ఏనుగు పిల్ల తొలి బర్త్‌డే.. భలే చేశారుగా!

ABN , First Publish Date - 2020-11-14T15:23:48+05:30 IST

రోజుల వయసున్నప్పుడే తల్లి నుంచి వేరైపోయింది. నీటిలో కొట్టుకుపోవడంతో శరీరమంతా గాయాలు. ముందుకాళ్లు బాగా దెబ్బతిని కనీసం లేచి నిలబడలేని పరిస్థితి.

ఏనుగు పిల్ల తొలి బర్త్‌డే.. భలే చేశారుగా!

ఇంటర్నెట్ డెస్క్: రోజుల వయసున్నప్పుడే తల్లి నుంచి వేరైపోయింది. నీటిలో కొట్టుకుపోవడంతో శరీరమంతా గాయాలు. ముందుకాళ్లు బాగా దెబ్బతిని కనీసం లేచి నిలబడలేని పరిస్థితి. ఇంతటి దయనీయ స్థితిలో కేరళ ఫారెస్ట్ అధికారులకు కనిపించిందో బుజ్జి ఏనుగుపిల్ల. దాన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా బతకడం కష్టమని డాక్టర్లు కరాఖండిగా చెప్పేశారు. అయితే ఓ డాక్టర్ మాత్రం తన సర్వశక్తులూ ఒడ్డి ఈ చిన్ని జీవానికి ప్రాణాలు పోశారు. దానికి శ్రీకుట్టి అని పేరుపెట్టారు. ఇటీవలే శ్రీకుట్టి తొలి బర్త్‌డే జరుపుకొంది. దీనికి సంబంధఇంచిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నాయి.


కేరళలోని కొట్టూర్ ఎలిఫెట్ రీహాబిలిటేషన్ సెంటర్లో శ్రీకుట్టి తొలి బర్త్‌డే పార్టీ జరిగింది. దీనిలో ఓ పెద్దసైజు కేకును తయారుచేసి శ్రీకుట్టికి తినిపించారు. ఈ ఫంక్షన్‌కు శ్రీకుట్టితోపాటు మరో 15 ఏనుగు పిల్లలు కూడా వచ్చాయి. ఈ ఏనుగు పిల్లలు, మనుషుల మధ్య పెద్ద కేకు తిని బర్త్‌డే చేసేకుంది శ్రీకుట్టి. అంతేకాదండోయ్. శ్రీకుట్టి తలలో పువ్వులు కూడా పెట్టుకుంది. అందరిమధ్యా తల్లో పువ్వు పెట్టుకొని, మెడచుట్టూ కొత్త దుస్తులు కట్టుకొని కేకు తినేస్తూ చాలా సంబరపడిపోయింది. ఈ బర్త్‌డే పార్టీని వీడియో తీసిన అతిధులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.



రెండ్రోజుల వయసులో ఉన్నప్పుడు శ్రీకుట్టి.. ఓ నదిలో కొట్టుకుపోయింది. దీంతో తల్లి నుంచి వేరైపోయి శరీరమంతా గాయాలతో, కాళ్లు బాగా దెబ్బతిని స్పృహతప్పి పడిపోయింది. దీన్ని చూసిన ఫారెస్టు అధికారులు వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి గమనించిన వైద్యులు.. శ్రీకుట్టి బతకడం చాలా కష్టమని అభి్రాయపడ్డారు. అయితే డాక్టర్ ఈ.ఈశ్వరన్ మాత్రం తన ప్రయత్నం తాను చేస్తానంటూ శ్రీకుట్టికి చికిత్స చేశారు. ట్రీట్‌మెంట్ తర్వాత కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శ్రీకుట్టికి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ ఎప్పటికప్పుడు దాని ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ వచ్చారు. ఇలా ఎంతో జాగ్రత్తగా చూసుకోవడంతో కోలుకున్న శ్రీకుట్టి ఆదివారం తన తొలి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది.



శ్రీకుట్టి బర్త్‌డే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు శ్రీకుట్టిపై ముద్దులు కురిపిస్తున్నారు. ఈ పార్టీకి వచ్చిన డాక్టర్ ఈశ్వరన్‌ను శ్రీకుట్టి పలకరిస్తున్న ఫొటోలు కూడా నెటిజన్ల మనసులను కట్టిపడేస్తున్నాయి. వారంతా హ్యాపీబర్త్‌డే శ్రీకుట్టి అంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు. 


Updated Date - 2020-11-14T15:23:48+05:30 IST