ఉడుత భక్తి!

ABN , First Publish Date - 2022-08-04T04:38:32+05:30 IST

ఒక వెదురు చెట్టులో ఉడుత నివాసం ఉండేది. ఆ ఉడుతకి జాలి గుణమెక్కువ. ఎవరే ఇబ్బంది పడినా స్పందించేది...

ఉడుత భక్తి!

ఒక వెదురు చెట్టులో ఉడుత నివాసం ఉండేది. ఆ ఉడుతకి జాలి గుణమెక్కువ. ఎవరే ఇబ్బంది పడినా స్పందించేది. తనకు సాయం చేసినవారి పట్ల భక్తి భావంతో ఉండేది. ఉడుతాసాయం చేసేది. వెదురు బొంగులమీద గెంతుతూ ఆడుకునే ఉడుతను చూసి ఓ గద్ద అసూయపడింది. పైగా ఆ ఉడుతను కాళ్లతో రక్కి తినందే నిద్రపోకూడదని మనసులో అనుకుంది. ఎప్పటిలాగే మధ్యాహ్నం సమయంలో ఉడుత ఆడుకుంటూ వెళ్లి నీళ్లు నిలిచిన చిన్న గుంత దగ్గరికి పోయింది. ఒక్క క్షణంలో గద్ద ఉడుత  మీదకు రివ్వున వచ్చింది. అది చూసి చావే గతి అనుకుంది ఉడుత. ఆ తర్వాత ఏమైందో దానికి గుర్తులేదు. 


ఉడుత కళ్లు తెరిచి చూడగానే కాకుల గుంపు ఒకటి కనిపించింది. ‘అసలు నేనెందుకు ఇక్కడున్నా?’ అన్నది. ‘మాకు ఉడుతలంటే ప్రేమ. ఉడుతలెవరికీ ఏ హాని తలపెట్టకూడద’ని మాకు మా పెద్దలు చెప్పారంటూ ఓ కాకి కాస్త ఉడుత ముందుకు వచ్చి చెప్పింది. ‘మీ మేలు మర్చిపోలేను’ అంటూ.. ఉడుత తన ఇంటికి వెళ్లిపోయింది. ఒక రోజు ఉడుత చెట్లపై ఆడుకుంటోంది. ఆ సమయంలో ఓ వేపచెట్టు దగ్గర ఉండే రాయి దగ్గరకు వెళ్లింది. చెట్టుకింద గద్దలన్నీ గుంపు కూడాయి. ‘కాకులపై రాత్రిపూట దాడి చేద్దాం. ఈ అడవిలో మనమే రాజులం’ అంటూ గద్దలు మాట్లాడుకుంటున్నాయి. ఈ విషయం విని.. కాకులకు చెప్పింది ఉడుత. కాకులన్నీ జాగ్రత్తగా ఉండాలని, గద్దలను ఎదుర్కునేందుకు వ్యూహం పన్నాయి. ఒకరోజు రాత్రిపూట ఒకేసారి గద్దలు కాకుల గుంపుపై దాడి చేశాయి. అనుకున్న పథకం ప్రకారమే.. కాకులు గద్దలను గట్టిగా ఎదుర్కున్నాయి. పైగా కాకులు నల్లగా ఉండటంతో చీకట్లో గద్దలకు ఏమీ అర్థం కాలేదు. కాకులు పొడవటంతో చాలా గద్దలు గాయాలతో నేల కూలాయి. ఆ తర్వాత గద్దలు కాకుల జోలికి రాలేదెన్నడూ.

Updated Date - 2022-08-04T04:38:32+05:30 IST