అధ్యక్షుడి అధికారాలకు కోతపెడతాం: శ్రీలంక ప్రధాని

ABN , First Publish Date - 2022-04-20T00:52:38+05:30 IST

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న శ్రీలంకలో ప్రజా నిరసనలు కొనసాగుతున్నాయి

అధ్యక్షుడి అధికారాలకు కోతపెడతాం: శ్రీలంక ప్రధాని

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న శ్రీలంకలో ప్రజా నిరసనలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆయన కుటుంబం అధికారం నుంచి తప్పుకోవాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్సుడు గొటబాయ రాజపక్స సోదరుడు, ప్రధానమంత్రి మహీంద రాజపక్ష నేడు మాట్లాడుతూ.. అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తామని అన్నారు. పార్లమెంటుకు మరింత సాధికారత కల్పిస్తామని, ఇందుకోసం రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారు.


దేశంలో రాజకీయ స్థిరత్వం కోసం, సంక్షోభంలో చిక్కుకున్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో చర్చలకు సహాయపడే వేగవంతమైన చర్యల్లో అధికార బదిలీ ఒకటని ప్రధాని మహీంద పార్లమెంటుకు తెలిపారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలను వెతుకుతున్నప్పుడు దేశంలో రాజకీయ, సామాజిక స్థిరత్వం కలిగి ఉండటం చాలా ముఖ్యమని ప్రధాని అన్నారు. పార్లమెంటుకు మరిన్ని అధికారలతో కూడిన రాజ్యాంగ హోదా సంస్కరణలతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. 


2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు రాజపక్ష మరిన్ని అధికారాలపై దృష్టి కేంద్రీకరించారు. కాగా, ఆందోళనకారులు వరుసగా 11వ రోజైన నేడు కూడా అధ్యక్షుడి కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనలు చేశారు. దేశం సంక్షోభంలో చిక్కుకుపోవడానికి ఆయన కారణమంటూ నినాదాలు చేస్తున్నారు.


మరోవైపు, దేశం సంక్షోభంలో చిక్కుకుపోవడానికి తాను చేసిన కొన్ని తప్పులు కూడా కారణమని గొటబాయ నిన్న అంగీకరించారు. సాయం కోసం ఐఎంఎఫ్ వద్దకు వెళ్లడానికి ఆలస్యం చేయడం, శ్రీలంక వ్యవసాయాన్ని పూర్తిగా సేంద్రియం దిశగా నడిపించాలన్న ఉద్దేశంతో ఆగ్రోకెమికల్స్‌ను నిషేధించడం వంటి తప్పులు అందులో ఉన్నాయన్నారు. ఇవి సంక్షోభానికి దారితీశాయన్నారు.


అయితే, ఆందోళనలు వెల్లువెత్తుతున్నా అధికార పీఠాల నుంచి తప్పుకునేందుకు అధ్యక్షుడు, ప్రధాని నిరాకరిస్తున్నారు. ప్రభుత్వంలో పాలుపంచుకోవాలన్న అధ్యక్షుడి ఆఫర్‌ను తిరస్కరిస్తున్న ప్రతిపక్షాలకు, సొంతంగా పార్టీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ లేకపోవడం గమనార్హం.

Updated Date - 2022-04-20T00:52:38+05:30 IST