మోదీ ప్రభుత్వం మరీ అంత బలహీనమా?: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2021-07-12T01:44:09+05:30 IST

గిరిజన హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి మృతిపై మోదీ ప్రభుత్వాన్ని శివసేన ఎంపీ..

మోదీ ప్రభుత్వం మరీ అంత బలహీనమా?: సంజయ్ రౌత్

న్యూఢిల్లీ: గిరిజన హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి మృతిపై మోదీ ప్రభుత్వాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. స్టాన్ స్వామి  మృతి చెందడంపై విమర్శలు గుప్పించారు. 84 ఏళ్ల వృద్ధుడు (స్టాన్ స్వామి) నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చేటంతటి  బలహీనంగా దేశ పునాదులు ఉన్నాయా అని సంజయ్ రౌత్ 'సామ్నా' సంపాదకీయంలో ప్రశ్నించారు.


ఎల్గార్ పరిషత్ కేసులో గత అక్టోబర్‌ మాసలో స్టాన్ స్వామిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. జ్యూడిషియల్ కస్టడీలో ఉండగానే ఈనెల 5న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై సంజయ్ రౌత్ తన సంపాదకీయంలో మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తూనే, ఇందిరాగాంధీ గతంలో ఫెర్నాండెజ్‌పై చేసిన ఆరోపణలతో పోల్చారు. ''జార్జి ఫెర్నాండెజ్‌ అంటే ఇందిరాగాంధీ బయపడేవారు. అప్పుడు ఆయన యువ నాయకుడు. స్టాన్ స్వామిలా వృద్ధుడు కాదు. కానీ, ఇవాళ ప్రభుత్వం 84-85 ఏళ్ల స్టాన్ స్వామి, వరవర రావు వంటి వాళ్లకు భయపడుతోంది. జైలులోనే స్టాన్ స్వామిని చంపేశారు'' అని సంజయ్ రౌత్ అన్నారు. 84 ఏళ్ల వృద్ధుడికి బయపడుతున్న ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నప్పటికీ, హిట్లర్, ముసోలినీ తరహాలో బలహీన మనస్తత్వమని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఎల్గార్ పరిషత్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడాన్ని సమర్ధించలేమని, అయితే ఆ తర్వాత జరిగిన ఘటనలను స్వేచ్ఛపై జరిగిన దాడిగానే చెప్పాల్సి ఉంటుందని రౌత్ అన్నారు.

Updated Date - 2021-07-12T01:44:09+05:30 IST