విదేశాల్లో ఉన్న శ్రీలంక జాతీయులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-04-13T20:44:20+05:30 IST

ఎంతో అవసరమైన ఆహారం, ఇంధనం కోసం చెల్లించేందుకు

విదేశాల్లో ఉన్న శ్రీలంక జాతీయులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం

కొలంబో : ఎంతో అవసరమైన ఆహారం, ఇంధనం కోసం చెల్లించేందుకు డబ్బు పంపించాలని విదేశాల్లో ఉంటున్న శ్రీలంక జాతీయులను ఆ దేశ ప్రభుత్వం కోరింది. 1948లో స్వాతంత్ర్యాన్ని సాధించిన శ్రీలంక ఇంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి. నిత్యావసర వస్తువులు, ఇంధనం, విద్యుత్తు సైతం అందుబాటులో ఉండటం లేదు. 


51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని శ్రీలంక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇచ్చే ప్యాకేజీ కోసం ఎదురు చూస్తోంది. మన దేశం బియ్యం, ఇంధనం, మందులు వంటివాటితోపాటు రుణ సహాయం కూడా చేస్తోంది. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నందలాల్ వీరసింఘే విడుదల చేసిన ప్రకటనలో, విదేశాల్లో ఉంటున్న శ్రీలంక జాతీయులు ఈ కీలక సమయంలో విదేశీ మారక ద్రవ్యాన్ని విరాళంగా ఇవ్వాలని, దేశాన్ని ఆదుకోవాలని కోరారు. విరాళాల కోసం అమెరికా, బ్రిటన్, జర్మనీలలో బ్యాంకు ఖాతాలను తెరిచినట్లు తెలిపారు. ఆహారం, ఇంధనం, మందులు వంటి చాలా అవసరం ఉన్న అంశాలకు మాత్రమే  ఈ నిధిని ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. 


ఇదిలావుండగా, విదేశాల్లోని శ్రీలంక జాతీయులు తమ స్వదేశ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు. సహాయపడటానికి తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రభుత్వాన్ని తాము నమ్మలేమని చెప్తున్నారు. అవసరార్థుల కోసమే ఈ విరాళాల సొమ్మును ఖర్చు చేస్తారనే నమ్మకం తమకు లేదని అంటున్నారు. 2004 డిసెంబరులో సునామీ కారణంగా దాదాపు 31 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ నేపథ్యంలో సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. 


Updated Date - 2022-04-13T20:44:20+05:30 IST