లిక్‌ డే, స్వాతంత్య్ర దినోత్సవం రోజున క్రమం తప్పకుండా పోటీలు నిర్వహిస్తారు. మండల, జిల్లా పరిషత్తు 4 శాతం నిధులను స్పోర్ట్స్‌ కోసం కేటాయించి అంతర్‌ గ్రామ క్లబ్‌ల పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

అథారిటీలు ఇలా..

గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసే పంచాయతీ స్పోర్ట్స్‌ అథారిటీలో సర్పంచ్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలానే సభ్యులుగా పీఎల్‌ఐఏ అధ్యక్షుడు/సెక్రెటరీ ఉంటారు. రూ. 50 వేలు విరాళం ఇచ్చే వ్యక్తులు, జిల్లా స్థాయి క్రీడాకారులకు కూడా సభ్యత్వం ఉంటుంది. మెంబర్‌ సెక్రెటరీగా పీఈటీ వ్యవహరిస్తారు. మండల స్థాయి స్పోర్ట్స్‌ అథారిటీలలో ఎక్స్‌అఫీషియో చైర్మన్‌గా ఎంపీపీ, ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా తహసీల్దారు, ఇంజనీరింగ్‌, విద్యా శాఖ అధికారి, పిజికల్‌ డైరెక్టర్‌, ఎంపీడీవో ఉంటారు. మెంబర్‌ కన్వీనర్‌గా జిల్లా స్థాయి ఫిజికల్‌ డైరెక్టర్‌ వ్యవహరిస్తారు. సభ్యులుగా సీఐ, హెచ్‌ఎం, ప్రిన్సిపల్‌, మండల క్రీడాకారులు, స్థానిక ఫిలాంత్రోపిస్టు ఉంటారు. గ్రామ, మండల స్థాయి క్రీడాప్రాధికార సంస్థలు టోర్నమెంట్‌లు నిర్వహించడం, చందాలు సేకరించడం, స్టేడియం, ఇండోర్‌ స్టేడియం, ఈతకొలను, క్రీడా మైదానాల నిర్మాణానికి చర్యలు తీసుకొంటాయి. అలానే మార్షల్‌ ఆర్ట్స్‌ని కూడా ప్రమోట్‌ చేస్తాయి. 


 

Updated Date - 2022-09-24T06:01:23+05:30 IST