పదిలో ఉత్తీర్ణత ఎందుకు తగ్గింది

ABN , First Publish Date - 2022-07-06T05:35:44+05:30 IST

భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ చర్యలు చేపడుతున్నారు.

పదిలో ఉత్తీర్ణత ఎందుకు తగ్గింది
పీఎంఆర్‌సీ భవనం

తక్కువ ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల హెచ్‌ఎంలకు షోకాజ్‌ నోటీసు 

31 మంది ఉపాధ్యాయులకు చార్జెస్‌ ప్రేమ్‌ చేయాలని ఐటీడీఏ పీవో ఆదేశం

పీఎంఆర్‌సీ బలోపేతానికి కసరత్తు

భద్రాచలం, జూలై 5: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ప్రకటించిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో కనిష్ఠ ఫలితాలు సధించిన పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్లపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాదేవిని పీవో గౌతమ్‌ ఆదేశించారు. దీంతో ఆశ్రమ పాఠశాలల్లో 12 మంది ప్రధానోపాధాద్యయులకు షోకాజ్‌ నోటీసులు, 31 మంది సబ్జెక్టు టీచర్లకు చార్జెస్‌ ప్రేమ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 31 మంది ఉపాధ్యాయుల్లో 23 మంది రెగ్యులరు, ఎనిమిది మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటి కే ఐటీడీఏ పరిధిలో కనిష్ఠ ఫలితాలు సాధించిన ప్రిన్సిపాళ్లకు షోకాజ్‌ నోటీసులను జారీ చేయాలని గురుకులం సెల్‌ ఇన్‌చార్జ్‌ డేవిడ్‌రాజును పీవో ఆదేశించారు.

నాణ్యమైన విద్యే లక్ష్యంగా

ఐటీడీఏ పరిధిలో 50 ఆశ్రమపాఠశాలలుండగా 17 వేల మంది విద్యార్ధులు చదువుతున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశా లలుండగా అందులో ఆరు వేల మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి నాణ్యమైన విద్య అందించాలని ఫలితాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రిన్సిపాళ్లు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపా ధ్యాయులు కృషి చేయాలని  పీవో స్పష్టం చేశారు. ఫలితాల అనంతరం ఇటీవల వాటిపై సంబంధిత కీలక అధికారులతో అంతర్గత సమీక్షను సైతం నిర్వహించారు.

పీఎంఆర్‌సీ బలోపేతానికి చర్యలు

భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని విద్య వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రాజెక్టు మానిటరింగ్‌ అండ్‌ రిసోర్సు సెల్‌ (పీఎంఆర్‌సీ) బలోపేతానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడ్ని పీఎంఆర్‌సీలోకి తీసుకోవా లని నిర్ణయించారు. ఇప్పటికే ఆంగ్లం బోధించేందుకు ఒక ఉపాధ్యాయుడు ఉండగా మిగిలిన ఆరు సబ్జెక్టులకు ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేసేందుకు అంతర్గత నోటిఫికేషన్‌ను సైతం జారీ చేశారు. భద్రాచలం పీఎంఆర్‌సీ రాష్ట్రస్థాయిలో పేరుండటంతో దానిని మరంతగా పెంపొందించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. 

ఆరంభంలోనే విద్యార్ధులకు కీలక పుస్తకాల అందజేత

రెండేళ్లుగా కరోనా విపత్కర పరిస్థితులతో విద్యార్ధుల్లో కనీస సామర్థ్యం కొరవడిందని ఐటీడీఏ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్ధులకు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్‌లతో కూడిన సాధన పుస్తకాన్ని అంద జేశారు. ఆల్‌ ఇన్‌ వన్‌ ఇంగ్లీష్‌ను ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు, కాపీ రైటింగ్‌ పుస్తకాలు తెలుగులో 1,2,3 తరగతుల వరకు, ఆంగ్లంలో ఒకటి నుంచి రెండో లెవల్‌ వరకు అందజేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పదో తరగతి చదువుతున్న గిరి విద్యార్థుల కోసం ఎస్‌సీఆర్‌టీ రూపొందించిన సబ్జెక్టు స్టడీ మెటీరియల్‌ను సైతం అందజేశారు. ఇందులో ఫిజికల్‌ సైన్సు, బయో సైన్సు, మ్యాత్స్‌, సోషల్‌, ఆంగ్లం, తెలుగు మాధ్యమాలు ఉన్నాయి. 

ఫలితాలే ప్రాతిపదిక కాదు

రమాదేవి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు

గిరిజన విద్యా సంస్థల్లో కేవలం ఫలితాలే ప్రాతిపదికగా ఇకపై బోదన సాగదు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారిని అన్ని విధాల పూర్తిస్థాయి సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నాం. ఇందు కోసం ఇప్పటికే ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్‌ దశదిశ నిర్దేశం చేశారు. రాబోయే కాలంలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని విద్యా సంస్థలు అన్ని విద్యా సంస్థలకు మార్గదర్శకంగా నిలవాలన్నదే మా లక్ష్యం. 

Updated Date - 2022-07-06T05:35:44+05:30 IST