ఆదర్శ మాధుర్యం

ABN , First Publish Date - 2020-10-16T05:34:34+05:30 IST

గురజాడ, ధర్మవరం, వీరేశలింగం ఆధునిక సాహిత్య సౌధ నిర్మాణానికి పునాదివేసిన కాలాన, కళా హృదయం గల బాపిరాజు ఆ సౌధానికి ఒక స్తంభం. అదొక విశిష్ట స్తంభం-హంపీ హజార...

ఆదర్శ మాధుర్యం

గురజాడ, ధర్మవరం, వీరేశలింగం ఆధునిక సాహిత్య సౌధ నిర్మాణానికి పునాదివేసిన కాలాన, కళా హృదయం గల బాపిరాజు ఆ సౌధానికి ఒక స్తంభం. అదొక విశిష్ట స్తంభం-హంపీ హజార రామాలయ స్తంభం వలె ఎంతటి స్పందనానికైనా చెమ్మగిలేది; విఠ్ఠలరాయని గుడికంబం వలె రాగరంజనలు పలికేది; కష్టాలు పైకొన్నప్పుడు కొంత సంచలించినా, మందరం వలె మథించేది.


కళలలోనే పుట్టి, కళలలోనే పెరిగి, కళలకు జీవితం అంకితం చేసి, కళా సేవలోనే కాలధర్మం చెందినవాడు శ్రీఅడవి బాపిరాజు. ఆయన జననం 19వ శతాబ్ది తుదిలో -గురజాడ, ధర్మవరం, వీరేశలింగం ఆధునిక సాహిత్య సౌధ నిర్మాణానికి పునాదివేసిన కాలాన, కళా హృదయం గల శ్రీ బాపిరాజు ఆ సౌధానికి ఒక స్తంభం. అదొక విశిష్ట స్తంభం-హంపీ హజార రామాలయ స్తంభం వలె ఎంతటి స్పందనానికైనా చెమ్మగిలేది; విఠ్ఠ లరాయని గుడికంబం వలె రాగరంజనలు పలికేది; కష్టాలు పైకొన్నప్పుడు కొంత సంచలించినా, మందరం వలె మథించేది. ఆయన తరచి చూడని కళారూపం కానరాదు. కథకుడు కవి కావడం, నవలారచయిత చిత్రకారుడు కావడం, వీటన్నిట నిష్ణాతుడు నాట్యకోవిదుడు కావడం అరుదు. శ్రీ బాపిరాజు కవి, కథకుడు, నవలా రచయిత, చిత్రకారుడు, నాట్యాచార్యుడు.

 

వ్యత్యాసాలెరుగని సుందర సమాజ నిర్మాణం ఆయన ఆదర్శం. దానిని సాధించడానికి ఆయన 1920లోనే జాతీయ సమరంలో పాల్గొని కారాగారవాసం క్లేశం అనుభవించడం, అందుకోసమే బందరు జాతీయ కళాశాలాధ్యక్ష పదవిని స్వీకరించడం కూడా. ‘విశ్వ శ్రేయః కావ్యం’ అనేది తెలుగువారికి వెన్నతో బెట్టిన నానుడి. అయినప్పుడు శ్రీబాపిరాజు సమాజానికి వేరు పురుగయిన జమిందారీ విధానాన్ని రూపుమాప సమకట్టిన ‘నారాయణరావు’ను సృష్టించడమేమి, అస్పృశ్యతను హతమార్చడానికి ‘నరుడు’ ను తీర్చి దిద్దడమేమి ఎంతైనా సమంజసం. తన ఆదర్శ వ్యాప్తి, కళా సందేశ విస్తృతి అవిచ్ఛన్నంగా కొనసాగడానికి ఆయనొక నూతన సంప్రదాయం, శిష్య పరంపర నెలకొల్పారు. కనుకనే నవ్యసాహిత్య పరిషత్తు ఆయనను ‘కులపతి’గా పేర్కొని తనను సత్కరించు కొంది. ఆయన జీవితం పూలపాన్పేమీ కాదు. అది కంటకితం, సంకట మయం. ‘మధ్యతరగతి వారిలో అసూయా విద్వేషాలు వుండనే వుంటాయి. కష్టాలకు కరువే ఉండదు. వాటిని అధిగమించి ఆదర్శ మాధుర్యంలో కరగిపోవాలి. అప్పుడే మనం సంఘాభ్యుదయం కోసం కలకంఠంతో ఆలపించగలం’ అనే విశ్వాసం జీర్ణించుకున్నవారు గనుకనే ఎన్నికష్టాలు క్రమ్ముకున్నా, ఆయన అనుక్షణమూ సాహిత్య సమారాధనంలో నిమగ్నుడయి వుండేవారు. 


-1952 సెప్టెంబర్ 24 సంపాదకీయం ‘కులపతి: శ్రీ అడవి బాపిరాజు’ నుంచి

(‘ఆంధ్రప్రభ’ సౌజన్యంతో)


Updated Date - 2020-10-16T05:34:34+05:30 IST