తిరుచానూరులో ‘శ్రీయాగం’ ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-22T07:01:53+05:30 IST

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో శుక్రవారం నవకుండాత్మక శ్రీయాగం ప్రారంభమైంది.

తిరుచానూరులో ‘శ్రీయాగం’ ప్రారంభం
యాగం నిర్వహిస్తున్న అర్చకులు

తిరుచానూరు, జనవరి 21: ప్రపంచశాంతి, సౌభాగ్యం కోసం శ్రీపద్మావతీదేవిని ప్రార్థిస్తూ తిరుచానూరు అమ్మవారి ఆలయంలో శుక్రవారం నవకుండాత్మక శ్రీయాగం ప్రారంభమైంది. ఏడ్రోజులపాటు జరగనున్న ఈ యాగాన్ని కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణముఖమండపంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9.30గంటలకు సంకల్పంతో యాగం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు యాగశాలలో సంకల్పం, హోమాలు, చతుష్టానార్చన, అగ్రిప్రతిష్ఠ, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహించారు. సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహామంగళహారతి చేపట్టి అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేశారు. కాగా.. 50 ఏళ్ల తర్వాత లోక కల్యాణార్థం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వీరు అమ్మవారికి 34గ్రాముల బంగారుహారాన్ని కానుకగా సమర్పించారు. అనంతరం చైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల కిందట క్రితం చిన్నజియ్యర్‌స్వామి ఈ యాగం చేశారని చెప్పారు. దేశం, రాష్ట్రం క్షేమంగా ఉండాలని, గోసంతతి అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈనెల 27వ తేదీవరకు యాగం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, సూపరింటిండెంట్లు మధు, శేషగిరి, అర్చకులు బాబుస్వామి, వీఐ మహేష్‌, సురే్‌షరెడ్డి, జయకుమార్‌, రాజే్‌షఖన్నా పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T07:01:53+05:30 IST