చెత్తలో పడి ఉన్న స్టాంప్ పేపర్లు
పటమట సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయ ఆవరణలోనే
స్టాంప్ వెండార్ శ్రీనివాసరావుకు చెందినవిగా గుర్తింపు
చలానా స్కామ్సమయంలో అధికారులు స్వాధీనం
ఇప్పుడు చెత్తలో దర్శనమివ్వడంపై వెండార్ ఆగ్రహం
రిజిస్ర్టేషన్ అధికారులపై ఆరోపణలు
బీరువాల్లో భద్రంగా ఉండాల్సిన రిజిస్ర్టేషన్ స్టాంప్ పేపర్లు చెత్తలో పడి ఉన్నాయి. ఆ స్టాంప్ పేపర్లు తన నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నవేనని స్టాంప్ వెండార్ ఎస్.శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న స్టాంప్ పేపర్లు, రిజిస్టర్లు తమ బీరువాల్లో భద్రంగా ఉన్నాయని, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తమకు తెలియదంటున్నారు రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు. స్టాంప్ పేపర్లతో పాటు, సేల్ రిజిస్టర్ కూడా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం ఎదుట ఉన్న డస్ట్‌బిన్‌లో వెలుగు చూడడం కలకలాన్ని సృష్టిస్తోంది. జిల్లా రిజిస్ర్టార్ వ్యక్తిగత సెలవులో ఉండటంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారుతోంది. ఆ స్టాంపు పేపర్ల బండిల్స్ అన్నీ సంతకాలతో కూడుకుని ఉన్నాయి. ఇవి ఎవరి చేతిలో అయినా పడితే దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి బాధ్యతారాహిత్యానికి కారకులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రజ్యోతి, విజయవాడ : రిజిస్ర్టేషన్ల శాఖలో కొద్దికాలం క్రితం చలానాలు, స్టాంపుల ఆర్థిక అవకతవకలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. జిల్లావ్యాప్తంగా అవకతకవలు జరిగాయని అనుమానించిన అధికారులు పలు సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలోని డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండార్లపై దాడులు జరిపారు. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీన పటమటలోని ఠాగూర్ టైప్ ఇన్స్టిట్యూట్పై కూడా దాడి చేశారు. లైసెన్స్డ్ స్టాంప్ వెండార్ ఎస్.శ్రీనివాసరావు నుంచి స్టాంపు పేపర్లు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రూ.95 వేల లావాదేవీలకు సంబంధించి చలానా ట్యాంపరింగ్ ద్వారా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించామని పేర్కొంటూ, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించినందుకు ఆ స్టాంప్ వెండార్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ మరుసటి రోజే శ్రీనివాసరావు తాను బ్యాంకుకు చెక్కు రూపంలో చెల్లించిన చలానా లావాదేవీ వివరాలను సబ్‌రిజిస్ర్టార్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సబ్‌రిజిస్ర్టార్ ఇందుకు సంబంధించిన ఒక నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. బ్యాంకుకు చెక్కు రూపంలో చలానా కట్టారని, అదే రోజు బ్యాంకు లావాదేవీలో చూపించిందని, అయితే సీఎఫ్ఎంఎస్లో పెండింగ్‌లో చూపించిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆ తర్వాత శ్రీనివాసరావు తన లైసెన్స్‌ను పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు అర్జీ పెట్టుకున్నారు. అయినా రిజిస్ర్టేషన్ శాఖ లైసెన్స్ సస్పెన్షన్ ఎత్తివేయలేదు.
