నింగికెగసిన ఆనందం.. ఆ వెంటనే నిరాశ!

Published: Mon, 08 Aug 2022 00:11:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నింగికెగసిన ఆనందం..  ఆ వెంటనే నిరాశ!నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళుతున్న ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్‌

శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఆగస్టు 7 : ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకుపోతుండగా సందర్శకుల ఉత్సాహం సైతం రాకెట్‌ను వెంబడిస్తూ గగనాన్ని తాకింది. ఆదివారం షార్‌లో ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్‌ ప్రయోగాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో సందర్శకులు విచ్చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే షార్‌కు వెళ్లే మార్గం వాహనాలతో కిటకిటలాడిపోయింది. తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వివిధ వాహనాల్లో విచ్చేశారు. నెలల బిడ్డతో కూడా ఈ ప్రయోగాన్ని చూడ్డానికి తల్లిదండ్రులు రావడం కన్పించింది. ఇలా వేలాది సందర్శకులతో షార్‌ విజిటర్స్‌ గ్యాలరీ నిండిపోయింది. ఆకాశంలో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోతున్న రాకెట్‌ను కేరింతలు కొడుతూ జాతీయ పతాకాలను రెపరెపలాడిస్తూ వీక్షించిన సందర్శకులు సందడి చేశారు.ఇస్రో అధికారులు గ్యాలరీలో భారీ స్ర్కీన్లు సైతం ఏర్పాటు చేసి కనుచూపుమేర దాటిపోయిన రాకెట్‌ గమనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 13నిమిషాల్లో రాకెట్‌ ఉపగ్రహాలను కక్ష్యలో వదిలిపెట్టిందని ప్రసారం కావడంతో సందర్శకులు జయజయధ్వానాలు చేశారు.కొద్ది సేపటికి రాకెట్‌ నింగిలోకి దూసుకుపోయినా లక్ష్యాన్ని చేరలేదన్న విషయం తెలిసినా ఆకాశంలో రాకెట్‌ పయనాన్ని చూసిన సంతృప్తితో తిరుగుముఖంపట్టారు. 


భవిష్యత్తు శాస్త్రవేత్తలు మీరే!

ఆజాదీ శాట్‌ తయారు చేసిన బాలికలతో ఇస్రో చైర్మన్‌ 

శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఆగస్టు 7 : భవిష్యత్‌ శాస్త్రవేత్తలు మీరే... మీ మేధస్సు దేశ సాంకేతిక అభివృద్ధిని రెపరెపలాడించాలంటూ ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ ఆజాదీశాట్‌ తయారుచేసిన విద్యార్థులను ఉత్తేజపరిచారు. దేశవ్యాప్తంగా 8 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 75పాఠశాలలకు చెందిన 750 మంది బాలికలు తయారుచేసిన ఉపగ్రహాన్ని ఎస్‌ఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారా ఆదివారం  ప్రయోగించిన విషయం తెలిసిందే.వీరిలో సుమారు 500మంది బాలికలు శనివారం రాత్రికే షార్‌కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం ప్రయోగానికి గంట ముందు ఇస్రో చైర్మన్‌ షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాల్‌లో వారితో సమావేశమయ్యారు.అంతరిక్ష విజ్ఞానంపై మరింత శ్రద్ధ చూపమని వారికి సూచించారు. అనంతరం విద్యార్థుల  సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.విద్యార్థులంతా రాకెట్‌ ప్రయోగాన్ని షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాల్‌ మేడపై నుంచి కేరింతలు కొడుతూ వీక్షించారు. కాగా ఈ విద్యార్థుల ఉపగ్రహాన్ని ఎస్‌ఎస్‌ఎల్వీ నిర్దేశిత కక్ష్యకు చేరవేయలేకపోవడంతో నిరాశపడ్డారు.ఈ అపజయమే విజయానికి పునాది అవుతుందంటూ  వారిని పలువురు శాస్త్రవేత్తలు ఉత్సాహపరిచారు. 

నింగికెగసిన ఆనందం..  ఆ వెంటనే నిరాశ! భూకేంద్రాలకు సంకేతాలు అందాయా లేదా అని ఫోన్‌ ద్వారా వాకబు చేస్తున్న మిషన్‌ డైరెక్టర్‌


నింగికెగసిన ఆనందం..  ఆ వెంటనే నిరాశ! ఆజాదీశాట్‌ తయారుచేసిన బాలికలతో మాట్లాడుతున్న ఇస్రో చైర్మన్‌


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.