బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో విలీనమా?

Sep 25 2021 @ 00:10AM
శిరిపురపు శ్రీధర్‌

బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌


గుంటూరు, సెప్టెంబరు 24: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను సైద్ధాంతిక విరుద్ధ భావాలు గల బీసీ కార్పొరేషన్‌లో కలపటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్‌ తీవ్రంగా ఖండిచారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరులోని బ్రాడీపేటలో గల కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ జారీ చేసిన జీవోను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. దీని కారణంగా రాష్ట్రంలోని 75 లక్షల బ్రాహ్మణ జనాభా ఆందోళన చెందుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాదయాత్రలో బ్రాహ్మణ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు 2016లో బ్రాహ్మణ వేల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల పేద, మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలకు ఆరు పథకాల ద్వారా రూ.310 కోట్లు ఖర్చు చేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని కొనసాగించకుండా, నిధులు కేటాయించకుండా బ్రహ్మాణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో కలిపి యావత్‌ బ్రాహ్మణ సమాజాన్ని అన్యాయం, మోసం చేయటమేకాక అవమానానికి గురి చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇటీవల కొత్తగా కమ్మ, రెడ్డి, వెలమ, రాజు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని, మరి వాటిని బీసీ కార్పొరేషన్‌లో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. అగ్రవర్ణాలంటే కేవలం బ్రాహ్మణ జాతికి మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలైన కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, రాజు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌లను కూడా బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో తక్షణం విలీనం చేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దేవదాయ శాఖ పరిధిలో గత ప్రభుత్వం ఎంచుకున్న బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం దూరదృష్టితో బ్రాహ్మణులకు, దేవలయాలకు అవినావభావ సంబంధం ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయ ప్రాంగణంలో కొంతస్థలాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించి భవనాన్ని నిర్మించిందన్నారు. సొంత భవనం ఉంటే అందులో కార్యకలాపాలు చేయకుండా కొంతమంది అధికారులు సీఎం జగన్‌ను తప్పుదోవ పట్టించే విధంగా జీవో ఇచ్చినట్లయితే వెంటనే వైసీపీ నాయకులు, మత పెద్దలు దీనిపై పునరాలోచన చేయాలన్నారు. లేని పక్షంలో ప్రబుత్వం బ్రాహ్మణ జాతి తిరుగుబాటు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మల్లాది విష్ణు, కోనా రఘుపతి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారని, వీరుకాక మరో పది, 15 మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారని, ఈ క మ్రంలో వారంతా ఈ జీవో రద్దు చేయించకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చట్టబద్దత కల్పిస్తామని జగన్‌ ఊరూరు తిరిగి డాంబికాలు పలికారన్నారు. అయితే ఇప్పుడు 103 జీవోపై ఆయన ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. తక్షణం ఆ జీవోను ఉపసంహరించుకోకుంటే 13 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బ్రాహ్మణులు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.