అవి తనవేనంటూ వచ్చిన స్టాంప్ వెండార్
ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే గురువారం పటమట సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెత్తబుట్టలో రూ.100, రూ.10 స్టాంప్ పేపర్లు, సేల్ రిజిస్టర్లు వెలుగు చూశాయి. ఇవి వెలుగులోకి రాగానే.. స్టాంప్ వెండార్ శ్రీనివాసరావు ప్రెస్‌మీట్ పెట్టి రిజిస్ర్టేషన్ శాఖ అధికారుల మీద సంచలన ఆరోపణలు చేశారు. తన నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డులను చెత్తలో పారవేశారని, తన తప్పు లేకపోయినా.. తన కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం అడిగితే ఇవ్వలేదనే కారణంతో ఆరు నెలలుగా తన లైసెన్స్‌ను పునరుద్ధరించటం లేదని ఆరోపణలు చేశారు. స్టాంప్ వెండార్ ఆరోపణలను రిజిస్ర్టేషన్ శాఖ అధికారులు ఖండిస్తున్నారు. అతని ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టి పారవేస్తున్నారు.
నేను తప్పు చేయలేదు..
నేనేమీ తప్పు చేయలేదు. చలానా ట్యాంపరింగ్ చేశానని నా లైసెన్స్ సస్పెండ్ చేశారు. నేను ట్యాంపరింగ్ చేయలేదని రుజువు చేసుకున్నా. చెక్కు ద్వారా చలానా కట్టిన బ్యాంకు రిపోర్టును సబ్ రిజిస్ర్టార్‌కు అందించాను. ఆయన పరిశీలించి, చలానా ట్యాంపరింగ్ జరగలేదని ఉన్నతాధికారులకు నివేదిక కూడా ఇచ్చారు. అయినా సస్పెన్షన్ ఎత్తివేయకుండా.. ఇబ్బంది పెడుతున్నారు. నా నుంచి స్టాంపు పేపర్లు తీసుకువెళ్లేటపుడు పంచనామా చేయలేదు. ఎన్ని తీసుకు వెళుతున్నారనే లెక్క లేదు. నాకు నోటీసు ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కువ తక్కువలు ఉన్నాయంటే ఎవరిది బాధ్యత? నా చలానాను సబ్‌రిజిస్ర్టార్ ఆఫీసులో పనిచేసే అశోక్ అనే ప్రైవేటు వ్యక్తి ట్యాంపరింగ్ చేశాడు. అతనిని కాపాడటం కోసం నన్ను బలిపశువును చేయాలని చూశారు. లైసెన్స్ పునరుద్ధరించమంటే సిబ్బంది చేత లంచం అడిగిస్తున్నారు. ఈ రోజు స్టాంపు పేపర్లు చెత్తబుట్టలో కనిపించాయని ఫోన్ సమాచారం రావడంతో సహించలేక ఇప్పటి వరకు జరిగిన విషయాలను మీడియా ముందు వెల్లడించాను. నా ఉపాధిని దెబ్బకొట్టవద్దని వేడుకుంటున్నాను. - ఎస్.శ్రీనివాసరావు, స్టాంప్ వెండార్
అతని ఆరోపణలు అవాస్తవం
అతని నుంచి స్వాధీనం చేసుకున్న స్టాంపులు, రికార్డులు అన్నీ మా దగ్గర భద్రంగా ఉన్నాయి. వెలుగు చూసినవాటికి, మాకు సంబంధం లేదు. అతను తప్పు చేశాడు కాబట్టే చర్య తీసుకున్నాము. ఈ వ్యవహారం డీఆర్ పరిధిలోనిది. ఆమె సెలవులో ఉన్నారు. డీఆర్ చెప్పిన ప్రకారమే పక్కా ఆధారాలతో అతనిని పట్టుకున్నారు. చలానా ట్యాంపరింగ్ విషయంలో అతను ముందు తప్పు చేశాడు. తరువాత సరిచేసుకున్నాడు. అయినప్పటికీ స్టాంపుల్లో ఎక్కువ తక్కువలను గుర్తించాము. డీఆర్ సమక్షంలో తాను తప్పు చేసినట్టు అంగీకరించాడు కూడా. - రవీంద్ర, డీఐజీ, రిజిస్ర్టేషన్ శాఖ
సేల్ రిజిస్టర్