బ్లాక్‌ మార్కెట్‌లో స్టాంప్‌ పేపర్లు

ABN , First Publish Date - 2021-02-28T04:59:34+05:30 IST

బ్లాక్‌ మార్కెట్‌లో స్టాంప్‌ పేపర్లు

బ్లాక్‌ మార్కెట్‌లో స్టాంప్‌ పేపర్లు

దొరకని రూ.10, 20, 50 పేపర్లు ఫ పట్టించుకోని యంత్రాంగం

షాద్‌నగర్‌అర్బన్‌: మార్కెట్లో నాన్‌-జూడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల కొరత తీవ్రమైంది. 10, 20, 50 రూపాయల పేపర్లు దొరకడం లేదు. కేవలం వంద రూపాయల పేపర్లు మాత్రమే లభిస్తున్నాయి. వంద రూపాయల స్టాంప్‌ పేపర్‌ను రూ.150 రూపాయలకు విక్రయిస్తున్నారు. రెవెన్యూ టికెట్‌తో పాటు ఎలాంటి స్టాంప్‌ పేపరు కావాలన్నా ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసి, రసీదు తీసుకుని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళితేనే స్టాంప్‌ పేపర్లు ఇస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ పేమెంట్‌ కోసం డబ్బులు తీసుకుంటున్నందున చాలామంది స్టాంప్‌ పేపర్‌ వెండర్ల వద్దనే కొనుగోలు చేస్తున్నారు. ప్రజల అవసరాన్ని గమనిస్తున్న స్టాంప్‌వెండర్లు రూ.100 స్టాంప్‌పేపర్‌ను రూ.150కి విక్రయిస్తున్నారు. విద్యార్థుల స్కాలర్‌షి్‌పతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ రిజిస్ట్రేషన్‌ వివాహాలు, ఎల్‌ఐసీ పాలసీదారుల పేర్ల సవరణలకు అఫిడవిట్‌ అవసరమవుతుంది. రూ.10 స్టాంప్‌ పేపర్‌పై చేయాల్సిన అఫిడవిట్‌ను స్టాంపుల కొరతతో రూ.100 పేపరును రూ.150కు కొనుగోలు చేసి అఫిడవిట్‌ చేయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్టాంపుల కొరతతో ప్రజలపై ఆర్థికంగా భారంపడుతోంది. ప్రభుత్వం రూ.10, రూ.20, రూ.50ల స్టాంప్‌ పేపర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చి బ్లాక్‌ మార్కెట్‌లో అత్యధిక ధరకు విక్రయిస్తున్న స్టాంప్‌వెండర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-02-28T04:59:34+05:30 IST