నిలిచిపోయిన రిజిస్ర్టేషన్లు

ABN , First Publish Date - 2022-05-24T05:47:10+05:30 IST

పేద, మధ్య తరగతి కుటుంబాల వారు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకుని కొన్న ఆస్తిని రిజిస్ర్టేషన్‌ చేయకుండా ప్రభుత్వం ఆపేసింది.

నిలిచిపోయిన రిజిస్ర్టేషన్లు
రాయచోటిలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

అప్రూవల్‌ లేకుండా వెంచర్లు
అలాంటి వాటిని రిజిస్ర్టేషన్‌ చేయొద్దు
జీవో జారీ చేసిన ప్రభుత్వం
అయోమయంలో కొనుగోలుదారులు


కొత్త జిల్లా ఏర్పడటంతో ఎక్కడ చూసినా వెంచర్లు వెలిశాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగింది. స్థానికులే కాకుండా స్థానికేతరులు కూడా రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడికి వచ్చి ప్లాట్లు కొనుగోలు చేశారు. దీంతో లక్షల్లో ఉన్న ధరలు ఒక్కసారిగా కోట్లల్లోకి వెళ్లిపోయాయి. ఒకరి నుంచి ఒకరికి చేతులు మారాయి. తీరా రిజిస్ర్టేషన్‌ సమయానికి వచ్చేసరికి అవి రిజిస్ర్టేషన్లు కావడం లేదు. మున్సిపాలిటీ అప్రూవల్‌ లేకుండా వెంచర్లు వేయడంతో ప్రభుత్వం అలాంటి వాటిని రిజిస్ర్టేషన్లు చేయవద్దని జీవో జారీ చేసింది. దీంతో ప్లాట్లు కొన్నవారు, వెంచర్లు వేసిన వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

రాయచోటి (కలెక్టరేట్‌), మే 23: పేద, మధ్య తరగతి కుటుంబాల వారు కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకుని కొన్న ఆస్తిని రిజిస్ర్టేషన్‌ చేయకుండా ప్రభుత్వం ఆపేసింది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆస్తి కొన్న వారికి రిజిస్ర్టేషన్‌ కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ రిజిస్ర్టేషన్స్‌ ఆపేయాలంటూ జీవోను విడుదల చేసింది. పట్టణ పరిధిలో లేఅవుట్‌ వేసిన వారు లేఅవుట్‌ సంబంధించిన పార్కు, 30 అడుగుల రోడ్లు ఉండేలా చూడాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలా లేకుండా వేసిన ప్లాట్లకు సంబంధించి ప్రస్తుతం రిజిస్ర్టేషన్‌ చేయడం లేదు. లేఅవుట్‌ వేయదలచిన వారు ఎల్‌ఆర్‌ఎస్‌ లేక బీపీఎస్‌ స్కీం ద్వారా కానీ అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ద్వారా ప్లాన్‌ అప్రూవల్‌ చేసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ భూమిని వ్యాపారాలకు మార్చుట కొరకు లైసెన్స్‌ సర్వేయర్‌ దగ్గర మ్యాప్‌ గీయించిన తర్వాత మున్సిపాలిటీలో అప్రూవల్‌ చేసుకుంటేనే రిజిస్ర్టేషన్‌ చేయవచ్చునని ప్రభుత్వం తెలిపింది. మున్సిపాలిటీ , పంచాయతీల్లో అప్రూవల్‌ తీసుకోకుంటే అలాంటి ప్లాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ర్టేషన్‌ చేయకూడదని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాయచోటి, మదనపల్లె, రాజంపేట మున్సిపాలిటీ ప్రాంతాల్లో ప్లాన్‌ అప్రూవల్‌ ఉంటేనే రిజిస్ర్టేషన్స్‌ చేస్తామని అధికారులు తేల్చి చెప్పేస్తున్నారు. 2020 సంవత్సరానికి ముందు వేసిన లేఅవుట్‌లకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని మున్సిపాలిటీ, రిజిస్ర్టేషన్‌ అధికారులు స్పష్టం చేశారు. మున్సిపాలిటీలో ప్లాన్‌ అప్రూవల్‌కు వెళ్లిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు సమయానికి ప్లాన్‌ అప్రూవల్‌ కాక ప్లాట్స్‌ కొన్న వారి దగ్గర నుంచి నానా మాటలు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. చదువు, పెళ్లిళ్లు, ఇతర ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆస్తి అమ్మాలన్నా కొనే నాథుడు కనుచూపు మేర కనిపించలేదని ఆస్తి యజమానులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో గత మూడు నెలలుగా మున్సిపాలిటీ ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్స్‌ జరగడం లేదని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చెప్పుకొస్తున్నారు. కొంతమంది రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది.


ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపివేశాం
- మునిశంకరయ్య, డిస్ర్టిక్‌ రిజిస్ర్టార్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్ర్టేషన్లు ఆపివేశాము. ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌, అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ వారి ద్వారా కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్లాన్‌ అప్రూవల్‌ చేసుకోవచ్చు. డీటీసీపీ విజయవాడ వారి ద్వారా కూడా అప్రూవల్‌ చేసుకోవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వీటిని సద్వినియోగం చేసుకుని అప్రూవల్‌ చేసుకుంటేనే రిజిస్ర్టేషన్లు జరుగుతాయి.

Updated Date - 2022-05-24T05:47:10+05:30 IST