విస్తరణ.. ఉద్వాసన!!

ABN , First Publish Date - 2021-07-26T05:28:15+05:30 IST

పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న తాత్కాలిక వైద్య ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. వారిని తొలగించి కొత్తగా నియామకాలు చేపట్టాలని ఉన్నతాధికారులు ప్రకటన జారీ చేయటంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.

విస్తరణ.. ఉద్వాసన!!
ఆందోళన చేస్తున్న వైద్య సిబ్బంది (ఫైల్‌)

పట్టణ ఆరోగ్య కేంద్రాల పెంపు

ప్రస్తుత ఉద్యోగుల తొలగింపు

కొత్తగా నియామకాలకు నిర్ణయం

సందిగ్ధంలో 84 మంది భవిత?

ప్రభుత్వం వింత పోకడ

లబోదిబోమంటున్న వైద్య సిబ్బంది


నెల్లూరు(వైద్యం), జూలై 25 : పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్న తాత్కాలిక వైద్య ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. వారిని తొలగించి కొత్తగా నియామకాలు చేపట్టాలని ఉన్నతాధికారులు ప్రకటన జారీ చేయటంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. పట్టణ ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్న ఉద్దేశంతో 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.  వాటిలో ప్రస్తుతం వైద్యులతోపాటు స్టాఫ్‌నర్సు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, జనరల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌... ఇలా మొత్తం ఏడుగురు పనిచేస్తున్నారు. మొదట్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ  ఆరోగ్య కేంద్రాలు నడిచేవి. ప్రస్తుతం అపోలో సంస్థ నిర్వహణలో సేవలు అందిస్తున్నాయి. సాధారణ ఆరోగ్య సమస్యలకు చికిత్సతోపాటు వ్యాధి నిరోధక టీకాలు వంటివి వేస్తున్నారు. ఇంటింటి వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. కరోనా విపత్తులోనూ వైద్య సేవలు అందించారు.  


వైఎస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్పు

ప్రస్తుతం జిల్లాలో 14 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా మరో 33 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. వీటన్నింటినీ వైఎస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్పు చేసి ప్రస్తుత సిబ్బందిని తొలగించి కొత్తగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రస్తుతం పనిచేస్తున్న 84 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం నెలకొంది. కొత్తగా చేపట్టే నియామకాల్లో మెరిట్‌ ప్రాతిపదికను ఎంపికలు జరపాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇన్నేళ్లు తాము చేసిన సేవలను గుర్తించి ఆరోగ్య కేంద్రాల్లో కొనసాగించాలని ప్రస్తుత ఉద్యోగులు వేడుకుంటున్నారు.


వైద్య సిబ్బందిని తొలగించొద్దు

నేడు కలెక్టరేట్‌ యూఎంఈయూ ఆందోళన

నెల్లూరు(వైద్యం), జూలై 25 : పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న తాత్కాలిక వైద్య సిబ్బందిని విధుల నుంచి తొలగించవద్దని యునైటెడ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(యూఎంఈయూ) గౌరవాధ్యక్షుడు సతీష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరు లతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారన్నారు. కరోనా సమయంలోనూ వారు సేవలు అందించారని, అటువంటి వారిని రెగ్యులర్‌ చేయాల్సి ఉండగా తొలగించాలనుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవా రం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టీవీ ప్రసాద్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T05:28:15+05:30 IST