నేడు స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక

ABN , First Publish Date - 2021-07-27T05:37:50+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) స్టాండింగ్‌ కమిటీ (స్థాయీ సంఘం) ఎన్నిక మంగళవారం జరగనున్నది.

నేడు స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక

పది స్థానాలకు వైసీపీ, టీడీపీ పోటీ


విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) స్టాండింగ్‌ కమిటీ (స్థాయీ సంఘం) ఎన్నిక మంగళవారం జరగనున్నది. కౌన్సిల్‌ హాల్‌లో మేయర్‌ జీహెచ్‌వీ కుమారి అధ్యక్షతన ఉదయం పది గంటలకు ఎన్నిక ప్రారంభమవుతుంది. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. స్టాండింగ్‌ కమిటీ కోసం వైసీపీ నుంచి పది మంది, టీడీపీ నుంచి పది మంది కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. ప్రతి పది మంది కార్పొరేటర్లకు ఒకరు చొప్పున 98 మంది కార్పొరేటర్లకు పది మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. జీవీఎంసీ ఆస్తుల లీజులు, వేలంలతోపాటు ముఖ్యమైన నిర్ణయాలను స్టాండింగ్‌ కమిటీయే తీసుకుంటుంది. రూ.50 లక్షల విలువ వరకూ గల పనులపై స్టాండింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. స్టాండింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను తిరిగి కౌన్సిల్‌లో ఆమోదించాల్సిన అవసరం ఉండదు. 


స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థికి 98 మంది కార్పొరేటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది. టీడీపీ కార్పొరేటర్‌ ఒకరు, వైసీపీ కార్పొరేటర్‌ ఒకరు మృతిచెందడంతో ప్రస్తుతం 96 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే కనీసం 48 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఒక్కో కార్పొరేటర్‌కు ఇచ్చే బ్యాలెట్‌ పేపర్‌లో టీడీపీ, వైసీపీలకు చెందిన 20 మంది అభ్యర్థుల పేర్లు (ఒక్కో పార్టీ నుంచి పదేసి మంది) ఉంటాయి. వారిలో తమకు నచ్చిన పది మంది పేర్లకు ఎదురుగా టిక్‌ పెట్టి ఓటేయాల్సి ఉంటుంది. ఒక కార్పొరేటర్‌ కచ్చితంగా పది మందికి ఓటెయ్యాలి. 11 మందికి ఓటు వేస్తే ఆ ఓటు చెల్లుబాటుకాదు. ఇక కౌన్సిల్‌లో బలాబలాల విషయానికి వస్తే వైసీపీకి 57 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇండిపెండెంట్లుగా గెలిచి నలుగురు కార్పొరేటర్లు వైసీపీలో చేరిపోయారు. అలాగే టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు వైసీపీకి మద్దతు తెలుపుతున్నట్టు చెబుతున్నారు. దీంతో కౌన్సిల్‌లో వైసీపీకి 63 మంది సభ్యుల బలం ఉంది. 


ఇక టీడీపీకి 27 మంది సభ్యులు ఉండగా, జనసేనకు ముగ్గురు, వామపక్షాలకు ఇద్దరు, భాజపా కార్పొరేటర్‌ ఒకరు (మొత్తం 33 మంది) ఉన్నారు. దీనిప్రకారం మొత్తం పది స్థానాలను వైసీపీయే కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ...అధికార పార్టీలో కొంతమంది అసంతృప్తులు క్రాస్‌ ఓటింగ్‌ వేస్తారని టీడీపీ ఆశలు పెట్టుకుంది. 


బరిలో ఉన్నవారి వివరాలు...


వైసీపీ నుంచి...జి.లావణ్య (58వ వార్డు కార్పొరేటర్‌), చెన్నా జానకీరామ్‌ (37వ వార్డు), మందపాటి సునీత (82వ వార్డు), తిప్పల వంశీరెడ్డి (74వ వార్డు), వి.రామచంద్రరావు (70వ వార్డు), ముమ్మన దేవుడు (95వ వార్డు), కేబీఎన్‌ శశికళ (55వ వార్డు), డి.ఏడుకొండలరావు (నాలుగో వార్డు), మొల్లి లక్ష్మి (16వ వార్డు), వావిలాపల్లి ప్రసాద్‌ (50వ వార్డు).


టీడీపీ నుంచి...గంటా అప్పలకొండ (మూడో వార్డు), పిల్లా మంగమ్మ (ఏడో వార్డు), గొలగాని వీరారావు (27వ వార్డు), గోడి విజయలక్ష్మి (38వ వార్డు), శరగడం రాజశేఖర్‌ (56వ వార్డు), పులి లక్ష్మీబాయి (75వ వార్డు), రౌతు శ్రీనివాసు (79వ వార్డు), మాదంశెట్టి చినతల్లి (84వ వార్డు), బొమ్మిడి రమణ (90వ వార్డు), బళ్ల శ్రీనివాసరావు (94వ వార్డు) పోటీలో ఉన్నారు.

Updated Date - 2021-07-27T05:37:50+05:30 IST