పౌర్ణమి ఏర్పాట్లపై సమీక్ష

ABN , First Publish Date - 2020-11-27T05:38:24+05:30 IST

కార్తీక పౌర్ణమి ఆదివారం రావడం, మూడో సోమవారం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.

పౌర్ణమి ఏర్పాట్లపై సమీక్ష
సమావేశంలో మాట్లాడుతున్న ఈవో కేఎస్‌ రామరావు

  1. దర్శనం వేళల్లో మార్పు
  2. ఐదు విడతలుగా ఆర్జిత అభిషేకాలు
  3. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి


 శ్రీశైలం, నవంబరు 26: కార్తీక పౌర్ణమి ఆదివారం రావడం, మూడో సోమవారం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. ఈవో కేఎస్‌ రామరావు యూనిట్‌ అధికారులు, పర్యవేక్షకులు, ఉభయ దేవాలయ ప్రధాన అర్చకులు, స్థానిక సర్కిల్‌ ఇస్పెక్టర్‌ బీవీ రమణ, సబ్‌ ఇస్పెక్టర్‌ హరిప్రసాద్‌, స్థానిక వైద్యులతో కలిసి పరిపాలనా భవంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల అమలు, క్యూలైన్ల నిర్వహణ, సౌకర్యవంతమైన దర్శనం, అర్జితసేవలు, జ్వాలాతోరణం, లక్షదీపోత్సవం, పుష్కరిణి హరతి, పాతాలగంగ వద్ద నదీహారతి వంటి మొదలైన అంశాలపై చర్చించారు. ఆది, సోమవారం రోజులలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శనాలను ఉదయం 4:30 నుంచి సాయంకాలం 4:30 గంటల వరకు, తిరిగి 5:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కొనసాగుతుందని ఈవో తెలిపారు. ఆర్జిత అభిషేకాలు ఐదు విడతలుగా నిర్వహంచనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా, కరెంట్‌ బుకింగ్‌ ద్వారా ఆర్జిత అభిషేక టికెట్లను పొందవచ్చన్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపారాధనలకు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో నిరంతరం బిస్కెట్లు, మంచినీరు, ఉదయం వేలల్లో వేడి పాలను భక్తులకు అందిస్తున్నారు. దర్శనానంతరం అమ్మవారి దేవాలయం వెనుకవైపున ఉదయం 10 నుంచి 3 వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ పొట్లాల ద్వారా అందజేశారు. ప్రతి భక్తుడిని క్యూలైన్‌ ప్రవేశద్వారాల వద్ద థర్మల్‌ గన్‌ ద్వారా ఉష్ణోగ్రతలను పరీక్షించి మాస్కులను ధరింపజేసి దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సదుపాయాలను కల్పించేందుకు దేవస్థానం కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించింది.

 

దత్తాత్రేయ స్వామికి పూజలు

 శ్రీశైలం క్షేత్రంలోని మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలోని దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజ చేశారు. పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు.

Updated Date - 2020-11-27T05:38:24+05:30 IST