అదరగొట్టిన ఆటపట్టు

ABN , First Publish Date - 2022-06-28T09:38:34+05:30 IST

కెప్టెన్‌ చమరి ఆటపట్టు (48 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 80 నాటౌట్‌) రికార్డు అర్ధ శతకంతో.. శ్రీలంక మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌ను తప్పించుకొంది.

అదరగొట్టిన ఆటపట్టు

మూడో టీ20లో భారత్‌పై లంక గెలుపు

టీ20 క్రికెట్‌లో 2వేల పరుగుల మైలు రాయి చేరిన తొలి లంక క్రికెటర్‌ చమరి ఆటపట్టు. పొట్టి ఫార్మాట్‌లో పురుషుల్లో దిల్షాన్‌ తిలకరత్నే (1889 రన్స్‌) అత్యధిక పరుగులు సాధించాడు. 


దంబుల్లా: కెప్టెన్‌ చమరి ఆటపట్టు (48 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌తో 80 నాటౌట్‌) రికార్డు అర్ధ శతకంతో.. శ్రీలంక మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌ను తప్పించుకొంది. సోమవారం జరిగిన ఆఖరి టీ20లో లంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్‌తో మూడు టీ20ల సిరీ్‌సలో 1-2తో నిలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. మరో ఓపెనర్‌ స్మృతీ మంధాన (22), సబ్బినేని మేఘన (22) నిలకడగా ఆడారు.


ఆ తర్వాత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (39 నాటౌట్‌), రోడ్రిగ్స్‌ (33) నాలుగో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యంతో గౌరవప్రద స్కోరు అందించారు. ఛేదనలో చమరి విధ్వంసంతో.. లంక 17 ఓవర్లలో 141/3 స్కోరు చేసి అలవోకగా నెగ్గింది. ఓపెనర్‌ విష్మీ (5)ను రేణుక స్వల్ప స్కోరుకే అవుట్‌ చేసినా.. ఆటపట్టు మాత్రం బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. వన్‌డౌన్‌లో వచ్చిన హర్షిత (13)తో కలసి రెండో వికెట్‌ 31 పరుగులు జోడించిన చమరి.. నీలాక్షి (30) జతగా మూడో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. హర్షితను రాధా వెనక్కిపంపగా.. నీలాక్షి రనౌటైంది. కానీ, కవిష (7 నాటౌట్‌) అండతో చమరి.. 18 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించింది.


సంక్షిప్త స్కోర్లు:

భారత్‌:

20 ఓవర్లలో 138/5 (హర్మన్‌ 39 నాటౌట్‌, జెమీమా 33, మేఘన 22); శ్రీలంక: 17 ఓవర్లలో 141/3 (చమరి 80 నాటౌట్‌, నీలాక్షి 30; రేణుక 1/27, రాధ 1/41). 

Updated Date - 2022-06-28T09:38:34+05:30 IST