మమత బాటలో స్టాలిన్... ఐఏఎస్ క్యాడర్ రూల్స్‌పై మోదీకి లేఖ...

ABN , First Publish Date - 2022-01-24T00:21:13+05:30 IST

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) క్యాడర్ రూల్స్‌కు కేంద్ర ప్రభుత్వం

మమత బాటలో స్టాలిన్... ఐఏఎస్ క్యాడర్ రూల్స్‌పై మోదీకి లేఖ...

చెన్నై : ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) క్యాడర్ రూల్స్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలోకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా చేరారు. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం ఓ లేఖ రాశారు. ఇదేవిధంగా ఇటీవల పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. 


స్టాలిన్ ఆదివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసినట్లు తెలిపారు. ఐఏఎస్ క్యాడర్ రూల్స్, 1954ను సవరించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలు భారత దేశ సమాఖ్య పునాదులను బలంగా కుదిపేస్తాయని, అందువల్ల వీటిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. 


ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ కూడా ఇటీవల మోదీకి లేఖలు రాశారు. ఈ ప్రతిపాదనలు అత్యంత కిరాతకమైనవని మమత బెనర్జీ మండిపడ్డారు. ఇప్పటికే ఆమె మోదీకి ఈ అంశంపై రెండు లేఖలు రాశారు. మొత్తం మీద ఈ నిబంధనలను సవరించడం వల్ల రాష్ట్ర పరిపాలన చిక్కుల్లో పడుతుందని బీజేపీయేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఐఏఎస్ క్యాడర్ రూల్స్ సవరణ ప్రతిపాదనలు :

ముఖ్యంగా నాలుగు సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అవి ఏమిటంటే...

1. స్టేట్ క్యాడర్ ఆఫీసర్‌ను కేంద్రానికి నిర్దేశిత సమయంలోగా పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసినట్లయితే, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి క్యాడర్ నుంచి ఆ అధికారి రిలీవ్ అవుతారు. 


2. కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటేషన్‌పై వాస్తవంగా ఎంత మంది అధికారులను పంపించాలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, అటువంటి అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. 


3. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదరకపోతే, తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట గడువులోగా అమలు చేయాలి. 


4. నిర్దిష్ట పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి క్యాడర్ ఆఫీసర్ల సేవలు అవసరమైనపుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిర్దిష్ట గడువులోగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. 


Updated Date - 2022-01-24T00:21:13+05:30 IST