పతనంలో మనకు పోటీ శ్రీలంకే!

ABN , First Publish Date - 2022-04-21T06:09:24+05:30 IST

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో తలమునకలైన శ్రీలంక పరిస్థితిని చూస్తుంటే, ఆ స్థితికి చేరటానికి కారణమైన ఆ దేశ విధానాలను పరిశీలిస్తే, త్వరలో మన రాష్ట్రం కూడా అదే స్థితికి చేరనున్నదా అన్న సందేహం...

పతనంలో మనకు పోటీ శ్రీలంకే!

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో తలమునకలైన శ్రీలంక పరిస్థితిని చూస్తుంటే, ఆ స్థితికి చేరటానికి కారణమైన ఆ దేశ విధానాలను పరిశీలిస్తే, త్వరలో మన రాష్ట్రం కూడా అదే స్థితికి చేరనున్నదా అన్న సందేహం కలుగక మానదు. రాజకీయాలను, ఆర్థిక అంశాలను ముడిపెట్టి పాలన కొనసాగిస్తే చివరకు సంక్షోభం తప్పదనటానికి శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులే తార్కాణం. 1948లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిన తరువాత ఇప్పటివరకు ఈ దేశం ఇంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. అక్కడి నాయకులు తమ విద్యుక్తధర్మాలను పక్కనపెట్టి రాజకీయం కోసం పాకులాడారు. ప్రభుత్వంపై ప్రజలలో ఆక్రోశంతో కూడిన ఒక అసాధారణ పరిస్థితి నెలకొంది. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిని ప్రజలు చుట్టుముట్టి దాడి చేసే స్థాయికి దిగారంటే వారి ఆక్రోశం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం శ్రీలంక ప్రజలకు ఇంట్లో ఉండాలంటే కరెంట్ కోత, భయటకు వెళ్లాలనుకుంటే ధరల మోత. పైపెచ్చు పోలీసుల కర్ఫ్యూతో నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కడుపునిండా తిండి తినలేని పరిస్థితి. కుప్పలు తెప్పలుగా అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచుతూ రాజకీయంగా ఎదగాలనుకుంటున్న నాయకులకు శ్రీలంక పరిస్థితులు ఒక గుణపాఠంగా నిలవాలి. 


ప్రభుత్వాలు తమ పాలనా తీరుతెన్నులను ఎప్పటికప్పుడు నిజాయితీగా సమీక్షించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. దీన్ని పాటించకపోవటమే శ్రీలంకలో రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోవడానికి కారణం. ఆ దేశం ప్రస్తుతం పేపర్ కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితికి చేరుకుంది. పేపర్ నిల్వలు అయిపోయి విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహించలేకపోతోంది. విదేశీ మారక నిల్వలు 1.6 బిలియన్ల డాలర్లకు పడిపోయాయి. దిగుమతులకు డబ్బు చెల్లించలేని పరిస్థితి. ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల కారణంగా ప్రజలు రోజుకు మూడు పూటలా తిండి తినలేకపోతున్నారు. రోజు కూలీ పని చేసుకునేవారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నిత్యావసరాల కోసం క్యూలైన్లలో బారులు తీరుతూ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశన్నంటాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ సన్నగిల్లడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వాటి ధరలకు రెక్కలు వచ్చాయి.


ఏపీలో కూడా శ్రీలంక మాదిరి సంక్షోభ వాతావరణమే నెలకొంది. ఇక్కడా స్థాయికి మించి అప్పులు చేస్తున్నారు. కేవలం 3 ఏళ్లల్లోనే రూ.4లక్షల కోట్ల అప్పులు చేశారు. 2019లో లంకలో ఈస్టర్ రోజున చర్చిలో ఉగ్రదాడి జరిగినా తిప్పికొట్టలేకపోయారు. ఏపీ కూడా నేరాల్లో దేశంలోనే టాప్లోనే నిలిచింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. పైగా పాలకుడే నేరస్థుడు కావడంతో ప్రజలకు రాజపూజ్యం–ఆదాయం స్థానంలో అవమానం–అప్పులు వచ్చి చేరాయి. ఈ పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.


ద్వీపదేశమైన శ్రీలంక చక్కటి పర్యాటక ప్రాంతం. ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగాన్ని అధ్యక్షుడు రాజపక్సే నిర్లక్ష్యం చేయడం నేటి ఆర్థిక సంక్షోభానికి మరో బలమైన కారణం. దాదాపుగా మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా దేశంలోనే అత్యంత పొడవైన సముద్రతీరం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి జాడ కరువైంది. మూడేళ్లుగా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావటం లేదు. ఉన్న పరిశ్రమలను తరిమికొడుతున్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, ఆదాయం తగ్గిపోయింది, పన్నుల పేరుతో ప్రభుత్వం దోపిడీ ఎక్కువైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చెత్తమీద పన్ను వేసిన ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుంది.


శ్రీలంక 2022లో సుమారు 7 బిలియన్ల డాలర్ల ఋణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వంపై దాదాపు 7 లక్షల కోట్ల అప్పు ఉంది. శ్రీలంక ఒక ఋణాన్ని తీర్చేందుకు మరొక ఋణం చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏపీ ప్రభుత్వం సైతం ఒక అప్పు తీర్చేందుకు మరొక అప్పు చేస్తున్నది. మద్యం, సినిమా టికెట్లు, ప్రభుత్వ ఆస్తులు వంటివి చూపించి ఋణాలు తెచ్చుకున్నారు. అవి తీర్చే మార్గమేంటో ప్రభుత్వం చెప్పకపోవడంతో కొత్త ఋణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి.


ఆర్థిక సంక్షోభం ముదిరి తాగేనీరు కూడా బ్లాక్‌లో కొనుక్కోవాల్సి రావడంతో ఆగ్రహించిన లంకేయులు కోపంతో అధ్యక్షుడి భవనాన్ని చుట్టుముట్టారు. దిక్కుతోచని సైన్యం అధ్యక్షుడిని రహస్య ప్రదేశానికి తరలించి రాజధాని కొలంబోలో 144 సెక్షన్ విధించింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో విసుగుచెందిన ఉద్యోగులు, యువత, ఆశా, అంగన్‌వాడీ, వైద్య విభాగ సిబ్బంది ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడించేందుకు యత్నించారు. దీంతో ముందు జాగ్రత్తగా 365 రోజులపాటు సీఎం ఇంటి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులపై రేప్ కేసులు పెట్టిన దుస్థితి రాష్ట్రంలో ఉంది. అదే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు.


ముందుచూపు, విజన్ లేని పాలకులు అధికారంలోకి రావడం వల్లనే శ్రీలంకలో పరిస్థితులు ఇలా దాపురించాయి. ఇటువంటి నాయకులు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతాలు అట్టడుగుకు చేరతాయి. ఏ దేశ ప్రభుత్వమైనా సరే తమ తమ రాజ్యాంగాలు, చట్టాలు, సిద్ధాంతాలకు లోబడి పని చేస్తే ప్రజలకు సుభిక్షం.

అనగాని సత్యప్రసాద్

శాసనసభ్యులు

Updated Date - 2022-04-21T06:09:24+05:30 IST