మా మాతృభూమిని కాపాడండి: మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత విజ్ణప్తి

ABN , First Publish Date - 2022-04-04T17:57:22+05:30 IST

సామాజిక సేవ, రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అన్నింటికీ సిద్ధపడి వచ్చాను. ఎలాంటి పరిస్థితిలోనైనా శ్రీలంక కోసం, ఇక్కడి ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు. కాగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిన శ్రీలంకలో ప్రజా నిరసనలు వెల్లువెత్తడంతో..

మా మాతృభూమిని కాపాడండి: మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత విజ్ణప్తి

కొలంబో: తమ మాతృభూమిని కాపాడమని, వీలైనంత ఎక్కువ సహాయాన్ని అందించండని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస విజ్ణప్తి చేశారు. సోమవారం భారత్‌కు చెందిన ఒక జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దయచేసి శ్రీలంకకు వీలైనంత ఎక్కువ సహాయాన్ని అందించండి. తోడ్పాటును మరింత పొడగించండి. ఇది మా మాతృభూమి. మా మాతృభూమిని మేము కాపాడుకోవాలి. అందుకు మీ సహకారం చాలా కావాలి’’ అని ప్రేమదాస అన్నారు.


ఇక శ్రీలంకలో ఎన్నికల గురించి మాట్లాడుతూ ‘‘సామాజిక సేవ, రాజకీయాల్లోకి వచ్చినప్పుడే అన్నింటికీ సిద్ధపడి వచ్చాను. ఎలాంటి పరిస్థితిలోనైనా శ్రీలంక కోసం, ఇక్కడి ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు. కాగా, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిన శ్రీలంకలో ప్రజా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని మహీంద్ర రాజపక్స ఆదివారం రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబోయ రాజపక్సకు పంపారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో తాజాగా నిరసనలు పతాకస్థాయికి చేరాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం కావడంతో దేశంలో ఇప్పటికే సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించారు. తాజా సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, కోవిడ్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్స ప్రభుత్వం చెబుతూ వస్తోంది. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్ పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది. 2.5 బిలియన్ డాలర్ల సాయంతో పాటు లక్షల టన్నుల ఇంధనాన్ని పంపింది. బియ్యం కూడా పంపింది.

Updated Date - 2022-04-04T17:57:22+05:30 IST