ఏఆర్టీ సెంటర్‌ను వేధిస్తున్న సిబ్బంది కొరత

ABN , First Publish Date - 2021-07-19T06:04:50+05:30 IST

మదనపల్లె జిల్లా వైద్యశాలలోని యాంటీ రిట్రో వైరల్‌ థెరపీ(ఏఆర్టీ) కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు.

ఏఆర్టీ సెంటర్‌ను వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లా వైద్యశాలలోని ఏఆర్టీ కేంద్రం

రోగులకు అందని మెరుగైన సేవలు


మదనపల్లె క్రైం, జూలై 18: మదనపల్లె జిల్లా వైద్యశాలలోని యాంటీ రిట్రో వైరల్‌ థెరపీ(ఏఆర్టీ) కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. జిల్లాలోని పడమటి ప్రాంత మండలాలకు చెందిన హెచ్‌ఐవీ బాధితులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(నాకో) ఆధ్వర్యంలో 2013లో మదనపల్లె ఆస్పత్రిలో ఏఆర్టీ సెంటర్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో సుమారు మూడు వేలమంది బాధితులు నమోదై ఉన్నారు. ఇందులో 2,500 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో నాకో నిబంధనల మేరకు ఏఆర్టీ కేంద్రాల్లో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ఇద్దరు వైద్యాధికారులు, నలుగురు కౌన్సిలర్లు, ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, స్టాఫ్‌నర్స్‌,  ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉండి తీరాలి. అయితే కేంద్రంలో ప్రస్తుతం సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఒక్కరే ఉన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీలక్షికి కొద్దిరోజుల కిందట పెద్దమండ్యం పీహెచ్‌సీ వైద్యాధికారి ఉద్యోగం రావడంతో ఆమె వెళ్లిపోయారు. గతంలో పనిచేసిన మరో వైద్యాధికారి కూడా వేరే ఆస్పత్రికి బదిలీపై వెళ్లిపోయారు. దీంతో   వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కౌన్సిలర్లలో ఒకరు మెడికల్‌ లీవులో ఉన్నారు. గతంలో ఫార్మసిస్టుగా పనిచేస్తుండిన గాయత్రి ఉద్యోగానికి రాజీనామా చేసి ఈహెచ్‌ఎస్‌లో ఫార్మసిస్టుగా చేరారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఒకరు మాత్రమే ఉన్నారు. కాగా, కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. మదనపల్లె కేంద్రానికి సోమల, పుంగనూరు, చౌడేపల్లె, రామసముద్రం, వాల్మీకిపురం, గుర్రంకొండ, పెద్దమండ్యం, ములకలచెరువు, తంబళ్లపల్లె తదితర మండలాల నుంచి బాధితులు వస్తుంటారు. ప్రతిరోజూ ఓపీ సంఖ్య 80 నుంచి 120 వరకు ఉంటుంది. అయితే సిబ్బంది కొరత కారణంగా బాధితులకు వైద్యసేవలు అందడం లేదు. నమోదు చేసుకోవడానికి, చికిత్స పొందేందుకు, మందులు తీసుకునేందుకు, కౌన్సెలింగ్‌, రక్తపరీక్ష తదితర సేవల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ సమస్యను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏఆర్టీ కేంద్రంలో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

Updated Date - 2021-07-19T06:04:50+05:30 IST