స్టార్‌ అడ్వకేట్‌!

ABN , First Publish Date - 2021-01-03T05:30:00+05:30 IST

క్రిమినల్‌ లాయర్‌ కావాలనేది నా చిన్ననాటి కల. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నల్లకోటు వేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నా. అందుకు కారణం మా తాతయ్యగారు.

స్టార్‌ అడ్వకేట్‌!

‘డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యా’ - కొందరు తారలు చెప్పే మాటే! మాళవికా శర్మ డాక్టర్‌ కావాలనుకోలేదు! క్రిమినల్‌ లాయర్‌ కావాలని కలలుగన్నారు! అలాగే, కథానాయిక కావాలనే మరో కలా కన్నారు! తన రెండు కలలనూ మాళవిక నెరవేర్చుకున్నారు. ఇంతకీ, క్రిమినల్‌ లాయర్‌ కావాలనే కల వెనుక కథేంటి? కరోనా కాలంలో ఏం చేశారేంటి? వంటి ప్రశ్నలకు హీరోయిన్‌ కమ్‌ క్రిమినల్‌ లాయర్‌...మాళవికా శర్మ చెప్పిన కబుర్లు ‘నవ్య’ పాఠకుల కోసం!


క్రిమినల్‌ లాయర్‌ కావాలనేది నా చిన్ననాటి కల. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నల్లకోటు వేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నా. అందుకు కారణం మా తాతయ్యగారు. ఆయన క్రిమినల్‌ లాయర్‌. చిన్నతనంలో ఆయన ఛాంబర్‌కు వెళ్తుండేదాన్ని. అప్పుడప్పుడూ లా పుస్తకాలు చదవాలని ప్రయత్నించేదాన్ని (నవ్వులు). నా పదేళ్ల వయసులో తాతయ్య మరణించారు. దాంతో నేను ‘క్రిమినల్‌ లా’ చదవాలనుకొన్నా. 


అయితే, మా కుటుంబ సభ్యులు వద్దని నాతో చెప్పారు. సివిల్‌ లేదా కార్పొరేట్‌ లాయర్‌ అవమనీ, రిస్క్‌ తీసుకోవద్దన్నారు. కానీ, నేను వెనకడుగు వేయలేదు. గత ఏడాది ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశా. ఇప్పుడు మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నా. ఎల్‌ఎల్‌ఎమ్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ క్లియర్‌ చేశా. మీకో విషయం తెలుసా? ఎల్‌ఎల్‌బీ చేసేటప్పుడు హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్‌ చేశా. ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌ వి. పట్టాభిగారి దగ్గర! క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌ చేశా.




మహిళలు తక్కువే!

నాంపల్లి క్రిమినల్‌ కోర్టు బిల్డింగులో నేను గమనించిన విషయం... అక్కడ . మహిళా న్యాయవాదులు ఎవరూ లేరు. నాకది ఆశ్చర్యంగా అనిపించింది. ఓ రోజు ఎవరో ఒక మహిళ కనిపించారంతే! ‘క్రిమినల్‌ కోర్టులో మహిళా న్యాయవాదులు ఎందుకు లేరు?’ అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కలిగింది. జూనియర్‌ లాయర్లు కొందర్ని అడిగా. బహుశా... క్రిమినల్‌ జోన్‌లోకి వెళ్లడానికి మహిళా న్యాయవాదులు భయపడుతు న్నారనుకుంటా! క్రిమినల్‌ కేసులు వాదించాలంటే నేరస్థులతో మాట్లాక తప్పదు కదా! అందుకని, భయపడుతున్నారేమో? అందుకే, మా కుటుంబ సభ్యులు సైతం రిస్క్‌ ఎందుకని ‘క్రిమినల్‌ లాయర్‌’గా వద్దని చెప్పారేమో!? ‘మహిళలకు మాత్రమే కాదు... క్రిమినల్‌ జోన్‌లో మగవాళ్లకూ రిస్కే’ అనేది నా అభిప్రాయం. అందుకని, భయపడలేదు.


విమానంలో చదువుతా!

న్యాయవాద వృత్తికి, నటనకు అసలు సంబంధం లేదు. రెండూ వేర్వేరు రంగాలు. ‘లా నుంచి వాణిజ్య ప్రకటనలు, చిత్రాల్లోకి ఎలా వచ్చారు?’ అని కొందరు అడుగుతుంటారు. నాకు సినిమాలంటే మక్కువ. నటన అంటే ఇష్టం. ఓ వైపు చిత్రాలు... మరోవైపు చదువు... రెండు పడవల ప్రయాణం నాకేమీ ఇబ్బంది కాదు! ‘నేల టికెట్‌’ విడుదలప్పుడు ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్స్‌ జరిగాయి. ఉదయం ముంబైలో పరీక్ష రాయడం, మధ్యాహ్నం విమానం ఎక్కి హైదరాబాద్‌ వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మళ్లీ రాత్రి ముంబై వెళ్లడం, ఉదయం పరీక్ష రాయడం... కొన్ని రోజుల పాటు నా దినచర్య అదే.


