‘‘నటనలో ఎస్.వి.రంగారావుగారు నాకు స్ఫూర్తి. ఆయనలా అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాలనేది నా కోరిక. ఆ దిశగా ‘శ్రీకారం’లో పోషించిన పాత్ర ఒక ముందడుగు లాంటిది’’ అని వీకే నరేశ్ అన్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘శ్రీకారం’ ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నరేశ్ పాత్రికేయులతో మాట్లాడారు. ‘‘ప్రవాసీయులు వ్యవసాయం చేయడానికి సొంత దేశానికి తిరిగొస్తున్నారు అనే పాయింట్ ఆధారంగా దర్శకుడు కిషోర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
‘శ్రీకారం’లో పొలంతో గుండెల నిండా అనుబంధం నింపుకున్న రైతు పాత్రను పోషించాను. నా పాత్ర ఈ సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులపై ఆ పాత్ర ప్రభావం ఉంటుంది. కథ ప్రధానంగా వ్యవసాయ నేపథ్యంలోనే సాగినా ఆద్యంతం వినోదం పంచుతూ మానవ సంబంధాలను చర్చిస్తూ సందేశాత్మకంగా ఉంటుంది. నా కెరీర్‌కు ఓ మైలురాయిగా నిలుస్తుంది’’ అని అన్నారు.