శ్రీశైలం, సాగర్‌.. ఫుల్‌

ABN , First Publish Date - 2022-08-11T08:46:23+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో ఈ రెండు బేసిన్‌లలోని అన్ని ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో నమోదవుతోంది

శ్రీశైలం, సాగర్‌.. ఫుల్‌

3.60 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో

శ్రీశైలంలో పది గేట్ల ద్వారా నీటి విడుదల

నేడు తెరుచుకోనున్న సాగర్‌ క్రస్ట్‌ గేట్లు

జూరాల 38, తుంగభద్ర 33 గేట్ల ఎత్తివేత

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు భారీ వరద

13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం

‘పోలవరం’ గ్రామాల్ని చుట్టుముట్టిన గోదావరి

పెట్టేబేడా సర్దుకుని మళ్లీ సురక్షిత ప్రాంతాలకు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

గువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో ఈ రెండు బేసిన్‌లలోని అన్ని ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో నమోదవుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు వరద ఉధృతితో నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు బుధవారం రాత్రి 9 గంటల తర్వాత 3.77 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, 10 గేట్లను ఎత్తడం ద్వారా, ఇరువైపులా జల విద్యుదుత్పత్తితో 3.39 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.40 అడుగులకు చేరుకుంది. ఇక నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు 3.61 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు (590 అడుగులు) కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 293.4 టీఎంసీల (583.50 అడుగులు) నీటి నిల్వలున్నాయి. దాంతో  గురువారం ఉదయం 6:30 గంటల సమయంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు.


కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 1.75 లక్షల క్యూసెక్కులను దిగువకు  వదిలిపెడుతున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 1.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 1.75 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి 1.74 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 33 గేట్లు, జూరాలకు 2.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాకతో 38 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఇక గోదావరి మళ్లీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద 50.9 అడుగుల ఎత్తుతో గోదావరి ప్రవాహం ఉంది. ప్రస్తుతం భద్రాచలం, ఏటూరునాగారం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ వద్ద 8.63 లక్షలు, తుపాకులగూడెం(సమ్మక్క) బ్యారేజీకి 12.85 లక్షలు, దుమ్ముగూడెం (సీతమ్మ) బ్యారేజీకి 12.39 లక్షలు, అన్నారం(సరస్వతి) బ్యారేజీకి 1.01 లక్షలు, సుందిళ్ల(పార్వతి) బ్యారేజీకి 78 వేల క్యూసెక్కుల వరద రాగా... అంతే స్థాయిలో దిగువకు వదిలిపెడుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 85 వేల క్యూసెక్కులు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.  వరదలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడంతో ఆయా ప్రాజెక్టుల వద్ద ఉన్న జలవిద్యుత్‌ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 43.8 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే... శ్రీశైలంలో అత్యధికంగా 17.15 మిలియన్‌ యూనిట్లు, సాగర్‌లో 14.45 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది. 


మూడు రోజులు మోస్తరు వర్షాలు

నెల 13 నాటికి  వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి, తదుపరి 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గురువారం రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 


పోలవరం ముంపు గ్రామాలను చుట్టుముట్టిన వరద

ఏపీ పరిధిలోని పోలవరం ముంపు గ్రామాలను వరద చుట్టుముట్టింది. ఏలూరు జిల్లా కుక్కునూరు-దాచారం మధ్య ఇప్పటికే రాకపోకలు నిలిచిపోగా సీతారామనగరం, ముత్యాలమ్మపాడు వెళ్లే రహదారులు కూడా నీట మునిగాయి. వేలేరుపాడు మండలంలో దాదాపు 40 గ్రామాలను వరద చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, వరదల నేపథ్యంలో అత్యవసర సహాయం, సమాచారం కోసం 24గంటలు అందుబాటులో ఉండే స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 

Updated Date - 2022-08-11T08:46:23+05:30 IST