AP News: రోజు రోజుకు పెరిగిపోతున్న వైసీపీ నాయకుల దౌర్జన్యాలు

ABN , First Publish Date - 2022-08-08T22:10:01+05:30 IST

రోజు రోజుకూ వైసీపీ నాయకుల (YCP Leaders) దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి.

AP News: రోజు రోజుకు పెరిగిపోతున్న వైసీపీ నాయకుల దౌర్జన్యాలు

 శ్రీ సత్యసాయి (Sri Sathyasai) జిల్లా: రోజు రోజుకూ వైసీపీ నాయకుల (YCP Leaders) దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. భూకబ్జాలకు పాల్పడుతున్న సంఘటనలు అధికమవుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో.. అమ్మిన భూములకు వారసులమంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇరు వర్గాల్లోనూ వైసీపీ నేతలు చేరి వివాదాలకు తెరతీస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మేజర్ పంచాయతీ గ్రామం, కొత్తపల్లి క్రాస్ వద్ద సర్వే నెంబర్ 104, 71లో రెండెకరాల భూమిని 1988లో ఇదే గ్రామానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసి.. 40 ప్లాట్లు వేసి విక్రయించారు. ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసినవారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. మరి కొన్ని నిర్మాణాలకు పూనుకుంటుండగా.. ఆ భూమిపై తమకు హక్కు ఉందంటూ 2014లో మరో వర్గం కోర్టును ఆశ్రయించడంతో అప్పటి నుంచి ఈ స్థలంలో నిర్మాణాలు నిలిచిపోయాయి.


అయితే కోర్టులో కేసు వేసినవారు ధర్మవరానికి చెందిన వ్యక్తులకు భూమిని విక్రయించడంతో వారు సోమందేపల్లికి చెందిన ఆ స్థలంలో చదును చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో వివాదం నెలకొని వాగ్వివాదానికి దిగారు. చివరకు పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో.. కోర్టులో కేసు ఉన్నందున.. ఆ స్థలంలో ఎలాంటి పనులు చేపట్టవద్దని పోలీసులు సూచించారు. ఈ భూముల కొనుగోలు వ్యవహారంపై ఇరు వర్గాల్లోనూ అధికార వైసీపీకి చెందిన నాయకులుండడం గమనార్హం. 30 ఏళ్ల క్రితం క్రయ విక్రయాలు జరిగిన భూమిలో వివాదాలు సృష్టిస్తున్నారంటూ కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల ధరలు పెరగడంతో అమ్మిన భూములకు వారసులమంటూ పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-08T22:10:01+05:30 IST