గోవాలో ‘రెడ్‌’ చిత్రీకరణ చేసినప్పుడూ మధ్యలో ముంబై వెళ్లి పరీక్షలు రాశా. అప్పుడు విమానంలో చదివాను (నవ్వులు). నేను పరీక్షలకు ఒకరోజు ముందు చదువుతా. పరీక్షల సమయంలో చిత్రీకరణలు ఉంటే విమానంలో చదువుతా. నాకు మల్టీటాస్కింగ్‌ అలవాటే. సినిమాలు చేస్తూనే... ఎల్‌ఎల్‌ఎమ్‌ చేయాలనుకుంటున్నా. రెండు రంగాల్లో రాణించాలనేది నా లక్ష్యం. రామ్‌ సరసన నేను నటించిన ‘రెడ్‌’ సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ ఏడాది తమిళ తెరకు పరిచయం కాబోతున్నా. తెలుగు చిత్రాలు చర్చలూ దశలో ఉన్నాయి. త్వరలో నిర్మాతలే వాటి వివరాలు వెల్లడిస్తారు.




శ్రీశైల మల్లన్న సన్నిధిలో...

నాకు భక్తి ఎక్కువే. జనవరి 1న శ్రీశైలంలోని మల్లన్న సన్నిధికి వెళ్లా. దర్శనం చేసుకున్నా. మామూలుగా ముంబైలో ఉంటే... జుహూలోని శనీశ్వర దేవాలయానికి వెళ్తుంటా. సోమ, మంగళ, గురు, శని... వారంలో నాలుగు రోజులు ఉపవాసాలు ఉన్న రోజులున్నాయి. నేను మథురకి చెందిన బ్రాహ్మణ అమ్మాయిని! కుటుంబ నేపథ్యం వల్ల భక్తి భావనలు ఎక్కువ అనుకుంటాను. నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకున్నా.


గత ఏడాది కరోనా వలన ఎక్కువ రోజులు ప్రజలంతా ఇళ్లలో ఉన్నారు. నేనయితే కాలేజీకి వెళ్లలేదు.. కథక్‌ క్లాసులకు వెళ్లలేదు.. యాక్టింగ్‌ వర్క్‌షాప్స్‌ లేవు.. షూటింగుల్లేవ్‌... ఎంత విసుగొచ్చిందో చెప్పలేను. లాక్‌డౌన్‌లో జరిగిన మంచి విషయం ఏంటంటే... సాధారణ రోజుల్లో కాలేజీ, షూటింగుల వలన కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. కరోనా వల్ల ఇంటికి పరిమితం అవడంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడిపా. వంట నేర్చుకున్నా. ఇప్పుడు చదువు, సినిమాలతో మళ్లీ బిజీ అయ్యాను.




అప్పట్లో ఆడిషన్స్‌కీ వెళ్లలేదు!

‘నేల టికెట్‌’ తర్వాత బరువు పెరిగా. 2019లో 59 కేజీలున్నా. నా మీద నాకు కాన్ఫిడెన్స్‌ పోయింది. అందుకని, అప్పట్లో మూవీ ఆడిషన్స్‌కీ వెళ్లలేదు. వాణిజ్య ప్రకటనలు చేయడమూ మానేశా. ‘59 కేజీలున్నాను. ఏమీ చేయలేను’ అని ఫీలయ్యేదాన్ని. ‘మలబార్‌ గోల్డ్‌’ యాడ్‌లో ఫ్యాటీగా ఉన్నానని అనుకున్నా. దాంతో బరువు తగ్గాలని బలంగా నిర్ణయించుకున్నా. పిలాటీస్‌, కిక్‌ బాక్సింగ్‌, డాన్స్‌... అన్నీ చేశా. పక్కా డైట్‌ తీసుకున్నా. నెలన్నరలో 10 కేజీలు తగ్గాను.


అయితే... అమ్మాయిలందరూ 50 కేజీలలోపే ఉండాలని చెప్పడం లేదు. తమ బరువు పట్ల వాళ్లు సౌకర్యవంతంగా ఉన్నట్టయితే  తగ్గాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫిట్‌గా ఉంటే చాలంతే! ఎప్పుడైతే బరువు పెరిగామనే ఫీలింగ్‌ కలుగుతుందో... దాంతో పాటు బద్దకం కూడా పెరుగుతుంది. నా విషయంలో జరిగిందదే! దుస్తుల విషయంలోనూ సౌకర్యవంతంగా ఉన్నవి వేసుకోవాలి. అసౌకర్యవంతంగా అనిపిస్తే... వాటిని పక్కన పెట్టేయాలి.


 సత్య పులగం


Updated Date - 2021-01-03T05:30:00+05:30 IST