కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌

ABN , First Publish Date - 2021-01-02T06:10:36+05:30 IST

శ్రీనగర్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై స్థానికులనుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనగర్‌ శివారులో మంగళవారం సాయంత్రం భద్రతాదళాలు సోదాలు నిర్వహిస్తుండగా, ముగ్గురు యువకులు....

కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్‌లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై స్థానికులనుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనగర్‌ శివారులో మంగళవారం సాయంత్రం భద్రతాదళాలు సోదాలు నిర్వహిస్తుండగా, ముగ్గురు యువకులు వారిపై కాల్పులకు తెగబడటంతో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందని సైనికాధికారులు చెబుతున్నారు. అయితే, వీరు ఉగ్రవాదులు కాదనీ, అమాయక యువకులని స్థానికుల వాదన. మరణించిన ముగ్గురూ 22ఏళ్ళ లోపువారే. వారిలో ఇంటర్‌ చదువుతున్న పదిహేడేళ్ళ కుర్రవాడు కూడా ఉన్నాడు. తమ పిల్లలపై ఉగ్రవాద ముద్రవేసి సైనికాధికారులు అన్యాయంగా చంపేశారని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారు ఉగ్రవాదులేననీ, అందుకు ఆధారాలున్నాయనీ సైన్యం అంటున్నది. 


మొత్తం శ్రీనగర్‌, లోయలోని చాలా ప్రాంతాలు ఈ ఘటనకు నిరనసగా మూతబడ్డాయి. జరిగిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించమంటూ పీడీపీ నాయకురాలు మెహబూబాముఫ్తీ గవర్నర్‌కు లేఖ రాశారు. కశ్మీర్‌లోని ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణకు పట్టుబడుతున్నాయి. ఈ ముగ్గురూ విద్యార్థులేనన్న వాదనను సైనికాధికారులు అంగీకరించడం లేదు. పోలీసుల ద్వారా తమకు చేరిన సమాచారం వీరిని ఉగ్రవాదులుగా నిర్థారిస్తున్నట్టు సైన్యం చెబుతుంటే, తమ వద్ద ఉన్న ఉగ్రవాదుల జాబితాలో వీరి పేర్లు లేవని పోలీసులు మరోపక్క అంటున్నారు. ఈ ముగ్గురూ లష్కరే తోయిబా ఉగ్రవాదులకు యుద్ధతంత్రాల్లోనూ, వ్యూహరచనలోనూ క్రియాశీలకంగా సహకరిస్తున్నారనీ, శ్రీనగర్‌–బారాముల్లా రహదారిమీద ఒక భయంకర దాడికి కుట్రచేస్తున్నారనీ భద్రతాదళాల ఆరోపణ. చదువుకుంటున్న ఈ పిల్లలు ఏవో దరఖాస్తులు ఇవ్వడానికి పోయారని అంటున్నప్పుడు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశంలో ఎందుకున్నారనీ, రాత్రంతా ఎదురుకాల్పులు జరపగలిగిన వీరు నిజంగా అమాయకులేనా? అనీ సైనికాధికారులు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం నుంచి మర్నాడు ఉదయం వరకూ కాల్పులు కొనసాగినప్పుడు, ఇలా చేతచిక్కిన యువకులకు లొంగిపోయే అవకాశం ఇవ్వడం, తల్లిదండ్రులను సంఘటనాస్థలానికి రప్పించి విజ్ఞప్తులు చేయించడం ఒక విధానంగా అమలు చేస్తున్న సైన్యం ఇక్కడ ఎందుకు చేయలేదని కుటుంబీకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. 


సైన్యం చెబుతున్న ప్రకారం ఈ యువకులు మహా అయితే ఉగ్రవాదులకు సహాయకులూ, సానుభూతిపరులూ కావచ్చు. టెర్రరిస్టులకు సహకరిస్తున్నారని అనుమానం ఉన్నవారిని పోలీసులు ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లుగా వర్గీకరించడం ఉన్నదే. చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల విద్యేతర కార్యకలాపాలపై అవగాహన ఉండదు కనుక ఇటువంటి సందర్భాల్లో వారిని సంఘటనస్థలానికి రప్పించి ఆచరణలో ఉన్న లొంగుబాటు విధానాన్ని కచ్చితంగా అమలు చేయడం ఉత్తమం. షోపియాన్‌లో జులైలో జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్‌ ఎంత అమానుషమైనదో నాలుగురోజుల క్రితం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటు దేశ ప్రజలకు తెలియచెప్పింది. పదోన్నతులు, భారీ నగదు బహుమతులకు ఆశపడి ఒక సైనికాధికారి ముగ్గురు అమాయకులను కాల్చిచంపి వారిని పాకిస్థానీ ఉగ్రవాదులుగా చిత్రీకరించాడు. 20లక్షల రూపాయల నగదు బహుమతి కోసం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ఇంటినుంచి ఎత్తుకెళ్ళి మరోచోట కాల్చివేసి, మృతదేహాల చుట్టూ మారణాయుధాలనూ ఇతరత్రా సామగ్రినీ పేర్చాడు. పోలీసులనూ, సీఆర్‌పీఎఫ్‌నూ పరుగున రప్పించాడు. పాతికేళ్ళలోపున్న ముగ్గురు పాకిస్థానీలను కెప్టెన్‌ భూపేందర్‌సింగ్‌ ఇలా మట్టుబెట్టినందుకు దేశమంతా సంతోషించింది. కానీ, స్థానికంగా ఉండే ఇద్దరు చిల్లర నేరగాళ్ళను బెదిరించి, వారి సాయంతో ఈ ముగ్గురు అమాయకులనూ గుర్తించి, మరోచోటకు తరలించి సదరు అధికారి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని సిట్‌ దర్యాప్తులో తేలింది.


కశ్మీర్‌లోయలో సైన్యం ఎంతటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నదో తెలిసిందే. కానీ, తమకున్న విశేషాధికారాలను కొందరు సైనికాధికారులు దుర్వినియోగం చేస్తున్నమాట నిజం. షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌ విషయంలో ఆర్మీ ఎంతో సహకరించింది. బుధవారం నాటి ఎన్‌కౌంటర్‌ మీద కూడా పలు విమర్శలు, అనుమానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో దానిపై సమగ్ర దర్యాప్తు సాగడం, సైన్యం సహకరించి తన జవాబుదారీతనాన్ని నిరూపించుకోవడం అవసరం.

Updated Date - 2021-01-02T06:10:36+05:30 IST