15వేల మందితో స్పాట్‌ వాల్యుయేషన్‌.. నెల రోజుల్లో ఫలితాల వెల్లడి

ABN , First Publish Date - 2022-05-20T20:58:14+05:30 IST

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రధాన పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం మే 24 వరకు జరగనున్నాయి. కానీ, గురువారంతో ప్రధాన పరీక్షలు పూర్తి అయ్యాయి. పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌తో పాటు, బ్రిడ్జి కోర్సు..

15వేల మందితో స్పాట్‌ వాల్యుయేషన్‌.. నెల రోజుల్లో ఫలితాల వెల్లడి

హైదరాబాద్‌,(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రధాన పరీక్షలు(Intermediate‌ Main Tests) గురువారంతో ముగిశాయి. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం మే 24 వరకు జరగనున్నాయి. కానీ, గురువారంతో ప్రధాన పరీక్షలు పూర్తి అయ్యాయి. పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌తో పాటు, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌, మోడరన్‌ లాంగ్వేజీ, జాగ్రఫీ పేపర్లకు సంబంధించిన పరీక్షలు మిగిలాయి. 24వ తేదీతో ఇవి కూడా పూర్తి అయిపోతాయి. ఈ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువుగా ఉంటుంది. ఇక, గురువారం కెమిస్ర్టీ పేపర్‌-2, కామర్స్‌ పేపర్‌-2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 4,11,783 మంది విద్యార్థులు రావాల్సి ఉండగా, ఇందులో 95 శాతం మంది అంటే 3,91,242 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 20,541 మంది గైర్హాజరయ్యారు. కాగా, ఇంటర్‌ ప్రధాన పరీక్షలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ సంతోషం వ్యక్తం చేశారు. అందరి కృషితో ప్రధాన పరీక్షలను పూర్తి చేశామని తనను కలిసిన అధ్యాపక సంఘాల ప్రతినిధులతో అన్నారు. ఈసారి 9.7 లక్షల మంది విద్యార్థుల పరీక్షలను రాశారని వివరించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఈసారి కొన్ని చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, వచ్చే ఏడాది అవి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 18005999333కు ఫొన్‌ చేయాలని సూచించారు. సుమారు 15 వేల మంది సిబ్బందితో స్పాట్‌ వాల్యూయేషన్‌ను నిర్వహిస్తామని, నెల రోజుల్లో పరీక్ష ఫలితాలను ప్రకటిస్తామని జలీల్‌ వెల్లడించారు. 


కాంట్రాక్ట్‌ అధ్యాపకుల ఏప్రిల్‌-మే వేతనాల విడుదల 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌కు సంబంధించిన ఏప్రిల్‌, మే నెల వేతనాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 3554 మంది లెక్చరర్లు కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీరి ఏప్రిల్‌, మే నెల వేతనాలకు గాను రూ.38.53కోట్ల నిధులు విడుదల చేశారు. 


విద్యాశాఖ కార్యదర్శిగా కరుణ నియామకంపై హర్షం 

విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియామకం పట్ల ఇంటర్‌ విద్య జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, మన ఊరు- మన బడి, నూతన విద్యా విధానం అమలు వంటి వాటిని అమలు చేయాల్సిన సమయంలో విద్యా శాఖకు రెగ్యులర్‌ కార్యదర్శి ఉండటం ఆవసరమన్నారు. కొత్త కార్యదర్శి నియామకం ద్వారా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నిర్ణయాలను ఎప్పటికప్పుడు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. 


2 లక్షలకు చేరువలో ఎంసెట్ దరఖాస్తులు

రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. గురువారం వరకు మొత్తం 1, 94, 008 దరఖాస్తులు అందాయి. ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి 1,23,565 మంది, అగ్రీ, మెడికల్ విభాగానికి 70,443 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - 2022-05-20T20:58:14+05:30 IST