శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం

ABN , First Publish Date - 2021-04-22T10:23:25+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో బుదవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం

  • కొవిడ్‌ ప్రభావంతో తగ్గిన రద్దీ

తిరుమల, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో బుదవారం శ్రీరామనవమి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుడి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నాలుగు మాడవీధుల్లో హనుమంత వాహనసేవ వైభవంగా జరిగింది. అనంతరం 10 నుంచి 11 గంటల వరకు బంగారు వాకిలిలో శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు.


కొండపై తగ్గిన భక్తులు 

దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఇటీవల కొవిడ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నందున శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను టీటీడీ తగ్గించింది. వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సర్వదర్శన టోకెన్ల జారీని రద్దు చేయడంతో భక్తుల సంఖ్య 25 వేలకు తగ్గిపోయింది.


ఏకాంతంగానే రామతీర్థంలో కల్యాణోత్సవం

నెల్లిమర్ల, ఏప్రిల్‌ 21: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రామస్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏకాంతంగానే సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక శాస్ర్తోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్ర్తాలను ఎంఎల్‌ఏ అప్పలనాయుడు, సింహాచలం దేవస్థానం నుంచి వచ్చిన పట్టు వస్ర్తాలను, ముత్యాలను దేవదాయశాఖ ఆర్‌జేసీ, విజయవాడ కనకదుర్గ ఆలయ ఈవో డి.భ్రమరాంబ అర్చకులకు అందజేశారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పట్టువస్ర్తాలను సమర్పించారు. 

Updated Date - 2021-04-22T10:23:25+05:30 IST