నీటి పారుదల శాఖలో తీవ్రమైన సిబ్బంది కొరత

ABN , First Publish Date - 2021-06-23T07:03:56+05:30 IST

ఇరిగేషన్‌ శాఖలో సిబ్బంది కొరత వలన ఏటా సాగర్‌ కాల్వల నిర్వహణ, నీటి పంపిణీ అస్తవ్యస్తంగా మారింది.

నీటి పారుదల శాఖలో తీవ్రమైన సిబ్బంది కొరత
మేజర్‌కాలువ వెంబడి అధ్వానంగా పెరిగిన చిల్లచెట్లు

దర్శి, జూన్‌ 22 : ఇరిగేషన్‌ శాఖలో సిబ్బంది కొరత వలన ఏటా సాగర్‌ కాల్వల నిర్వహణ, నీటి పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. సరైన పర్యవేక్షణ లేకపోవటంతో మేజర్లు, మైనర్లు అధ్వానంగా మారాయి. అనేక మేజర్లపై పిచ్చిచెట్లు మొలచి కాల్వల రూపురేఖలు మారిపోయాయి. అందువలన సాగునీటి పంపిణీకి ఇబ్బందిగా మారింది. 

దర్శి ఎన్‌ఎస్‌పీ డివిజన్‌ పరిధిలో సుమారు 105 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఖాగా ఉన్న ఆ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదు. డివిజన్‌ పరిధిలో 16 ఏఈఈ పోస్టులకు గాను 12 మంది మాత్రమే ఉన్నారు. నాలుగు ఖాళీగా ఉన్నాయి. 24 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండగా కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 103 మంది లస్కర్‌ పోస్టులు ఉండగా కేవలం 19 మంది మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నారు.  84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికశాతం పోస్టులు ఖాళీగా ఉండటంతో కాలువల పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారింది. దర్శి ఎన్‌ఎస్‌పీ డివిజన్‌ పరిధిలో త్రిపురాంతకం, కురిచేడు, దర్శి మండలాలతో పాటు గుంటూరు జిల్లాలోని కొంతభాగం విస్తరించి ఉంది. మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. పంటల సాగుకు సాగర్‌ జాలాలు విడుదల సమయంలో సిబ్బంది కొరత వలన పర్యవేక్షణ లేక నీరు దుర్వినియోగం అవుతుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు అధికనీరు వాడుకుంటున్నారు. దీనివలన చివరి ఆయకట్టు భూముల రైతులకు నీరు అందక పంటలు సాగుచేసుకోలేకపోతున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉంటే అన్నీ ప్రాంతాలకు వాటా ప్రకారం సాగునీరు పంపిణీ చేసే వీలుకలుగుతుంది. ఈ ఏడాది ఆగస్టులో సాగర్‌ జలాలు విడుదల చేసే అవకాశం ఉన్నందున ఈ లోపు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి అన్నీ ప్రాంతాలకు నీరు సక్రమంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-06-23T07:03:56+05:30 IST