రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఏపీ: శ్రీనివాసరెడ్డి

ABN , First Publish Date - 2021-10-29T18:24:36+05:30 IST

రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉందని శ్రీనివాసరెడ్డి అన్నారు.

రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఏపీ: శ్రీనివాసరెడ్డి

అమరావతి: రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానం, కౌలురైతు ఆత్మహత్యల్లో మూడోస్థానంలో ఉందని.. దీనికి జగన్ ప్రభుత్వ చేతగాని తనంకాదా? అని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ నేర పరిశోధన సంస్థ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2019లో 1029 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, 2020లో 889 మంది చనిపోయారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనడం, సకాలంలో సొమ్ము చెల్లించడమనేది జగన్ ప్రభుత్వంలో జరగడంలేదని విమర్శించారు. ఆరు నెలలక్రితం మొక్కజొన్న, జొన్నలు అమ్మిన రైతులకు ఈ ప్రభుత్వం ఇంకా బకాయిలు చెల్లించలేదన్నారు. ప్రభుత్వ నిర్వాకంతో అప్పులు తీర్చలేక,  అవమానాలు భరించలేక,  అన్నదాతలు తలొంచుకొని బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి సకాలంలో డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం.. చివరకు పంట ఉత్పత్తులు కొనకుండా కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటోందని విమర్శించారు.


గోదావరి జిల్లాల్లో పచ్చి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఇంతవరకు ముందుకురాలేదని శ్రీనివాసరెడ్డి అన్నారు. మోసం, దగా చేస్తున్న ప్రభుత్వం.. రైతులను మరణాలకు పాల్పడేలా పురిగొల్పుతోందని ఆరోపించారు. బ్లూ మీడియాను, పోలీసులను అడ్డుపెట్టుకుని ఇప్పటికైతే ప్రభుత్వం తప్పించుకోవచ్చు గానీ, భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. రైతులు వ్యవసాయం వదిలేస్తే, సమాజం అన్నమో రామచంద్రా అని అలమటిస్తుందన్నారు. గనుల దోపిడీ, భూముల అమ్మకం, సారాయి, మాంసం అమ్మకాలు చేయకుండా,  ప్రభుత్వం వ్యవసాయ రంగాన్నిఎలా బతికించాలో ఆలోచిస్తే మంచిదని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం మాదిరి విత్తనం నుంచి విక్రయం వరకు రైతాంగానికి అండగా ఉండాలని కోరుతున్నామని శ్రీనివాసరెడ్డి అన్నారు. 

Updated Date - 2021-10-29T18:24:36+05:30 IST