Roshan Mahanama: శ్రీలంక మాజీ క్రికెటర్ మానవత్వం.. పెట్రోల్ బంకు దగ్గరకు వెళ్లి..

ABN , First Publish Date - 2022-06-21T00:45:30+05:30 IST

ఆర్థిక సంక్షోభం (Srilanka Crisis) కారణంగా ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో సామాన్య జనం పెట్రోల్, డీజిల్ కోసం..

Roshan Mahanama: శ్రీలంక మాజీ క్రికెటర్ మానవత్వం.. పెట్రోల్ బంకు దగ్గరకు వెళ్లి..

కొలంబో: ఆర్థిక సంక్షోభం (Srilanka Crisis) కారణంగా ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో సామాన్య జనం పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద పడిగాపులు గాస్తున్నారు. గంటల తరబడి క్యూలో ఉంటే గానీ పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి నెలకొంది. అలా ఇక్కట్లు పడుతున్న వాహనదారులకు కాస్తంత ఉపశమనం కలిగించేందుకు శ్రీలంక క్రికెట్ జట్టు (Srilanka Cricket) మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ శ్రీలంక ప్లేయర్ రోషన్ మహానామా (Roshan Mahanama) మానవత్వంతో ముందుకొచ్చాడు. పెట్రోల్ బంకుల (Petrol Bunks) వద్ద ఇంధనం కోసం క్యూలో గంటల కొద్దీ నిరీక్షించి అలసట చెందిన వారికి స్నాక్స్ పంపిణీ చేశాడు. క్యూలో ఉన్నవారికి బన్, టీ ఉచితంగా పంపిణీ చేశాడు. Community Meal Share అనే ఎన్జీవో సంస్థ బృందంతో కలిసి రోషన్ మహానామా Wijerama Mawatha, Wijerama Mawatha ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిరీక్షిస్తున్న వారికి టీ, బన్ అందజేశాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ (Twitter) ద్వారా వెల్లడించాడు. రోజురోజుకూ క్యూ లైన్లు పెరిగిపోతున్నాయని.. ఇలా ఇన్ని గంటల పాటు వాహనదారులు వేచి ఉండటం వల్ల వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రోషన్ మహానామా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.



కొలంబోలో (Colombo) ఈ వారం మొదట్లో గర్భవతులైన మహిళలకు ఫుడ్ వోచర్స్‌ను కూడా పంపిణీ చేసే కార్యక్రమం మొదలైంది. ఆహార కొరతతో పాటు చమురు కొరత కూడా శ్రీలంకను కలవరపాటుకు గురిచేస్తోంది. చమురు నిల్వలు వేగంగా ఖాళీ అవుతుండటంతో వాటిని ఆదా చేసే ప్రయత్నాల్లో శ్రీలంక బిజీగా ఉంది. అందులో భాగంగానే.. అత్యవసరం కాని సేవలను సోమవారం నుంచి అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పరిణామంతో.. పాఠశాలలు మూతపడిన పరిస్థితి నెలకొంది. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ద్వీప దేశం శ్రీలంక మునుపెన్నడూ లేనంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. రాజకీయ సంక్షోభంతో పాటు ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆహార ధాన్యాలు, మందులు, చమురుకు తీవ్ర కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్‌ను దిగుమతి చేసుకునేంత ఆర్థిక స్థోమత కూడా లేక శ్రీలంక ఇక్కట్లు ఎదుర్కొంటున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఇంధన కొరత ఏర్పడటంతో అక్కడి వాహనదారులు పెట్రోల్, డీజిల్‌ కోసం బంకుల ముందు గంటల తరబడి పడిగాపులు గాస్తున్న పరిస్థితి ఉంది.



క్యూ లైన్లలో ఉన్నవారు వారితో పాటు క్యూ లైన్లలో ఉన్నవారిని గమనించాలని, ఎవరైనా నీరసించినట్టు కనిపిస్తే ఆహారం, పానీయాలు అందించాలని కోరారు. తీవ్ర అస్వస్థతకు లోనయినట్లు అనిపిస్తే హెల్త్ లైన్ నంబర్ 1990కి కాల్ చేసి సమాచారం అందించాలని ఈ శ్రీలంక మాజీ క్రికెటర్ (Srilanka Ex Cricketer) సూచించాడు. గత మార్చి నెల నుంచి శ్రీలంకలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. దేశ ప్రజలు అక్కడ పరిస్థితులపై భగ్గుమనడంతో మేలో ప్రధాని పదవి నుంచి మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) తప్పుకోవాల్సి వచ్చింది. శ్రీలంకలో (Srilanka) పరిస్థితి ప్రస్తుతం ఎంత దయనీయంగా ఉందంటే.. ఐక్యరాజ్య సమితి చెబుతున్న ప్రకారం.. శ్రీలంకలో ప్రతీ ఐదుగురిలో నలుగురికి ఆహారం దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడి ఆహార కొరతను తీర్చడానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఐక్యరాజ్య సమితి ఆహార సహాయ విభాగం శ్రీలంకలో ఆహార కొరతను తీర్చేందుకు 60 మిలియన్ డాలర్లను విరాళాలుగా సేకరించేందుకు ముందుకొచ్చింది.

Updated Date - 2022-06-21T00:45:30+05:30 IST