ఫలించిన సాధన

ABN , First Publish Date - 2022-04-15T05:30:00+05:30 IST

సుప్రసిద్ధ జెన్‌ గురువుల్లో గిజాన్‌ ఒకరు. జ్ఞానార్జన కోసం, సత్య దర్శనం కోసం, సమాధి స్థితి సాధించడం కోసం తపిస్తున్న కోషు అనే యువకుడు ఆయనను కలిశాడు.

ఫలించిన సాధన

సుప్రసిద్ధ జెన్‌ గురువుల్లో గిజాన్‌ ఒకరు. జ్ఞానార్జన కోసం, సత్య దర్శనం కోసం, సమాధి స్థితి సాధించడం కోసం తపిస్తున్న కోషు అనే యువకుడు ఆయనను కలిశాడు. తన కోరికను వెల్లడించాడు. శిష్యుడిగా తనను అంగీకరించి, తాను చేయవలసిన పని ఏమిటో చెబితే... అది ఎంత కష్టతరమైనా చెయ్యడానికి సిద్ధమేనని చెప్పాడు. 


అతని జిజ్ఞాసను గమనించి, తన శిష్యుడిగా గిజాన్‌ చేర్చుకున్నాడు. అతనికి బోధ చేయడంతో పాటు, సాధనా పద్ధతులను సూచించాడు. గురువు ఏది చెప్పినా అత్యంత శ్రద్ధతో కోషు సాధన చేశాడు. రాత్రింబవళ్ళు కఠోరంగా శ్రమించాడు. ఇలా మూడు సంవత్సరాలు గడచిపోయాయి. కానీ తను కోరుకున్న సమాధి స్థితిని కోషు పొందలేకపోయాడు. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా సాధనను కొనసాగించాడు. 


గిజాన్‌ అప్పుడప్పుడు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి.. శిష్యులకు సూచనలు ఇస్తూ ఉండేవాడు. ఒకసారి తన మందిర ప్రాంగణంలోనే వారం రోజులు కొనసాగే సమావేశాలను మొదలుపెట్టాడు. 

తన ధ్యేయాన్ని సాధించడానికి అదే సరైన సమయమని కోషు భావించాడు. మందిర ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న గోపురం ఎక్కి కూర్చున్నాడు. అక్కడ ఉన్న మహనీయుల విగ్రహాలను చూస్తూ ‘‘నేను నా కలను నెరవేర్చుకోవడమో, లేదా విగత జీవుడిగా ఈ గోపురం అడుగు భాగాన పడి ఉండడమో జరుగుతుంది’’ అని ప్రమాణం చేశాడు. కళ్ళు మూసుకొని కుర్చున్నాడు. ఏడు రోజులు నిద్రాహారాలు మానేశాడు. అప్పుడప్పుడు అంతర్ముఖంగా... లోలోతులకు వెళ్ళి వచ్చాడు. కానీ సమాధి స్థితికి చేరాలన్న అతని కల నెరవేరలేదు. 


‘ఇంత కఠోరంగా దీక్ష చేస్తున్నా నాకు ఆ స్థితి ఎందుకు అందడం లేదు? నేను ఏ తప్పు చేశాను? ఎందుకు నాకీ దురవస్థ? అని కోషు ఆవేదన చెందాడు. చివరకు ఓటమిని అంగీకరించాడు. ఇక జీవించి లాభం లేదనుకున్నాడు. గిజాన్‌ పర్యవేక్షణలోనే తను అనుకున్నది సాధించలేనప్పుడు... ఇక మరణం తప్ప మార్గం లేదని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరచి... ముందున్న పిట్టగోడ వైపు నడిచాడు. ఆ ఎత్తు నుంచి కిందికి దూకి మరణించాలనుకున్నాడు. 


ఆ ఆలోచన రాగానే అతని మనసు ప్రశాంతమయింది. పిట్టగోడ పైకి ఎక్కబోయాడు. అంతే... అద్భుతం! అనూహ్యంగా అతని కోరిక నిజమయింది. అతను కోరుకున్న సమాధి స్థితి కలిగింది. కొంతసేపు అలాగే నిలబడిపోయాడు. తరువాత... హృదయమంతా ఆనందంతో ఉప్పొంగుతూ ఉండగా... గబగబా గోపురాన్ని దిగాడు. సరాసరి గురువు గదికి పరుగులు తీశాడు.


కోషు ముఖాన్ని చూసి, అతను ఏదీ చెప్పకముందే ‘శభాష్‌ కోషూ! చివరకు సాధించావు’ అన్నాడు గిజాన్‌. కఠోరమైన సాధన చేస్తున్న సమయంలో ‘నేను చేస్తున్నాను’ అనే భావన, సమాధి స్థితిని చేరాలనే కోరిక కోషులో దృఢంగా ఉండేవి. ఎప్పుడైతే అతను వాటిని సంపూర్ణంగా వదులుకొని, ప్రాణాలను విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడో... అడ్డంకులన్నీ తొలగిపోయాయి. స్వచ్ఛమైన సమాధి స్థితి అతనికి ఆకస్మికంగా కలిగింది. ఇది వింతేమీ కాదు. శ్రీ రామకృష్ణ పరమహంస దైవ సాక్షాత్కారం కోసం తపించి, ఎన్నో కఠోర సాధనలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు కాళికాదేవి విగ్రహం చేతిలోని ఖడ్గాన్ని తీసుకొని, తనను తాను అంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడే ఆయనకు దివ్య దర్శనం (నిర్వికార సమాధి) కలిగినట్టు ఆయన జీవిత చరిత్ర తెలియజేస్తోంది.


రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2022-04-15T05:30:00+05:30 IST