గోదా‘వర్రీ’ బోర్డు

ABN , First Publish Date - 2021-07-27T06:26:31+05:30 IST

జిల్లాలోని ప్రధాన జలాశయమైన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు ప్రాజెక్టు ఇంజనీర్లు ఆయకట్టు అవసరానికి అనుగుణంగా నీటిని విడుదల చేస్తున్నారు. ఎప్పడైనా సాగుకు నీరు విడుదల చేయాలని రైతులు కోరినా.. కాలువల నుంచి నీటి విడుదలతోపాటు ఎత్తిపోతలు ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం అనుమతినిచ్చేది. ఎత్తిపోతల పథకాలు 10నెలల పాటు నడవడంతో రైతులకు పుష్కలంగా సాగునీరందేది. ఎండాకాలం సైతం చెరువుల్లో నీరుండేది. కానీ.. మరో మూడు నెలల తర్వాత ఇలాంటి పరిస్థితి ఉంటుందా? అనే అనుమానాలు ఆయకట్టు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

గోదా‘వర్రీ’ బోర్డు

జీఆర్‌ఎంబీ పరిధిలోకి శ్రీరాంసాగర్‌
గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం
ప్రాజెక్టుపై పెత్తనమంతా ఢిల్లీదే!
నీటి విడుదల బోర్డు చేతిలోనే..
ఆయకట్టు రైతుల్లో ఆందోళన

ఆర్మూర్‌, జూలై 26: కేంద్ర ప్రభుత్వం గోదావరి నది మీద ఉన్న 71 ప్రాజెక్టులను గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకవస్తూ గెజిట్‌ నో టిఫికేషన్‌ జారీ చేసింది. అందులో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కూడా ఉంది. దీంతో ఇక నుంచి ప్రాజెక్టు పర్యవేక్షణ, నిర్వహణ అధికారం ఆ బోర్డుకే ఉంటుంది. ఏ పనికైనా బోర్డు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. ఇది ఆయకట్టు రైతులకు అశనిపాతంలా మారనుంది. వాస్తవానికి శ్రీరాంసాగర్‌ నీటి పంపకం విషయంలో ఎలాంటి వివాదం లేదు. కృష్ణానది జలాల విషయం లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదం తీవ్రస్థాయిలో నడుస్తోంది. ఈ వివాదంలో కేంద్రం జోక్యం చేసుకుని కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోకి కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను తీసుకవ స్తూ.. గోదావరినది యాజమాన్య బోర్డును కూడా తెరమీదకు తెచ్చింది. గోదావరి నది మీద ఏ ప్రాజెక్టులో కూడా జలవివాదం లేకున్నప్పటికీ శ్రీరాంసాగర్‌ నుంచి పోలవరందాక 71 ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది. గోదావరి నది మీద జలాల పంపకం విషయంలో వివాదం లేనందున దేవాదుల నుంచి పోలవరం, ధవళేశ్వరం వరకు ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించవచ్చని భావించగా, కేంద్రం అనూహ్యంగా శ్రీరాంసాగర్‌ నుంచి అప్పగించడం విస్మయపరుస్తోంది. గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డుకు అప్పగించింది. వివాదం ఉన్న చోట పరిష్కారమార్గం చూపాల్సిన కేంద్రం వివాదం లేనిచోట తమను ఇబ్బందులకు గురిచేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఆయకట్టు రైతుల నిరసన
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకరావడం పట్ల రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తమకు అవసరమున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేసేదని, ఇక నుంచి ఢిల్లీ నుంచి అనుమతి తీసుకోవడం ఇబ్బందవుతుందంటున్నారు. నిబం ధనల పేరిట నీటి విడుదలకు బోర్డు అధికారులు ఇ బ్బందిపెట్టే అవకాశముందంటున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు మొదటి దశ ఆయకట్టు 9.68లక్షల ఎకరాలు. రెండో దశ ఆయకట్టు సుమారు 4లక్షల ఎకరాల వరకు ఉంది. గత రెండేళ్లుగా రెండో దశ ఆయకట్టుకు కూడా రెండో పంటకు నీరందించారు. కాకతీయ కాలువ కింద నిజామాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలు, సరస్వతీ కాలువ కింద నిర్మల్‌, లక్ష్మీకాలువ కింద నిజామాబాద్‌ జిల్లాల ఆయకట్టు ఉంది. కాలువలే కాకుండా శ్రీరాంసాగర్‌ జలాల ఆధారంతో అనేక ఎత్తిపోతలు నిర్మించారు. వీటికింద 36వేలు, చిన్న, చిన్న ఎత్తిపోతల కింద సుమారు 80వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
కొత్త వాటికీ ఇబ్బందులే..
శ్రీరాంసాగర్‌ జలాల ఆధారంగా కొత్తగా చేపట్టే సాగునీటి పథకాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 21, 22 కింద ఉమ్మడి జిల్లాకు సాగు నీరందించడానికి పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సంస్థ నుంచి రుణం తీసుకుని పనులు పూర్తిచేస్తుంది. అదే బోర్డు పరిధిలోకి వెళితే పనులకు రుణం లభించడం కూడా కష్టమే అవుతుంది.
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులను నదీ బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరే కిస్తోంది. అంతేకాకుండా గెజిట్‌ నోటిఫికేషన్‌ను అంగీకరించేదిలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీల సమావేశంలో స్పష్టం చేశారు. వివిధ అంశాలతో పాటు దీనిని కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు. ఆయకట్టు పరిధిలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా రు. అందులో ఒకరు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఆయకట్టు రైతుల ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌(కరీంనగర్‌), ధర్మపురి అర్వింద్‌ (నిజామాబాద్‌), సోయం బాబురావు (ఆదిలాబాద్‌) శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును బోర్డు పరిధి నుంచి తప్పించడానికి కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.
పార్లమెంట్‌లో పోరాడుతాం..
- కేఆర్‌.సురేష్‌రెడ్డి, ఎంపీ, రాజ్యసభ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకంలో కేంద్రం తీసుకొచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విషయంపై పార్లమెంట్‌లో పోరాడుతాం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతాం. శ్రీరాంసాగర్‌పై స్పష్టత రావలసి ఉంది. జిల్లాలోని అన్ని ఎత్తిపోతల పథకాలు నడిచేలా చూస్తాం.

Updated Date - 2021-07-27T06:26:31+05:30 IST