సేద్యానికీ ఇం‘ధన’ భారం

ABN , First Publish Date - 2021-06-14T05:39:49+05:30 IST

డీజిల్‌ ధరల పెంపుతో దుక్కులు దున్నడం నుంచి పంట కోతలకు అయ్యే వ్యయం పెరగడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.

సేద్యానికీ ఇం‘ధన’ భారం
ఏర్పేడులో వరినాట్లు వేయడానికి దుక్కులు

 భారీగా పెరిగిన యంత్రాల అద్దె 


ఏర్పేడు, జూన్‌ 13: ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతన్నపైనా పెట్రో పిడుగు పడింది. కొంతకాలంగా వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రాల వినియోగం పెరిగింది. అయితే డీజిల్‌ ధరల పెంపుతో దుక్కులు దున్నడం నుంచి పంట కోతలకు అయ్యే వ్యయం పెరగడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో ఏర్పేడు మండలవ్యాప్తంగా 20వేల ఎకరాల్లో వివిధరకాల పంటలను సాగు చేస్తున్నారు. దుక్కులు దున్నడం నుంచి పంట కోతల వరకు ట్రాక్టర్‌, రొటోవేటర్‌ తదితర యంత్రాల వినియోగం పెరిగింది. ఒకటిన్నర నెలకాలంగా డీజిల్‌ ధరలు పెరగడం అన్నదాతల కంటిలో నలుసుగా మారింది. గతంలో ఎకరా దుక్కి దున్నడానికి ట్రాక్టర్‌ యజమానులు రూ.700 వంతున అద్దె వసూలు చేసే వారు. ప్రస్తుతం డీజిల్‌ ధరలు పెరగడంతో రూ.1500 చొప్పున డిమాండ్‌ చేస్తున్నారు. సొంత యంత్రాలున్నా గతంలో డీజిల్‌ కోసం రూ.400 ఖర్చవుతుండగా, ఇప్పుడు రూ.వెయ్యి ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పెరిగిన పెట్రో ధరలతో... ఎకరా దుక్కి దున్నడానికి ట్రాక్టర్‌ యజమానులు రూ.1500 అద్దెగాను, రొటొవేటర్‌కు రూ.1500, లోతుగా దుక్కులు దున్నడానికి(ఫ్లౌ) రూ.2,300 అద్దె కింద వసూలు చేస్తున్నారు. యంత్రాల అద్దెతో పాటు మరోవైపు కూలీల రేట్లు కూడా పెరగడం రైతన్నలకు భారంగా మారింది. కరోనా రెండవదశ విజృంభణతో పంట దిగుబడులను సకాలంలో విక్రయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సాగు వ్యయం పెరిగినందున ప్రభుత్వాలు స్పందించి పంట దిగుబడులకు గిట్టుబాటు ధర చెల్లించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-14T05:39:49+05:30 IST